కాంగ్రెస్‌పై కోపం లేదు.. టీఆర్ఎస్‌పై ప్రేమ లేదు, ఏదైనా మునుగోడు ఉపఎన్నిక వరకే : తేల్చేసిన తమ్మినేని

By Siva KodatiFirst Published Sep 14, 2022, 3:33 PM IST
Highlights

టీఆర్ఎస్‌కు సీపీఎం మద్ధతివ్వడంపై వస్తున్న విమర్శలపై స్పందించారు ఆ పార్టీ తెలంగాణ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం. కాంగ్రెస్ పార్టీపై తమకు కోపం లేదని.. అలాగే టీఆర్ఎస్ అన్నా ప్రేమ లేదని తమ్మినేని పేర్కొన్నారు. 

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో అనివార్యమైన మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికలను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. అయితే అక్కడ బలంగా వున్న సీపీఐ, సీపీఎంలు అధికార టీఆర్ఎస్‌కు మద్ధతు పలికాయి. దీంతో లెఫ్ట్ పార్టీలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో సీపీఎం తెలంగాణ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం స్పందించారు. టీఆర్ఎస్‌తో పొత్తు తాత్కాలికమేనని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీపై తమకు కోపం లేదని.. అలాగే టీఆర్ఎస్ అన్నా ప్రేమ లేదని తమ్మినేని పేర్కొన్నారు. టీఆర్ఎస్, బీజేపీల మధ్యే పోటీ జరుగుతున్న నేపథ్యంలోనే టీఆర్ఎస్‌కు మద్ధతిచ్చినట్లు వీరభద్రం వెల్లడించారు. 

ALso REad:మునుగోడు ఉప ఎన్నికలు 2022: సీపీఐ బాటలోనే సీపీఎం

ఇకపోతే.. మునుగోడు అసెంబ్లీ స్థానంలో లెఫ్ట్ పార్టీలకు గణనీయమైన ఓటు బ్యాంకు ఉంది. ప్రధానంగా చౌటుప్పల్, సంస్థాన్ నారాయణపురం, మునుగోడు, చండూరు మండలాల్లో సీపీఎంకు ఓటు బ్యాంకు ఉంది. మరోవైపు.. మునుగోడు అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిగా పాల్వాయి స్రవంతి బరిలోకి  దిగనున్నారు. రెండు రోజుల క్రితమే పాల్వాయి స్రవంతి పేరును కాంగ్రెస్ అధిష్టానం అధికారికంగా ప్రకటించింది. ఈ నెల 18వ తేదీ నుండి మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలో  ప్రచారాన్ని ప్రారంభించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకొంది. 

మరోవైపు ఉపఎన్నికకు జాతీయ స్థాయిలో ప్రాముఖ్యత ఉన్నందున.. సర్వేలు నిర్వహించి గెలిచే అవకాశం ఉన్న వ్యక్తినే అభ్యర్థిగా ఖరారు చేయాలని కేసీఆర్ భావిస్తున్నట్టుగా టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. గెలుపు, కులం, ఇతర సమీకరణాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే పార్టీ అభ్యర్థిని నిర్ణయిస్తామని.. మునుగోడు టీఆర్ఎస్ టికెట్‌ను ఆశిస్తున్న నేతలకు కేసీఆర్ చెప్పినట్టుగా సమాచారం. 

అయితే జిల్లా ఇన్‌చార్జి మంత్రి జగదీష్‌రెడ్డి మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిని మునుగోడు బరిలో నిలపాలనే అభిప్రాయాన్ని సీఎం కేసీఆర్ వద్ద ఉంచారు. అయితే నియోజకవర్గంలో పలువురు నేతలు మాత్రం ప్రభాకర్‌రెడ్డిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. వారికి నచ్చజెప్పేందుకు జగదీష్ రెడ్డి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో వారిని జగదీష్ రెడ్డి సీఎం కేసీఆర్‌ వద్దకు తీసుకెళ్లారు. ఈ క్రమంలోనే క్షేత్ర స్థాయిలో పరిస్థితులు చక్కబడతాయని భావించారు. కానీ కొన్ని గంటల్లోనే పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. చౌటుప్పల్‌లో కొందరు స్థానిక నేతలు సమావేశం నిర్వహించి.. ప్రభాకర్‌‌ రెడ్డిని రంగంలోకి దింపాలని అధిష్టానం నిర్ణయిస్తే తాము పార్టీ కోసం పనిచేయబోమని తేల్చిచెప్పారు. ఈ మేరకు తీర్మానం కూడా చేశారు. 

ఇదిలా ఉంటే.. బీసీ నేతలు కూడా పార్టీ టికెట్‌ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ ఉన్నారు. 2014లో ఆయనకు టికెట్ నిరాకరించడంతో పార్టీ ఎమ్మెల్సీగా అవకాశం కల్పించింది. ప్రభాకర్‌ రెడ్డి అభ్యర్థిత్వంపై స్థానిక నేతలు అసంతృప్తితో ఉన్నందున.. తనకు అవకాశం కల్పించాలని పార్టీ అధిష్టానాన్ని కర్నె ప్రభాకర్ కోరుతున్నట్టుగా తెలుస్తోంది. ఒకవేళ కర్నె ప్రభాకర్‌కు టికెట్ కేటాయిస్తే.. నియోజకర్గంలో బీసీ ఓటర్లు పెద్ద సంఖ్యలో ఓటర్లు ఉండటం ఆయనకు ప్లస్ పాయింట్ కావచ్చని ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి. 

click me!