కాంగ్రెస్ పనైపోయింది.. అందుకే బీఆర్ఎస్, బీజేపీకి కౌంట్‌డౌన్ స్టార్ట్ : మంత్రి కొప్పుల ఈశ్వర్

By Siva KodatiFirst Published Dec 16, 2022, 6:04 PM IST
Highlights

పాకిస్తాన్, చైనాల పేర్లు చెప్పుకుంటూ బీజేపీ బతికేస్తోందని చురకలంటించారు తెలంగాణ మంత్రి కొప్పుల ఈశ్వర్. కరీంనగర్ సభలో అన్నీ అబద్ధాలు చెప్పిన జేపీ నడ్డా, బండి సంజయ్‌లకు అసలు సిగ్గుందా అని ఆయన ప్రశ్నించారు. 

గురువారం కరీంనగర్‌లో జరిగిన ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభలో బీఆర్ఎస్, ముఖ్యమంత్రి కేసీఆర్‌పై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా చేసిన వ్యాఖ్యలకు కౌంటరిచ్చారు తెలంగాణ మంత్రి కొప్పుల ఈశ్వర్. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పాకిస్తాన్, చైనాల పేర్లు చెప్పుకుంటూ బీజేపీ బతికేస్తోందని చురకలంటించారు. బీజేపీ అన్ని అబద్ధాలే చెబుతుందని దుయ్యబట్టారు. దేశంలో కాంగ్రెస్ పార్టీ పని అయిపోయిందని కొప్పుల ఈశ్వర్ వ్యాఖ్యానించారు. అందుకే బీఆర్ఎస్ పుట్టిందన్న ఆయన.. తమ పార్టీని చూసి బీజేపీకి చెమటలు పడుతున్నాయని, కమలానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యిందని కొప్పుల హెచ్చరించారు. కరీంనగర్ సభలో అన్నీ అబద్ధాలు చెప్పిన జేపీ నడ్డా, బండి సంజయ్‌లకు అసలు సిగ్గుందా అని కొప్పుల ఈశ్వర్ ప్రశ్నించారు. 

అంతకుముందు తెలంగాణ మంత్రి, బీఆర్ఎస్ అగ్రనేత హరీశ్ రావు ఫైర్ అయ్యారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇచ్చిన హామీల్లో బీజేపీ ఏవి నెరవేర్చిందని ప్రశ్నించారు. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారని, ఇచ్చారా అని నిలదీశారు. అలా ఇచ్చి వుంటే ఇప్పటికే 15 కోట్ల ఉద్యోగాలు ఇచ్చి వుండాలి కదా అని హరీశ్ రావు చురకలంటించారు. ఇప్పటి వరకు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. 

అధికారంలోకి వస్తే ఒక్కొక్కరి ఖాతాల్లో రూ.15 లక్షలు వేస్తామని చెప్పారని, మరి ఎంతమంది ఖాతాల్లో రూ.15 లక్షలు వేశారో చెప్పాలని హరీశ్ డిమాండ్ చేశారు. రూపాయి విలువ పెంచుతామన్నారని, పెంచారా, దించారా అంటూ ఆయన సెటైర్లు వేశారు. ఎంతసేపూ ఎవరికి వెన్నుపోటు పొడవాలి..? ఎలా గెలవాలి అనేదే మీ ఆలోచన అంటూ హరీశ్ దుయ్యబట్టారు. కానీ కేసీఆర్ ప్రజలకు ఎలా సేవ చేయాలని ప్రతిక్షణం ఆలోచిస్తారని ఆయన అన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఈడీ నోటీసులు ఇచ్చేది ముందే తెలుసునని హరీశ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బండి సంజయ్ చెబుతారు, ఈడీ నోటీసులు ఇస్తారని ఆయన వ్యాఖ్యానించారు. 

ALso REad:ఈడీ నోటీసులు: న్యాయ నిపుణులతో చర్చిస్తున్న పైలెట్ రోహిత్ రెడ్డి

ఇకపోతే... గురువారం కరీంనగర్‌లో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఐదో విడత ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన జేపీ నడ్డా మాట్లాడుతూ... ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం యువత, మహిళలు, రైతులు, పేదలు, అణగారిన వర్గాల వారికి సాధికారత కల్పించేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తుందన్నారు. లంగాణలో మాత్రం కేసీఆర్ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని, ప్రజలకు, ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా పని చేస్తుందని నడ్డా విమర్శించారు. 

వేములవాడ రాజరాజేశ్వర స్వామి, కొండగట్టు ఆంజనేయస్వామిలకు ప్రార్థిస్తున్నట్టుగా చెప్పారు. ‘‘బండి సంజయ్ నాయకత్వంలోని ప్రజాసంగ్రామ యాత్ర 114 రోజుల్లో 56 అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా 5 దశల్లో 1458 కిలోమీటర్లు పాదయాత్ర చేసిందని మీ అందరికీ తెలియజేయడానికి సంతోషిస్తున్నాను’’ అని అన్నారు. తాను వస్తున్న సమయంలోనే టీఆర్‌ఎస్‌ వాళ్లు అడ్డుకునే ప్రయత్నం చేశారని ఆరోపించారు. 
 

click me!