రెండు రోజుల క్రితమే అన్నాడు.. ఆలోపే ఈడీ నోటీసులు, బండి సంజయ్‌కి ఎలా తెలుసు : రోహిత్ రెడ్డి

By Siva KodatiFirst Published Dec 16, 2022, 7:14 PM IST
Highlights

తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు తాండూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి. తనకు ఈడీ నోటీసులు ఇచ్చే విషయం సంజయ్‌కి ఎలా తెలుసునని ఆయన ప్రశ్నించారు. 

ఈడీ నోటీసులపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి స్పందించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈడీ తన బయోడేటా అడగటం హాస్యాస్పదంగా వుందన్నారు. బండి సంజయ్ చెప్పిన రెండు రోజులకే ఈడీ సమన్లు వచ్చాయని రోహిత్ రెడ్డి పేర్కొన్నారు. ఎమ్మెల్యే కొనుగోలు గుట్టును రట్టు చేసినందుకే ఈడీ సమన్లు వచ్చాయని తాను భావిస్తున్నానని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వాన్ని పడగొట్టాలన్న కుట్రను అడ్డుకున్నందుకే ఈ సమన్లు వచ్చాయని రోహిత్ పేర్కొన్నారు. 

భయపడేది లేదు, తగ్గేది లేదని ఆయన స్పష్టం చేశారు. బండి సంజయ్ చెప్పిన రెండు రోజులకే ఈడీ సమన్లు వచ్చాయని.. ఆయనకేమైనా భవిష్యవాణి తెలుసా అని రోహిత్ ప్రశ్నించారు. తనకు నోటీసులు వచ్చే విషయం బండి సంజయ్‌కి ఎలా తెలుసునని నిలదీశారు. ఈడీ, సీబీఐలు బండి సంజయ్ కింద పనిచేస్తున్నాయా అని రోహిత్ రెడ్డి ప్రశ్నించారు. యాదగిరిగుట్టకు తడిబట్టలతో వచ్చి ప్రమాణం చేయడానికి తాను సిద్ధమని, బండి సంజయ్ ఎప్పుడు వస్తారో చెప్పాలని రోహిత్ రెడ్డి సవాల్ విసిరారు. 

ALso REad:ఈడీ నోటీసులు: న్యాయ నిపుణులతో చర్చిస్తున్న పైలెట్ రోహిత్ రెడ్డి

ఇకపోతే.. హైద్రాబాద్‌లోని మణికొండలో ఉన్న పైలెట్ రోహిత్ రెడ్డికి ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చేందుకు  వచ్చారు. అయితే ఆ సమయంలో రోహిత్ రెడ్డి  అక్కడ లేరు. దీంతో రోహిత్ రెడ్  పీఏకు ఈడీ అధికారులు సమాచారం ఇచ్చారు. మణికొండ నివాసంలో రోహిత్ రెడ్డి డ్రైవర్ మాత్రమే ఉన్నారు. ఈడీ నోటీసులపై  ఏం చేయాలనే దానిపై  ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి  చర్చించారు. ఈ నెల 19వ తేదీన విచారణకు రావాలని ఈడీ నోటీసుల్లో పేర్కొంది. 

తన కుటుంబ సభ్యులు, వ్యాపారాలకు సంబంధించిన వివరాలను ఈడీ అదికారులు అడిగినట్టుగా  రోహిత్ రెడ్డి చెబుతున్నారు.  బెంగుళూరు, హైద్రాబాద్ డ్రగ్స్ కేసును రీ ఓపెన్ చేయిస్తామని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఇటీవల ప్రకటించారు.  ఈ వ్యాఖ్యలు చేసిన  రోజుల వ్యవధిలోనే  పైలెట్ రోహిత్ రెడ్డికి ఈడీ నోటీసులు రావడం చర్చకు దారి తీసింది. మొయినాబాద్ ఫాం హౌస్ లో తమ ఎమ్మెల్యేల ప్రలోభాల కేసులో బీజేపీ  హస్తం ఉందని బీఆర్ఎస్ ఆరోపించింది.  తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఫిర్యాదు మేరకే మొయినాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు.

click me!