
హైదరాబాద్ : 20-20 క్రికెట్ ఆసియా కప్ లో పాకిస్తాన్ పై ఇండియా గెలిచిందన్న ఆనందంలో సంబరాలు చేసుకున్నారు. అర్ధరాత్రి వరకు మద్యం సేవించి.. పొద్దు పోయేవరకు డ్యాన్సులు చేశారు. ఉదయాన్నే ఛాతి నొప్పితో యువకుడు మృతి చెందిన సంఘటన రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
సీఐ ఎన్. తిరుపతి కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. కర్ణాటకకు చెందిన ప్రకాష్ (26) నాలుగేళ్ల క్రితం బతుకుదెరువు కోసం హైదరాబాద్ వచ్చాడు. అంజయ్య నగర్ లోని పద్మా నిలయంలో ఉంటూ కొండాపూర్ లోని ఎయిర్టెల్ డిటిహెచ్ లో టెక్నీషియన్ గా పని చేస్తున్నాడు. ఆదివారం రాత్రి ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ చూశారు. ఇండియా గెలవడంతో స్నేహితులతో కలిసి తెల్లవారుజామున రెండు గంటల వరకు మద్యం తాగి డాన్స్ చేశారు.
ఆ సమయంలో ఛాతిలో నొప్పిగా ఉందని చెప్పిన ప్రకాష్ నిద్రకు ఉపక్రమించాడు. ఉదయం నిద్రలేచిన తర్వాత అతను కొద్దిసేపు వాకింగ్ చేసి మళ్ళీ ఛాతీలో నొప్పి వస్తోందని.. రెస్ట్ తీసుకుంటానని గదిలోకి వెళ్లి పడుకున్నాడు. ఆ తర్వాత కాసేపటికి స్నేహితులు అతడి నిలిపేందుకు ప్రయత్నించగా అపస్మారక స్థితిలో ఉన్నాడు. వెంటనే గచ్చిబౌలిలోని ఆసుపత్రికి తరలించగా అప్పటికే అతను మృతి చెందినట్లు డ్యూటీ డాక్టర్ ధ్రువీకరించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదిలా ఉండగా, ఆసియా కప్లో భాగంగా భారత్ చిరకాల ప్రత్యర్థి పాక్ పై భారీ విజయం సాధించడం పట్ల ప్రధాని నరేంద్ర మోడీ స్పందించారు. టీమిండియా ఆటగాళ్లకు అభినందనలు తెలుపుతూ ట్వీట్ చేశారు. ‘భారత్ ఈ రోజు అద్భుతమైన ఆల్రౌండ్ ప్రదర్శన చేసింది. గొప్ప నైపుణ్యం కనబరిచింది. ఈ మ్యాచ్లో విజయం సాధించిన భారత జట్టుకు అభినందనలు’ అంటూ ట్వీట్ చేశారు. దాయాదుల సమరంలో భాగంగా మొదట టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్ 147 పరుగులకే ప్రత్యర్థి జట్టును పరిమితం చేసింది. ఆ తర్వాత 148 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 19.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరింది.
మ్యాచ్ మొత్తం ఉత్కంఠగా సాగుతున్న తరుణంలో హార్థిక్ పాండ్య (33 నాటౌట్) సిక్స్తో భారత్ ను విజయతీరాలకు చేర్చాడు.భారత జట్టులో విరాట్ కోహ్లీ (35), రవీంద్ర జడేజా(35) కీలక ఇన్నింగ్స్ ఆడారు. బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ నాలుగు వికెట్లు, హార్దిక్ పాండ్యా మూడు వికెట్లు తీసి పాక్ ను కోలుకోలేని దెబ్బ తీశారు. ఆల్ రౌండర్ ప్రదర్శన చేసిన పాండ్యా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా ఎంపికయ్యాడు. యూఏఈ వేదికగా జరుగుతున్న ఆసియా కప్ ట్వంటీ-20 లో భాగంగా పాకిస్తాన్ నిర్దేశించిన 148 పరుగుల లక్ష్య ఛేదనలో భారత్ తడబడినా చివర్లో ధాటిగా ఆడి విజయం సాధించింది.