కేసిఆర్ గురుకులాలు మంచి ఫలితాలిస్తున్నాయి

First Published Jan 16, 2018, 3:47 PM IST
Highlights
  • కేసిఆర్ ప్రారంభించిన గురుకులాలు మంచి ఫలితాలిస్తున్నాయి
  • నాణ్యమైన భోజనం అందించడంలో ముందున్నాం
  • బాలికా విద్యలో అగ్రస్థానంలో ఉంది తెలంగాణ

తెలంగాణలో సిఎం కేసిఆర్ నాయకత్వంలో షురూ చేసిన గురుకులాలు మంచి ఫలితాలిస్తున్నాయన్నారు ఉపముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి. ఉప ముఖ్యమంత్రి, విద్యా శాఖ మంత్రి కడియం శ్రీహరి  కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ నాయకత్వంలో రెండో రోజు(16.01.2018)  ఢిల్లీలో జరిగే సెంట్రల్ అడ్వైజరి బోర్డ్ ఆన్ ఎడ్యుకేషన్(కేబ్) సమావేశంలో పాల్గొంటున్నారు. ఆయన సమావేశానికి వెళ్లకముందు డిప్యూటీ సిఎం కార్యాలయం ఒక ప్రకటన జారీ చేసింది. ఢిల్లీలో జరుగుతున్న ఈ సమావేశంలో దేశంలో బాలికల విద్యను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం తరపున తీసుకోవాల్సిన అంశాలపై కేబ్ సబ్ కమిటీ చైర్మన్ గా ప్రతిపాదనలు చేయనున్నారు. ఈ కేబ్ సబ్ కమిటీలో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి తో పాటు అస్సాం, ఝార్ఖండ్ విద్యా శాఖ మంత్రులు సభ్యులుగా ఉన్నారు. బాలికల విద్యను దేశ వ్యాప్తంగా ప్రోత్సహించడం కోసం ఈ కేబ్ సబ్ కమిటీ నాలుగుసార్లు సమావేశమై చర్చించింది. ఆయా రాష్ట్రాల్లో బాలికల విద్య కోసం చేపడుతున్న ఉత్తమ విధానాలను అధ్యయనం చేసింది.

తెలంగాణ లో పేదలకు నాణ్యమైన విద్య అందించేందుకు సీఎం కేసీఆర్ నాయకత్వంలో ఏర్పాటు చేసిన గురుకులాలు మంచి ఫలితాలు ఇస్తున్నాయని కడియం తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా గురుకుల విద్యార్థులకు పొష్టికాహారాన్ని అందిస్తున్నామని, ప్రత్యేకంగా బాలికలకు హెల్త్ కిట్స్ ఇస్తున్నామని తన ప్రతిపాదనల్లో పేర్కొన్నారు. కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయాల్లో కూడా దేశంలో 6వ తరగతి నుంచి 8వ తరగతి వరకు విద్య అందిస్తుండగా తెలంగాణ లో 10వ తరగతి వరకు విద్య అందిస్తున్నామని, దీనిని ఇంటర్ వరకు దేశ వ్యాప్తంగా పొడిగించాలని కోరనున్నారు. మోడల్ స్కూళ్లలో కూడా విద్యార్థుల సంఖ్యను 100 నుంచి 200 వరకు పెంచాలని ప్రతిపాదించనున్నారు. మొత్తానికి బాలికల విద్యను ప్రోత్సహించడంలో తెలంగాణ రాష్ట్రం మోడల్ గా ఉందని తన ప్రతిపాదనల్లో పేర్కొననున్నారు. వీటన్నిటి సమాహారంగా సబ్ కమిటీ  రూపొందించిన ప్రతిపాదనలు నేడు కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ కు సమర్పించనున్నారు.

click me!