తనను ఎన్ని ఇబ్బందులు పెట్టినా తగ్గేది లేదని తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి చెప్పారు. అందుకే నందకుమార్ ను ఈడీ అధికారులు విచారించనున్నారన్నారు.
హైదరాబాద్: తనను కేసులో ఇరికించేందుకు గాను ఈడీ అధికారులు నందకుమార్ ను విచారిస్తున్నారని తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఆరోపించారు. హైద్రాబాద్‌లోని బీఆర్ఎస్ శాసనసభపక్ష కార్యాలయంలో తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఆదివారంనాడు మీడియాతో మాట్లాడారు.తనకు నందకుమార్ మధ్య ఎలాంటి లావాదేవీలు జరగలేదన్నారు. నందకుమార్ స్టేట్ మెంట్ సహాయంతో తనను కేసులో ఇరికించే కుట్ర చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈడీ నోటీసులపై తాము తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నట్టుగా రోహిత్ రెడ్డి తెలిపారు.
తనను ఇబ్బంది పెట్టేందుకు గాను అభిషేక్ ను విచారించారన్నారు. అయినా ఫలితం దక్కలేదన్నారు. దీంతో నందకుమార్ ను ఈడీ అధికారులు విచారించాలని నిర్ణయం తీసుకున్నారన్నారు. . నందకుమార్ ద్వారా తనకు వ్యతిరేకంగా స్టేట్ మెంట్ తీసుకొని కేసులో ఇరికించాలని కుట్ర పన్నుతున్నారని తనకు సమాచారం ఉందని రోహిత్ రెడ్డి వివరించారు.
undefined
ఈడీ నోటీసులపై రేపు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయబోతున్నామని పైలెట్ రోహిత్ రెడ్డి ప్రకటించారు.తనను తన కుటుంబ సభ్యుల్ని ఎన్ని ఇబ్బందులకు గురి చేసినా కూడా తగ్గేదేలేదని పైలెట్ రోహిత్ రెడ్డి స్పష్టం చేశారు. బీజేపీ కుట్రలను తాము తెలంగాణలో సాగనివ్వబోమన్నారు. తనను అరెస్ట్ చేసినా తాను తగ్గేదిలేదన్నారు. తనకు న్యాయవ్యవస్థపై పూర్తిస్థాయి నమ్మకం ఉందని రోహిత్ రెడ్డి చెప్పారు.
ఎమ్మెల్యేల కొనుగోలు కేసుతో ఈడీకి సంబంధం లేదన్నారు. అయినా కూడా ఈడీ విచారణకు తాను సహకరించనున్నట్టుగా రోహిత్ రెడ్డి ప్రకటించారు. ఏదో ఒక విధంగా తనను ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని బీజేపీపై ఆయన విమర్శలు గుప్పించారు.కేంద్రం చేతిలో ఉన్న ఈడీ ద్వారా తనకు నోటీసులు ఇప్పించారన్నారు. తనకు ఈడీ నోటీసులతో బీజేపీ జాతీయ నేతల బండారం బయటపడిందని ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి విమర్శించారు. ఏదో ఒక రంగా తనను ఇబ్బంది పెట్టాలని చూశారన్నారు.
తొలి రోజున ఆరు గంటలు విచారించినా తనను ఏ కేసు గురించి ప్రశ్నిస్తున్నారో చెప్పలేదన్నారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసు గురించి రెండో రోజున తనను విచారించారని పైలెట్ రోహిత్ రెడ్డి వివరించారు. ఎమ్మెల్యేల కొనుగోలులో ఫిర్యాదు చేసిన తనను విచారించారన్నారు. కానీ ఈ కేసులో నిందితులను ఎందుకు ప్రశ్నించలేదో చెప్పాలని రోహిత్ రెడ్డి ఈడీని ప్రశ్నించారు. మనీలాండరింగ్ జరిగితేనే ఈడీ విచారణ జరుపుతుందన్నారు. ఎమ్మెల్యేల కొనుగోలులో మనీలాండరిగింగ్ ఎక్కడా జరగలేదని రోహిత్ రెడ్డి చెప్పారు. తనను లొంగదీసుకోవాలనే ఉద్దేశ్యంతోనే ఈడీ విచారణ జరిగిందని రోహిత్ రెడ్డి అనుమానం వ్యక్తం చేశారు.