రేవంత్ ఈ పెద్దమనిషి మీద పగ పట్టిండా ?

First Published Dec 11, 2017, 7:38 PM IST
Highlights
  • కేటిఆర్ కేంద్రంగా రేవంత్ విమర్శలు
  • నిన్న కేటిఆర్ బామ్మార్ది, ఆయన సతీమణి మీద ఫైర్
  • నేడు కేటిఆర్ మామ, కేటిఆర్ సతీమణి మీద కామెంట్్స్
  • తప్పుడు క్యాస్ట్ సర్టిఫికెట్ అంటూ ఆరోపణలు
  • రేవంత్ కు భారీ షాక్ ఇచ్చే యోచనలో అధికార పార్టీ

ఈ ఫొటోలో కనబడుతున్న వ్యక్తి ప్రభుత్వ ఉద్యోగిగా రిటైర్ అయ్యారు. కానీ ఇప్పుడు ఈయన రాజకీయాల్లో హాట్ టాపిక్ గా నిలిచారు. ఆయన నిలిచారు అనేకంటే ప్రతిపక్ష నేత రేవంత్ రెడ్డి ఈ పెద్ద మనిషిని బలవంతంగా వివాదాల్లోకి గుంజుకొచ్చారు. మరి ఈయన ఏమాత్రం రేవంత్ కు శత్రువు కాదు. కనీసం ఈయనకు రేవంత్ తో ముఖ పరిచయం కూడా ఉండకపోవచ్చు. అట్లాగే రేవంత్ తో ఈయనకు కూడా పరిచయం లేకపోవచ్చు. కానీ రేవంత్ రెడ్డి పదే పదే తీవ్రమైన పదజాలంతో ఈయన మీద విరుచుకుపడుతున్నాడు. దానికి కారణం. అదే రాజకీయం. రాజకీయాలు చిత్ర విచిత్రంగా ఉంటాయి. మనకు ముక్కు మొఖం తెలియకపోయినా హటాత్తుగా శత్రువులైపోతారు. కొన్నిసార్లు బాగా తెలిసిన వాళ్లు కూడా శత్రువులుగా మారుతారు. మరి ఈ పెద్ద మనిషి ఎవరు? అసలు రేవంత్ ఎందుకు టార్గెట్ చేసిండో తెలియాలంటే ఈ స్టోరీ చదవండి.

ఈ పెద్ద మనిషి పేరు పాకాల హరినాథ్ రావు. ఈ పేరు చదవగానే మీకు అర్థమై ఉంటది. ఈయన ఎవరో కాదు తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ కు వియ్యంకుడు. కేటిఆర్ కు మామ. ఈ హరినాథ్ రావు ఇటీవలే ఫారెస్టు శాఖలో ఉద్యోగం నుంచి రిటైర్ అయ్యారు. ప్రస్తుతం పెన్షన్ పొందుతున్నారు. కానీ ఈయన మీద కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి తీవ్రమైన రీతిలో విరుచుకుపడుతున్నాడు. ఈయన ఉద్యోగం కోసం అడ్డదారులు తొక్కిండని, ఎస్టీ కాకపోయినా తప్పుడు ఎస్టీ సర్టిఫికెట్ సంపాదించి ఉద్యోగం కొట్టేసిండని రేవంత్ విమర్శల వర్షం కురిపిస్తున్నాడు. ఆర్టీఐ ద్వారా సమాచారాన్ని సేకరించి మరీ హరినాథ్ రావు  మీద ఆరోపణలు గుప్పించాడు రేవంత్. గాంధీభవన్ లో అడుగుపెడుతూనే తొలిరోజే ఈ పెద్ద మనిషి మీద రేవంత్ పంచ్ లు, విమర్శలు గుప్పించాడు. తెల్లారే రేవంత్ విమర్శలపై టిఆర్ఎస్ ఘాటుగా రియాక్ట్ అయింది. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిన దొంగ.. రేవంత్ రెడ్డి ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతుండని అధికార పార్టీ నుంచి కౌంటర్ పడింది. అయితే రేవంత్ రెడ్డి లేవనెత్తిన అంశాలపై మాత్రం అధికార పార్టీ పెదవి విప్పలేదు.

అధికార పార్టీ నేతల వ్యాఖ్యలపై రెండో రోజు రేవంత్ విరుచుకుపడ్డాడు. టిఆర్ఎస్ లో  తనపై ఆరోపణలు చేస్తున్న వారిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. తన మాటలపై పెంపుడు నేతలు స్పందించడం కాదు.. దమ్ముంటే కేసిఆర్, కేటిఆర్ స్పందించాలంటూ సవాల్ విసిరాడు. దీంతో టిఆర్ఎస్ వర్గాల నుంచి రియాక్ట్ అయ్యే పరిస్థితి కనిపిస్తలేదు. రేవంత్ లేవనెత్తిన తప్పుడు ఎస్టీ సర్టిఫికెట్ అంశంలో అధికార పార్టీ విమర్శలను ఎదుర్కోంటోంది. ఇప్పుడు హరినాథ్ రావుపై ఇంతగా విమర్శలు చేసిన రేవంత్ రెడ్డి గతంలో టిడిపిలో ఉన్న సమయంలో హరినాథ్ రావు పాకాల కొడుకు అయిన రాజేంద్రప్రసాద్ పాకాల అలియాస్ రాజ్ పాకాల మీద కూడా తీవ్రమైన విమర్శలు గుప్పించి వివాదాన్ని సృష్టించాడు. రాజ్ పాకాల డ్రగ్ మాఫియా కింగ్ అంటూ ఆరోపించాడు. అంతటితో ఆగకుండా రాజ్ పాకాల సతీమణి సుమ పాకాల కూడా డ్రగ్ మాఫియా సామ్రాజ్యం నడుపుతున్నట్లు ఆరోపించాడు. దీంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన రాజ్ పాకాల ఏకంగా రేవంత్ మీద పరువు నష్టం కేసు కూడా దాఖలు చేశాడు. క్షమాపణ చెప్పకపోతే క్రిమినల్ చర్యలు తప్పవని నోటీసుల్లో హెచ్చరించాడు. అయినా రేవంత్ రెడ్డి వెనక్కు తగ్గిన పరిస్థితి కనిపిస్తలేదు.

నిన్న మొన్న రాజ్ పాకాల, ఆయన సతీమణి సుమ పాకాల మీద విమర్శలు గుప్పించిన రేవంత రెడ్డి రెండో దశలో హరినాథ్ పాకాల, కేటిఆర్ సతీమణి శైలిమల లను టార్గెట్ చేసినట్లు కనబడుతున్నది. అంతేకాదు గతంలో కేటిఆర్ తనయుడు హిమాన్ష్ రావు పైనా తీవ్ర విమర్శలు గుప్పించాడు రేవంత్. హిమాన్ష్ ను చిట్టి నాయుడు అంటూ సంబోధించాడు. మొత్తానికి రేవంత్ విమర్శలన్నీ కేవలం కేటిఆర్ చుట్టూ తిప్పడం... రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చను రేకెత్తిస్తున్నది. దీనిపై అధికార పార్టీ గట్టి కౌంటర్ ఇచ్చేందుకు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.

click me!