బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్‌ సస్పెన్షన్ ఒక‌ డ్రామా.. : అస‌దుద్దీన్ ఒవైసీ

By Mahesh RajamoniFirst Published Aug 30, 2022, 1:04 AM IST
Highlights

బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్‌ సస్పెన్షన్ ఒక‌ డ్రామా అని హైద‌రాబాద్ పార్ల‌మెంట్ స‌భ్యులు అసదుద్దీన్‌ ఒవైసీ అన్నారు. తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్) పార్టీ ప్ర‌భుత్వం ఉండటం వల్లే రాజా సింగ్‌ను కటకటాల వెనక్కి నెట్టారని ఒవైసీ స్పష్టం చేశారు.
 

హైదరాబాద్ : మహ్మద్ ప్రవక్తపై భారతీయ జనతా పార్టీ  (బీజేపీ) ఎమ్మెల్యే రాజా సింగ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై ఆలిండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ పార్టీ (AIMIM) అధ్యక్షుడు, హైదరాబాద్ పార్ల‌మెంట్ స‌భ్యులు అసదుద్దీన్ ఒవైసీ మ‌రోసారి మండిపడ్డారు. బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్‌ సస్పెన్షన్ ఒక‌ డ్రామా అని ఆరోపించారు. మ‌హ‌మ్మ‌ద్ ప్రవక్తపై చేసిన వ్యాఖ్యల తర్వాత ఇప్పుడు సస్పెండ్ చేయబడిన బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్‌కు అధికార పార్టీ తెలంగాణ యూనిట్ షోకాజ్ నోటీసు పంపింది. అనేక ఎఫ్‌ఐఆర్‌లు, నగరవ్యాప్తంగా నిరసనలు, ఆగస్టు 23న అతని అరెస్టుకు విఫలయత్నం చేసిన తరువాత, చివరకు ఆగస్టు 25న ఎమ్మెల్యే రాజాసింగ్ ను నగర పోలీసులు అరెస్టు చేశారు.

బీజేపీ నుంచి రాజా సింగ్‌ను సస్పెండ్ చేయడం కాషాయ పార్టీ ఆడుతున్న డ్రామా అని ఒవైసీ ఆరోపించారు. ముస్లిం సమాజం మనోభావాలను దెబ్బతీసే విధంగా రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలకు దూరంగా ఉన్నా ఇప్పుడు ఆయన విడుదలకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్) పార్టీ ఉండటం వల్లే రాజా సింగ్‌ను కటకటాల వెనక్కి నెట్టారని ఒవైసీ స్పష్టం చేశారు. ప్రవక్త ముహమ్మద్‌పై దైవదూషణకు పాల్పడి ఇప్పుడు సస్పెండ్ చేయబడిన బీజేపీ  జాతీయ అధికార ప్రతినిధి కూడా ఢిల్లీలో తమ (బీజేపీ) నియంత్రణలో ఉన్న పోలీసులు కాకపోతే కటకటాల వెనుక ఉంటారని కూడా అన్నారు. బీజేపీ ప్రభుత్వం నూపుర్ శర్మను అరెస్టు చేయడానికి బదులు ఆమెకు భద్రత కల్పిస్తోందని ఒవైసీ ఆరోపించారు.

కాగా, బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్  ఇటీవల యూట్యూబ్ లో విడుదల  చేసిన వీడియోలో మహమ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యల నేపథ్యంలో హైదరాబాద్ నగరంలో పెద్దఎత్తున నిరసనలు కొనసాగాయి. హైదరాబాద్ ఓల్డ్ సిటీలో ఆందోళనలు, నిరసనల కారణంగా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. రాజాసింగ్ పై అనేక చోట్ల చేసులు నమోదయ్యాయి. అయితే, కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో నిరసనలు మరింతగా ముదిరాయి. పోలీసులు శాంతిభద్రతలకు విఘాతం కలిగించడంతో పాటు పలు సెక్షన్ల కింద పీడి యాక్ట్ కేసు నమోదుచేశారు. రాజా సింగ్ ను మళ్లీ అరెస్టు చేశారు. ఇప్పటికే బీజేపీకి చెందిన పలువురు నాయకులు ఈ తరహా వ్యాఖ్యలు చేసి.. వివాదాలకు కారణమయ్యారు. బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నుపూర్ శర్మ సైతం మహమ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆమె వ్యాఖ్యలు దేశంలోని అనేక ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులను ఏర్పర్చాయి. అనేక రాష్ట్రాల్లో ఆమె వ్యాఖ్యలను ఖండిస్తూ.. నిరసనలు, ఆందోళనలు కొనసాగాయి. దీంతో బీజేపీ ఆమెను సస్పెండ్ చేసింది.

నుపూర్ శర్మ వ్యాఖ్యలు కేవలం దేశంలోనే కాకుండా అంతర్జాతీయంగానూ తీవ్ర దుమారం రేపాయి. ముస్లిం దేశాలు భారత ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. భారత్ బహిరంగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశాయి. అంతటితో ఆగకుండా భారత ప్రొడక్టుల అమ్మకాలను సైతం పలు దేశాలు నిషేధం విధించాయి. ఈ క్రమంలోనే భారత్ స్పందిస్తూ నుపూర్ శర్మ వ్యాఖ్యలు  ఆమె వ్యక్తిగతమనీ, భారత ప్రభుత్వ వ్యాఖ్యలను ప్రతిబింబించవని పేర్కొంది.

click me!