మరో టిడిపి బిగ్ వికెట్ అవుట్

Published : Dec 12, 2017, 04:10 PM ISTUpdated : Mar 25, 2018, 11:55 PM IST
మరో టిడిపి బిగ్ వికెట్ అవుట్

సారాంశం

ఉమా మాధవరెడ్డి టిడిపి నుంచి ఔట్ టిఆర్ఎస్ లో చేరేందుకు ముహూర్తం ఫిక్స్ ఈనెల 14న టిఆర్ఎస్ లో చేరనున్న ఉమా, ఆమె కొడుకు

తెలగాణలో టిడిపి మూల స్థంభంగా ఉన్న సీనియర్ నాయకురాలు ఉమా మాధవరెడ్డి టిడిపిని వీడి టిఆర్ఎస్ లో చేరనున్నారు. ఆమె తాజాగా సిఎం కేసిఆర్ తో భేటీ అయ్యారు. తాను బంగారు తెలంగాణ సాధన కోసం టిఆర్ఎస్ తో కలిసి పనిచేస్తానని ముందుకొచ్చినట్లు చెబుతున్నారు. ఆమెతోపాటు ఆమె కుమారుడు ప్రస్తుత యాదాద్రి జిల్లా టిడిపి అధ్యక్షుడు సందీప్ రెడ్డి కూడా పార్టీ మారనున్నారు.

మంగళవారం వీరిద్దరూ సిఎం కేసిఆర్ తో భేటీ అయ్యారు. తాము టిఆర్ఎస్ లో చేరే అంశాన్ని చర్చించారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం కేసీఆర్ నాయకత్వంలో పనిచేయాలనే తమ మనోగతాన్ని వెల్లడించారు. ఈ నెల 14న మధ్యాహ్నం 12 గంటలకు వారి అనుచరులతో తెలంగాణ భవన్ లో టిఆర్ఎస్ లో చేరనున్నారు.

రేవంత్ రెడ్డి టిడిపిని వీడి కాంగ్రెస్ లో చేరినప్పుడే ఉమా మాధవరెడ్డి కూడా కాంగ్రెస్ లో చేరతారని ప్రచారం జరిగింది. కానీ ఆమె కాంగ్రెస్ లోకి వెళ్లలేదు. కొంతకాలం తర్వాత అసెంబ్లీలో సిఎం కేసిఆర్ ను కలిసి చర్చలు జరిపారు. తాజాగా మంగళవారం రెండో దశ చర్చలు జరిపారు. చర్చలు ఫలించడంతో ఈనెల 14న కారెక్కేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు.

ఉమా మాధవరెడ్డి భర్త ఎలిమినేటి మాధవరెడ్డి టిడిపిలో ఉన్నత స్థానానికి చేరుకున్నారు. మంత్రిగా ఉన్న సమయంలోనే ఆయన నక్సల్స్ బాంబు పేళుడు ఘటనలో మరణించాడు. అప్పటి నుంచి ఉమా మాధవరెడ్డి క్రియాశీల రాజకీయాలు నడుపుతున్నారు. ఉమా కూడా ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా పనిచేశారు. తెలంగాణ ఉద్యమ కాలంలో ఎంతగా వ్యతిరేకత వచ్చినా టిడిపిలోనే కొనసాగారు. అయితే తన భవిష్యత్తు కంటే తన కొడుకు సందీప్ రెడ్డి రాజకీయ భవిష్యత్తు కోసమే ఆమె టిడిపిని వీడి టిఆర్ఎస్ లో చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

కాంగ్రెస్ లోకి వెళ్లాలని కూడా ఉమా మాధవరెడ్డి తొలుత భావించారు. కానీ అక్కడ సీట్ల విషయంలో హామీ రాలేదన్న ప్రచారం ఉంది. సందీప్ రెడ్డికి టికెట్ కావాలని ఆమె గట్టిగా కోరుతోంది. కానీ కాంగ్రెస్ లో ఆమెకు టికెట్ ఇస్తామని చెప్పారని, కొడుకు విషయంలో స్పష్టత ఇవ్వలేదని చెబుతున్నారు. అందుకే ఆమె టిఆర్ఎస్ వైపు మొగ్గు చూపినట్లు కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.  

PREV
click me!

Recommended Stories

Real estate: హైద‌రాబాద్‌లోని ఈ శివారు ప్రాంతం మ‌రో కూక‌ట్‌ప‌ల్లి కావ‌డం ఖాయం.. ఇప్పుడే కొనేయండి
Free Bus Scheme : తెలుగోళ్లకు గుడ్ న్యూస్... మహిళలకే కాదు పురుషులకు కూడా ఉచిత బస్సు ప్రయాణం