కొడంగల్ ఫైట్ లో కొత్త ట్విస్ట్

Published : Jan 16, 2018, 05:04 PM ISTUpdated : Mar 26, 2018, 12:00 AM IST
కొడంగల్ ఫైట్ లో కొత్త ట్విస్ట్

సారాంశం

కొడంగల్ పై వరాలు కురిపించిన సిఎం కేసిఆర్ నియోజకవర్గ నేతల డిమాండ్లన్నీ తక్షణమే తీర్చాలని అధికారులకు ఆదేశం ఇది రేవంత్ విజయమే అని చెప్పుకుంటున్న రేవంత్ వర్గం

కొడంగల్ ఉప ఎన్నిక వ్యవహారం తారా స్థాయికి చేరుతున్న పరిస్థితులు కనబడుతున్నాయి. కొడంగల్ లో అభివృద్ధి జరగకుండా టిఆర్ఎస్ మంత్రులు కుట్రలు చేసి అడ్డుకుంటున్నారంటూ ఇటీవల కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఆరోపించడమేకాదు.. తన ఆరోపణల తాలూకు కొన్ని డాక్యుమెంట్లు విడుదల చేశారు. దీంతో కొడంగల్ లో టిఆర్ఎస్ ఇరకాటంలో పడింది. నిధులు రాకుండా అడ్డుపుల్ల వేస్తున్నారంటూ ఉమ్మడి పాలమూరు జిల్లా మంత్రులపై రేవంత్ బలమైన ఆరోపణలు గుప్పించారు. అంతేకాడు బస్ డిపో కోసం ఎప్పటినుంచో తాము కోరుతున్నా.. రవాణా శాఖ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి అడ్డుకున్నారని కూడా రేవంత్ ఆరోపించారు. తాను డిపో కోసం భూమి దానం చేసినా తెలంగాణ సర్కారు అడ్డుపుల్ల వేసిందని విమర్శించారు.

అసలు కొడంగల్ ఉప ఎన్నికలు వస్తాయా రావా అన్న అనుమానాలు ఇటు రేవంత్ వర్గంలో అటు టిఆర్ఎస్ వర్గంలో ఇప్పటికీ ఉన్నాయి. రేవంత్ రెడ్డి రాజీనామా విషయంలో ఇప్పటికీ అధికారపక్షం నుంచి బలమైన విమర్శలే ఎదుర్కొంటున్నారు. గతంలో చంద్రబాబుకు రాజీనామా లేఖ ఇచ్చానని రేవంత్ చెబుతున్నా.. ఆ వాదనలో బలం లేదన్నది ఆయన వర్గానికి కూడా తెలుసు. ఈ పరిస్థితుల్లో ఏ క్షణంలో అయినా రేవంత్ రాజీనామా చేయవచ్చన్న భావనలో ఉన్న అధికార పక్షం అన్ని రకాల వ్యూహాలను అమలు చేస్తోంది. ఇంతకాలం రేవంత్ రెడ్డి ఏదైతే విమర్శలు చేస్తూ కొడంగల్ లో అధికార పక్షానికి వాయిస్ లేకుండా చేసేశాడో.. ఆ విషయంలో రేవంత్ విమర్శలకు చెక్ పెట్టింది సర్కారు.

