సెప్టెంబర్ 17న హైదరాబాద్‌ స్వాతంత్య్ర వేడుకలు.. రేవంత్ రెడ్డి

By Sumanth KanukulaFirst Published Sep 14, 2022, 3:00 PM IST
Highlights

తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం సెప్టెంబర్ 17 తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 17పై పూర్తి హక్కులు కాంగ్రెస్‌వేనని చెబుతున్న టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.. ఆ రోజున హైదరాబాద్ స్వాతంత్య్ర వేడుకల పేరుతో ఉత్సవాలు నిర్వహించనున్నట్టుగా చెప్పారు.

తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం సెప్టెంబర్ 17 తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 17పై పూర్తి హక్కులు కాంగ్రెస్‌వేనని చెబుతున్న టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.. ఆ రోజున హైదరాబాద్ స్వాతంత్య్ర వేడుకల పేరుతో ఉత్సవాలు నిర్వహించనున్నట్టుగా చెప్పారు. సెప్టెంబర్ 17న తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నట్టుగా వెల్లడించారు. అదే  రోజు తెలంగాణ జాతి గీతం, రాష్ట్ర పతాకం ఆవిష్కరిస్తామని రేవంత్ చెప్పారు. 

ఇక, కొత్త రూపురేఖలతో తయారు చేయించిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని సెప్టెంబరు 17న ఆవిష్కరించేందకు కాంగ్రెస్‌ పార్టీ సన్నాహాలు చేస్తోంది. ఈ విగ్రహం ఫొటోలను కాంగ్రెస్‌ పార్టీ మంగళవారం సోషల్ మీడియాలో విడుదల చేసింది. ‘‘తెలంగాణ తల్లి అంటే దొర గడీలో మనిషి రూపంలో ఉన్న విగ్రహం కాదు. తెలంగాణ తల్లి అంటే బడుగు బలహీన సబ్బండ పీడిత వర్గాల కోసం, మన తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాల కోసం, మన తెలంగాణ గడ్డ హక్కుల కోసం కర్ర పట్టి కొట్లాడిన వీరనారీ రూపం’’ అని తెలంగాణ కాంగ్రెస్ పేర్కొంది. 

ఇక, రేవంత్ రెడ్డి సోమవారం మాట్లాడుతూ.. హైదరాబాద్ సంస్థానంలోని ప్రజల విరోచిత పోరాటాన్ని చూసిన ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ ఈ ప్రాంత ప్రజలకు కూడా స్వాతంత్య్రం ఇప్పించాలని భావించారని అన్నారు. ఈ విషయమై సర్దార్ వల్లభభాయ్ పటేల్‌కు ఆదేశాలిచ్చారని పేర్కొన్నారు. ప్రధాని ఆదేశాలతో రంగంలోకి దిగిన పటేల్.. సైనిక చర్య ద్వారా  హైదరాబాద్ సంస్థానాన్ని భారత్‌లో విలీనం చేశారని రేవంత్ తెలిపారు. 

సెప్టెంబర్ 17పై టీఆర్ఎస్ రాజకీయం చేస్తోందని ఆయన ఎద్దేవా చేశారు. టీఆర్ఎస్ - బీజేపీ అబద్ధాల వాట్సాప్ ఫ్యాక్టరీ అబద్ధాలు ప్రచారం చేస్తోందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. నిజాంకు వ్యతిరేకంగా బీజేపీ పోరాడింది లేదని.. రెండు మతాల మధ్య కొట్లా పెట్టే కుట్రలు చేస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. రాజుకు వ్యతిరేకంగా పేదలు చేసిన పోరాటమని.. సెప్టెంబర్ 17 మాదే, హక్కు కూడా మాదేనని రేవంత్ రెడ్డి అన్నారు. మా తర్వాత వేడుకలు చేసుకునే హక్కు కమ్యూనిస్టులకు వుందని ఆయన పేర్కొన్నారు. 

హైదరాబాద్‌కు స్వాతంత్ర్యం ఇప్పించిన పార్టీ కాంగ్రెస్సేనని అన్నారు. మా పేటెంట్‌ని లాక్కునే ప్రయత్నం చేస్తున్నారని.. తెలంగాణను కేసీఆర్ తెచ్చారని ప్రజల్లో భ్రమ కల్పిస్తున్నారని రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మునుగోడు ఉపఎన్నికలో గెలిచేది కాంగ్రెస్సేనని... అక్టోబర్ 24న రాహుల్ పాదయాత్ర తెలంగాణలోకి ఎంట్రీ ఇస్తుందని ఆయన చెప్పారు. 15 రోజుల పాటు తెలంగాణలో రాహుల్ గాంధీ పర్యటిస్తారని.. పాదయాత్రలో భాగంగా 3 భారీ బహిరంగ సభలు నిర్వహిస్తారని రేవంత్ రెడ్డి తెలిపారు. మహబూబ్‌నగర్, శంషాబాద్, జోగిపేటలో బహిరంగ సభలు నిర్వహిస్తారని ఆయన చెప్పారు. 

click me!