‘తోక’ తోనే కొట్టేలా ఉన్నారు...!

First Published Feb 13, 2017, 12:59 PM IST
Highlights

తెలంగాణలో బలమైన ప్రతిపక్షాలైన కాంగ్రెస్, టీడీపీ లను వదిలేసిన అధికార పార్టీ.. సీపీఎం (ఐ) నే ఎందుకు టార్గెట్ చేస్తుంది? తోక పార్టీ అని ఈసడించుకున్న పార్టీకే ఎందుకు కలవరపడుతోంది ?

తెలంగాణ ఉద్యమ సమయంలో కమ్యూనిస్టులను తోక పార్టీలని ఈసడించుకున్న సీఎం కేసీఆర్ కు ఇప్పుడు ఆ తోక పార్టీలే చుక్కలు చూపిస్తున్నాయి. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు మద్దతివ్వకుండా చివరి వరకు సమైక్యాంధ్రకే కట్టుబడటంతో సీపీఐ (ఐం) కు తెలంగాణ లో అడ్రస్ లేకుండా పోయింది. అయితే సిద్దాంతానికి కట్టుబడి ఉన్న ఆ పార్టీ  ఈ విషయాన్ని ఎప్పుడూ సీరియస్ గా తీసుకోలేదు.

 

సీట్లు, ఓట్ల కోసం కాకుండా ప్రజా ఉద్యమాలే లక్ష్యంగా తెలంగాణ లో ఆ పార్టీ తన పోరుబాటను కొనసాగిస్తూనే ఉంది. తెలంగాణలో బలంగా ఉన్న విపక్ష పార్టీ కాంగ్రెస్, సంస్థాగతంగా బలమైన కేడర్ ఉన్న టీడీపీ కూడా చేయలేని పనిని సీపీఎం ఎత్తుకుంది. రెండున్నరేళ్ల టీఆర్ ఎస్ పాలనలోని లోపాలను ఎత్తిచూపుతూ రాష్ట్రమంతా ఆ పార్టీ నేతలు పర్యటిస్తున్నారు.

 

సామాజిక న్యాయం తెలంగాణ సమగ్రాభివృద్ధి పేరుతో ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం గత కొన్నాళ్ల నుంచి తెలంగాణ అంతా సుడిగాలి పర్యటన జరుపుతున్నారు.

 

ప్రజాసంఘాల నుంచి కూడా ఆయన పాదయాత్రకు బాగానే మద్దతు లభిస్తోంది. దీంతో ఆ పార్టీ నేతలు మరింత ఉత్సాహంతో ప్రభుత్వ పాలనపై విమర్శలు ఎక్కుపెడుతున్నారు.

దీంతో అధికార పార్టీలో కలవరం మొదరైంది. అందుకే బలమైన ప్రతిక్షాలైన కాంగ్రెస్, టీడీపీలను వదిలేసి కమ్యూనిస్టులపై నే  గులాబి నేతలు మరోసారి కాలుదువ్వుతున్నారు.

 

టీఆర్ఎస్ లో కీలకంగా ఉన్న కేటీఆర్, హరిశ్ రావులే స్వయంగా రంగంలోకి దిగి కమ్యూనిస్టులపై విమర్శలకు దిగుతున్నారంటే తోక పార్టీలంటే వారు ఎంత కలవరపడుతున్నారో  దీన్ని బట్టి అర్థమవుతోంది.

 

ఇటీవల ఐటీ మంత్రి కేటీఆర్ కమ్యూనిస్టులను గంగిరెద్దులతో పోల్చి విమర్శలకు దిగారు.దీనిపై  సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం కాస్త ఘాటుగానే స్పందించారు. ‘ కేటీఆర్‌... కమ్యూనిస్టులను గురించి తక్కువగా మాట్లాడుతున్నావ్‌.. నీకు చేతనైతే కమ్యూనిస్టుల చరిత్ర ఏంటో తెలుసుకుని మాట్లాడు.. అధికారం అందిందని అహంకారంతో మాట్లాడకు.. కమ్యూనిస్టులను గంగిరెద్దులతో పోల్చి తప్పుచేస్తున్నావ్‌.. నీ రాజకీయ అనుభవం ఎంతో తెలుసుకుని మాట్లాడు.. ఎర్రజెండాలు ఏకమైతే మీ అడ్రస్‌ గల్లంతుకావడం ఖాయం' మంత్రి కేటీఆర్‌ను హెచ్చరించారు. ప్రజాసమస్యలపై పాదయాత్ర చేస్తున్న తమను విమర్శించడం సరికాదని సూచించారు.

 

click me!