ప్రగతి భవన్ లో మంగళవారం కొడంగల్ మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డి నాయకత్వంలో కొడంగల్ స్థానిక ప్రజాప్రతినిధులంతా ముఖ్యమంత్రి కేసిఆర్ ను కలిశారు. ఈ కార్యక్రమంలో కొడంగల్ రిలేటెడ్ మంత్రులు పట్నం మహేందర్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు తోపాటు ఎమ్మెల్సీ నరేందర్ రెడ్డి కూడా హాజరయ్యారు. కోస్గి మండల కేంద్రంలో బస్ డిపో, కొడంగల్ నియోజకవర్గంలో ఫైర్ స్టేషన్, కోస్గి మండల కేంద్రంలో పోలీస్ సర్కిళ్ కార్యాలయం, దౌల్తాబాద్ – బొమ్మరాస్ పేట్ మండల కేంద్రాలలో జూనియర్ కాలేజీని మంజూరు చేయాలని సిఎంకు విన్నవించారు. వారి విన్నపాన్ని వెంటనే అమలు చేయాలని సిఎం కేసిఆర్ అధికారులను ఆదేశించారు. అన్ని డిమాండ్లు వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు సిఎం. ఇక ఇంతకాలం రేవంత్ రెడ్డి తమపై పదే పదే ఆరోపణలు చేసి కొడంగల్ లోకల్ సెంటిమెంట్ రగిలించే ప్రయత్నం చేశాడని, ఈ దెబ్బతో తమకు తిరుగులేదని టిఆర్ఎస్ నేతలు భావిస్తున్నారు. రేవంత్ నోటినుంచి వచ్చిన డిమాండ్లన్నీ సిఎం మంజూరు చేయడంతో ఇక రేవంత్ కు కొడంగల్ లో బలం లేకుండా చేస్తామన్న ధీమాలో ఉన్నారు.

ఇది రేవంత్ విజయమే...

రేవంత్ శిబిరం నుంచి మరో వాదన వినిపిస్తోంది. ఇంతకాలం కొడంగల్ అభివృద్ధిని తొక్కిపట్టి ఇప్పుడే ఉన్నఫలంగా పనులు చేస్తామని ముందుకు రావడం రేవంత్ రెడ్డి విజయమే అని ఆయన అనుచరులు చెప్పుకుంటున్నారు. రేవంత్ రెడ్డి కి కేసిఆర్ సర్కార్ తలవంచిందని వారు చెబుతున్నారు. ఇంతకాలం కొడంగల్ లో అభివృద్ధిని అడ్డుకున్న ప్రభుత్వం సడెన్ గా ఎందుకు మనుసు మార్చుకుందో చెప్పాలంటున్నారు. నిన్నటి వరకు కోస్గి బస్ డిపో, ఫైర్ స్టేషన్ ను రాకుండా అడ్డుకున్నారనని..  దౌల్తాబాద్, బొంరాస్ పేట్ లలో కాలేజి లను కట్టకుండా ఏకంగా లెటర్ లు రాసి అడ్డుకోవాలని చూశారని వారు గుర్తు చేస్తున్నారు.

కొడంగల్ కు తెలంగాణ సర్కారు చేస్తున్న మోసాన్ని ఎండగట్టేలా రేవంత్ రెడ్డి కొడంగల్ లో పాదయాత్ర చేసేందుకు ప్లాన్ చేసినందుకే అన్ని అనుమతలు ఇచ్చారని చెబుతున్నారు. సంక్రాంతి తరువాత నియోజకవర్గం లో 5 మండలాలను కలుపుతూ రేవంత్ పాదయాత్ర చేయాలని ప్లాన్ చేయడం తో సర్కారు దిగొచ్చిందని వారు చెబుతున్నారు. పాదయాత్ర చేస్తే నియోజక వర్గంలో లో టిఆర్ఎస్ నేతలు తిరగలేరు అని గ్రహించిన గులాబీ నేతలు, పండగ పూట సిఎం దగ్గరకు వెళ్లి ఏదో తామే ఇవన్నీ సాధించినట్లు ప్రజలకు మస్కా కొట్టే ప్రయత్నం చేశారని ఎద్దేవా చేశారు. కానీ కొడంగల్ ప్రజలకు మాత్రం వీటి గురించి స్పష్టత ఉందని.. రేవంత్ దెబ్బకు సర్కారు దిగొచ్చిందని వారు స్పష్టం చేస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

Minister Rammohan Naidu Speech | Wings India 2026 Awards Ceremony in Hyderabad | Asianet News Telugu
Kavitha Comments on BJP: బీజేపీ భారత ప్రజలను మోసం చేస్తుంది | BC Kulaganana | Asianet News Telugu