
హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ భవన్‌లో మంగళవారం దశ మహా విద్యాపూర్వక నవ చండీయాగం నిర్వహించారు. తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ఆధ్వర్యంలో వేదపండితులు ఈ యాగం జరిపించారు. ఈ యాగంలో తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు కూడా పాల్గొన్నారు. అలాగే టీ టీడీపీకి చెందిన రావుల చంద్రశేఖర్ రెడ్డి, అరవింద్ కుమార్ గౌడ్, నర్సిరెడ్డితో పాటు ఇతర ముఖ్య నాయకులు కూడా ఈ యాగంలో పాల్గొన్నారు. టీడీపీ భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలని, అవరోధాలు తొలగిపోవాలని ఈ యాగం నిర్వహిస్తున్నట్టుగా ఆ పార్టీ వర్గాలు తెలిపాయి.
ఇక, తెలంగాణ టీడీపీ అధ్యక్షునిగా కాసాని జ్ఞానేశ్వర్ బాధ్యతలు చేపట్టిన తర్వాత.. రాష్ట్రంలో పార్టీ కార్యక్రమాలలో కదలిక వచ్చింది. గత నెలలో ఖమ్మంలో చంద్రబాబు నాయుడు సభను కూడా నిర్వహించారు. ఈ సభ విజయవంతం కావడంతో.. రాష్ట్రంలో సత్తా చాటాలనే లక్ష్యంతో ప్రణాళికలను మరింతగా వేగవంతం చేసింది. ఈ క్రమంలోనే త్వరలోనే ఉత్తర తెలంగాణలోని నిజామాబాద్‌లో కూడా సభ నిర్వహించాలని టీ టీడీపీ భావిస్తోంది. ఇక, తెలంగాణలో తెలుగుదేశం పార్టీ నుంచి వివిధ పార్టీల్లోకి వెళ్లిన నేతలంతా తిరిగి పార్టీలోకి రావాలని ఖమ్మంలో జరిగి సభ వేదికగా చంద్రబాబు ఆహ్వానించారు.