ఏపీలో ప్రస్తుతం టీడీపీ-జనసేనలు పొత్తులో ఉన్నాయి. తాజాగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో.. ఇక్కడ కూడా ఆ రెండు పార్టీలు కలిసి బరిలో నిలుస్తాయా? లేదా? అనే చర్చ సాగుతుంది.
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఇప్పటికే ప్రధాన రాజకీయ పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు.. గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్నాయి. మరోవైపు ఈసారి ఎన్నికల బరిలో నిలిచేందుకు పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీ కూడా సిద్దమైంది. 32 చోట్ల జనసేన అభ్యర్థులు పోటీ చేయనున్నట్టుగా ఆ పార్టీ ఇప్పటికే ప్రకటన చేసింది. మరోవైపు టీడీపీ కూడా పోటీకి సిద్దమని ప్రకటించింది. అయితే టీడీపీ నేతలు మాత్రం పొత్తులతో ముందుకు వెళ్తారా? లేదా ఒంటరిగా బరిలో దిగుతారా? అనే విషయంలో మాత్రం క్లారిటీ ఇవ్వడం లేదు.
అయితే ఏపీలో ప్రస్తుతం టీడీపీ-జనసేనలు పొత్తులో ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే తెలంగాణలో కూడా ఇరు పార్టీలు కలిసి బరిలో నిలుస్తాయా? అనే చర్చ సాగుతుంది. అయితే ఇప్పటివరకు ఇరు పార్టీల నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. అయితే తాజాగా తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ పొత్తులపై కీలక వ్యాఖ్యలు చేశారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తమకు జనసేనతో పొత్తు ఉంటుందని తెలిపారు. త్వరలోనే జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో చర్చలు జరుపుతామని పేర్కొన్నారు. రెండు రోజుల్లో రాజమండ్రి జైలులో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో ములాఖత్ కానున్నట్టుగా చెప్పారు. తాను కుత్బుల్లాపూర్ నుంచి పోటీ చేస్తానని కూడా చెప్పారు. దీంతో ఇప్పుడు సరికొత్త చర్చ ప్రారంభం అయింది.
అయితే ఇప్పటికే జనసేన 32 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించడం.. అందులో కొన్ని టీడీపీ గతంలో బలంగా ఉన్న నియోజకవర్గాలు కూడా ఉండటం చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో టీడీపీ, జనసేన పొత్తు ఖాయమైతే.. జనసేన అభ్యర్థుల స్థానాల్లో మార్పులు చోటుచేసుకునే అవకాశం కూడా ఉంది.. అందులో కొన్ని స్థానాల్లో టీడీపీ కోరే అవకాశం ఉందనే విశ్లేషణలు ఉన్నాయి. మరోవైపు జనసేన నేతలు మాత్రం తాము ఒంటరిగా వెళ్లడానికే సిద్దంగా ఉన్నామని ఇటీవల చెప్పారు. ఒకవేళ చివరి క్షణంలో పొత్తులు ఏమైనా ఉంటే స్థానాల్లో మార్పు రావచ్చని పేర్కొన్నారు.
ఇక, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ పోటీపై రాష్ట్ర నేతలతో సినీ నటుడు నందమూరి బాలకృష్ణ చర్చలు జరుపుతున్నారు. అయితే చంద్రబాబుతో కాసాని ములాఖత్ జరిగితే.. ఆ తర్వాత తెలంగాణ ఎన్నికల్లో టీడీపీ పోటీ, జనసేనతో పొత్తుపై వారి వైఖరి ఏమిటనేది స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన-టీడీపీ పొత్తు ఉంటుందా? లేదా? అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు వేచిచూడాల్సిందే.
ఇక, మరోవైపు ఏపీలో టీడీపీతో పొత్తు ప్రకటించినప్పటికీ.. పవన్ కల్యాణ్ పలు సందర్భాల్లో తాను ప్రస్తుతం ఎన్డీయే కూటమిలోనే ఉన్నానని చెబుతున్నారు. అయినప్పటికీ తెలంగాణలో జనసేన, బీజేపీలు కలిసి ముందుకు సాగే పరిస్థితులు కనిపించడం లేదు. బీజేపీ అగ్రనేతలు తెలంగాణలో పర్యటిస్తున్న జనసేన అంశాన్ని ఎక్కడ ప్రస్తావించడం లేదు.