కారెక్కేందుకు ఎల్. రమణ పెట్టిన డిమాండ్ ఇదే: వెయిట్ అండ్ సీ గేమ్

By telugu teamFirst Published Jun 18, 2021, 8:05 AM IST
Highlights

టీఆర్ఎస్ లో చేరే విషయంపై టీడీపీ తెలంగాణ అధ్యక్షుడు ఎల్ రమణ వెయిట్ అండ్ సీ గేమ్ ఆడుతున్నట్లు తెలుస్తోంది. తనకు సరైన అవకాశం కల్పించే ఆఫర్ వచ్చినప్పుడే నిర్ణయం తీసుకోవాలని ఆయన భావిస్తున్నారు.

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్)లో చేరేందుకు తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ వెయిట్ అండ్ సీ గేమ్ ఆడుతున్నట్లు తెలుస్తోంది. పార్టీ మార్పుపై ఇప్పటికిప్పుడు నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఏమీ లేదని, సాధారణ ఎన్నికలకు ఇంకా సమయం ఉందని ఆయన అంటున్నట్లు తెలుస్తోంది. మంత్రివర్గం నుంచి ఈటల రాజేందర్ ను తప్పించినప్పటి నుంచే టీఆర్ఎస్ నాయకత్వం ఎల్ రమణతో సంప్రదింపులు ప్రారంభించింది. 

పార్టీలో చేరితే ఎమ్మెల్సీ పదవి ఇస్తామని టీఆర్ఎస్ నాయకత్వం ఆయనకు చెప్పినట్లు తెలుస్తోంది. అయితే, తనకు వెంటనే మంత్రి పదవి ఇవ్వాలని ఆయన పట్టుడుతున్నట్లు తెలుస్తోంది. దాంతో సంప్రదింపులకు బ్రేక్ పడినట్లు చెబుతున్నారు. హైదరాబాద్ - రంగారెడ్డి - మహబూబ్ నగర్ గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో ఆయన టీడీపీ తరఫున పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 

Latest Videos

రాష్ట్రంలో రాజకీయాలు అనూహ్యంగా మారుతున్నాయని, ఈ స్థితిలో సరైన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. తన సినియారటీకి తగిన ఆఫర్ వచ్చినప్పుడు మాత్రమే పార్టీ మార్పుపై నిర్ణయం తీసుకోవాలని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది. 

ఎల్ రమణను పార్టీలోకి ఆహ్వానించడానికి చాలా కాలంగా టీఆర్ఎస్ నాయకత్వం ప్రయత్నాలు సాగిస్తూనే ఉంది. అయితే, తాను టీడీపీని వీడేది లేదని అంటూ వచ్చారు. అయితే, ప్రస్తుతం రాష్ట్రంలో టీడీపీ అవకాశాలు కనుచూపు మేరలో కూడా లేవని ప్రస్తుతం ఆయన తన అనుచరులతో అంటున్నట్లు తెలుస్తోంది. దీంతో పార్టీ మారేందుకు సిద్ధంగానే ఉన్నట్లు సమాచారం. అయితే, తనకు తగిన ఆఫర్ వస్తేనే పార్టీ మారాలనే ఉద్దేశంతో ఉన్నారు. 

తమ పార్టీలో చేరాలని బిజెపి నాయకులు కూడా ఎల్ రమణను కోరినట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో కరీంనగర్, నిజామాబాద్ లోకసభ స్థానాల్లో బిజెపిని ఓడించాలనే పట్టుదలతో టీఆర్ఎస్ ఉంది. అదే సమయంలో హుజూరాబాద్ శాసనసభ ఉప ఎన్నికల్లో కూడా విజయం సాధించాలనే ఉద్దేశంతో ఉంది. రమణ పార్టీలో చేరితే జగిత్యాలలో తమ బలం పెరుగుతుందని భావిస్తోంది. జగిత్యాల నిజామాబాద్ లోకసభ పరిధిలోకి వస్తుంది. అదే సమయంలో కరీంనగర్ లోకసభ పరిధిలోని హుజూరాబాద్ లో బీసీ ఓటర్లు గణనీయమైన సంఖ్యలో ఉన్నారు. దాంతో ఎల్. రమణను పార్టీలోకి తేవడానికి ప్రయత్నాలు సాగిస్తున్నట్లు సమాచారం. 

బీసీ వర్గాలకు చెందిన ఎల్ రమణ గతంలో కరీంనగర్ జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా, కరీంనగర్ ఎంపీగా, జగిత్యాల ఎమ్మెల్యేగా పనిచేశారు. అందువల్ల ఎల్ రమణ టీఆర్ఎస్ లోకి వస్తే తమకు అదనపు ప్రయోజనం చేకూరుతుందని టీఆర్ఎస్ నాయకులు అంటున్నారు. 

click me!