Telangana BJP: అసెంబ్లీ ఫలితాలతో రూటుమార్చిన టీ బీజేపీ.. పొత్తులపై కీలక నిర్ణయం

By Mahesh K  |  First Published Feb 8, 2024, 7:15 PM IST

అసెంబ్లీ ఫలితాలతో టీ బీజేపీ రూటు మార్చింది. అసెంబ్లీ ఎన్నికల్లో జనసేనతో పొత్తు పెట్టుకుని బరిలోకి దిగిన తెలంగాణ బీజేపీ లోక్ సభ ఎన్నికల్లో మాత్రం ఒంటరిగానే బరిలోకి దిగనుంది. ఈ విషయాన్ని టీ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.
 


Telangana: దక్షిణాదిలో కర్ణాటక తర్వాత బీజేపీకి తెలంగాణపైనే ఎక్కువ ఆశలు ఉన్నాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఈ ఆశలను రెట్టింపు చేశాయి. అందుకే లోక్ సభ ఎన్నికలపై మరింత జాగ్రత్తగా బీజేపీ వ్యవహరిస్తున్నది. గతంలో నాలుగు ఎంపీ సీట్లు గెలుచుకున్న బీజేపీ ఈ సారి డబుల్ డిజిట్ వరకు వెళ్లాలని ఆరాటపడుతున్నది. 

అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ బీజేపీ.. పవన్ కళ్యాణ్ పార్టీ జనసేనతో కలిసి బరిలోకి దిగింది. జనసేనకు ఎనిమిది స్థానాలను బీజేపీ కేటాయించింది. ఈ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ రాణించింది. 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఒకే ఎమ్మెల్యే సీటు గెలుచుకుంది. కానీ, ఈ సారి మొత్తం 8 స్థానాల్లో గెలవడమే కాదు.. ఓటు శాతం కూడా అనూహ్యంగా పెంచుకుంది.

Latest Videos

కానీ, బీజేపీతో జట్టుగా బరిలోకి దిగిన జనసేన మాత్రం కుప్పకూలిపోయింది. పవన్ కళ్యాణ్ ఆదరణ తమకు కలిసి వస్తుందనుకున్న బీజేపీ అంచనాలు తారుమారయ్యాయని ఫలితాల్లో తేలింది. పలు సీట్లలో జనసేన.. నోటాతో పోటీ పడిందనే విమర్శలను ఎదుర్కొంది. అందుకే ఈ సారి తెలంగాణ బీజేపీ రూట్ మార్చింది.

Also Read: Survey: ఏ పార్టీకి ఎన్ని ఎంపీ సీట్లు.. టైమ్స్ నౌ సర్వేలో సంచలన విషయాలు

వచ్చే లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణ బీజేపీ ఒంటరిగా బరిలోకి దిగాలని నిర్ణయించుకుంది. ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ ప్రాతినిధ్యం వహిస్తున్న హైదరాబాద్ లోక్ సభ స్థానాన్ని కైవసం చేసుకోవడమే కాదు.. ఎంపీ సీట్ల సంఖ్యనూ గణనీయంగా పెంచుకోవాలని భావిస్తున్నది. ఈ సారి లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణ బీజేపీ ఎలాంటి పొత్తుల్లేకుండా ఒంటరిగా బరిలోకి దిగుతుందని అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. 17 స్థానాల్లో బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని ఆయన గురువారం మీడియాతో చెప్పారు.

click me!