ఆటో కిరాయిల పథకం దేశంలో ఎక్కడైనా ఉందా ?

First Published Jan 16, 2018, 6:45 PM IST
Highlights
  • విద్యారంగంపై నిర్లక్ష్యం
  • ఎపిలో రెండు డిఎస్సీలు వేసినా.. తెలంగాణలో ఏవీ
  • ఆటో కిరాయిల పథకంతో కేజి పిజి ఉచిత విద్య వస్తదా?
  • బాధ్యత లేని పాలకుల వల్ల తెలంగాణకు నష్టం

తెలంగాణ సర్కారు ప్రకటనలపై తెలంగాణ టిడిపి సీనియర్ నేత రావుల చంద్రశేఖరరెడ్డి ఫైర్ అయ్యారు. ఎన్టీఆర్ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. విద్యారంగం పట్ల తెలంగాణ సర్కారుకు ఏమాత్రం చిత్తశుద్ధి లేదని విమర్శించారు. కేజీ టు పిజి వరకు ఉచిత విద్యను అందిస్తామని ప్రగల్భాలు పలికి తీరా ఇప్పుడు ఉన్న స్కూల్స్ ని మూసివేశారని విమర్శించారు. ఉన్న స్కూల్స్ ని మూసివేసి ఆటో ఛార్జ్ ఇవ్వడం దేశంలో ఏ రాష్ట్రంలో అయినా ఉందా అని విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరిని నిలదీశారు.

స్కూళ్ల మూసివేత కోసం ఉద్దేశించిన జీవో 99 మనుగడలో ఉందా రద్దు చేశారా మంత్రి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం కొత్తగా గురుకులాలను ఏర్పటు చేసింది కానీ వాటిలో చదివేందుకు పిల్లలు ఎక్కడ ఉన్నారో ప్రభుత్వం చెప్పాలన్నారు. గత మూడున్నర సంవత్సరాలలో పది లక్షల మంది పిల్లలు విద్యకు దూరం అయ్యారని అధికారిక లెక్కలు చెప్తున్నాయన్నారు. 4200 స్కూల్స్ కి 2లక్షల 10వేల చొప్పున కేంద్రం నిధులు ఇస్తే తెలంగాణ సర్కారు కేవలం ఒక్క స్కూల్ కి మాత్రమే ఖర్చు చేసిందని ఆరోపించారు. రాష్టంలో చదువు లేకుండా ఎన్ని పథకాలు పెట్టినా నిరుపయోగం అవుతాయన్నారు.

బంగారు తెలంగాణ కోసం రాష్టం సాదించుకుంటే...భాద్యత లేని పాలకుల వల్ల బాధల తెలంగాణగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. పదోతరగతి పిల్లలకు కూడా అ.. ఆ.. లు రాని పరిస్థితులు తెలంగాణలో దాపురించాయని ఆవేదన వ్యక్తం చేశారు. కేసిఆర్ పాలనలో ఇప్పటి వరకు 4637 స్కూల్స్ మూతపడ్డాయని తమకు సమాచారం ఉందన్నారు. పక్కనున్న ఆంధ్రా రాష్టంలో రెండు డిఎస్సీలు నిర్వహిస్తుంటే.. తెలంగాణ రాష్టంలో కనీసం ఒక్క డిఎస్సి కూడా వేయలేదన్నారు. ఢిల్లీ కి పోయినప్పుడు పొగడ్తలకే పరిమితం కాకుండా సమస్యలను కూడా చెప్పండి అని సర్కారుకు చురకలు అంటించారు.

click me!