
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు అనూహ్యంగా పుంజుకున్న టీ కాంగ్రెస్ ఆ దూకుడును కొనసాగించే ప్రయత్నాలు చేస్తున్నది. సమీకరణాలు, వ్యూహాలు మాత్రమే కాదు.. అభ్యర్థుల ఎంపికను కూడా వేగవంతం చేస్తున్నది. గత అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన తప్పిదం పునరావృతం కాకుండా జాగ్రత్త పడుతున్నది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను వేగవంతం చేసింది. ఈ నెలాఖరు వరకు సుమారు 80 సీట్లల్లో అభ్యర్థులను ప్రకటిస్తామని తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జీ మాణిక్‌రావు ఠాక్రే వెల్లడించారు.
గత అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికలో జాప్యం అధికార పార్టీ టీఆర్ఎస్‌కు కలిసొచ్చిందని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. ఈ సారి అలా జరగకూడదని నిర్ణయాలు తీసుకుంటున్నారు. అవసరమైతే గులాబీ పార్టీ కంటే ముందే అభ్యర్థులను ప్రకటించేయాలనే భావనలో ఉన్నట్టు తెలుస్తున్నది.
Also Read: కొల్లాపూర్‌లో ప్రియాంక సభకు ఆటంకాలు.. ఢిల్లీకి బయల్దేరిన జూపల్లి, రేపు ఖర్గే సమక్షంలో కాంగ్రెస్‌లోకి
అందుకోసమే ముందుగా ఏకాభిప్రాయం కుదిరిన నియోజకవర్గాల్లో క్యాండిడేట్లను ప్రకటించబోతున్నట్టు టీకాంగ్రెస్ పేర్కొంది. ఆ తర్వాత పోటీ ఉన్న నియోజకవర్గాల్లో సయోధ్య కుదిర్చి అభ్యర్థులను ప్రకటించనుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికలో జాప్యం కారణంగా టీఆర్ఎస్ లాభపడ్డదని విశ్లేషకులు చెబుతున్నారు.