
గురుకుల ఉపాధ్యాయ పోస్టుల నోటిఫికేషన్ మరో గ్రూప్ 2లా మారింది. మొదట 60 శాతం మార్కులతో పాటు అనేక నిబంధనలు పెట్టడంతో అభ్యర్థుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమైన విషయం తెలిసిందే. విద్యార్థి సంఘాలు వర్సిటీల బంద్ కు పిలుపునివ్వడంతో పాటు తెలంగాణ రాజకీయ జేఏసీ కూడా అభ్యర్థులకు మద్దతివ్వడంతో ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది.
ఈ అంశంపై స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. సీఎం సూచన మేరకు అర్హత మార్కుల తగ్గింపుపై ముఖ్యమంత్రి కార్యాలయం వెంటనే ఒక ప్రకటన కూడా విడుదల చేసింది.
గురుకుల నోటిఫికేన్ అర్హతను 60 శాతం కాకుండా 50 శాతానికి కుదించాలని ప్రభుత్వ వర్గాలు టీఎస్ పీయస్సీకి సూచించాయి. దీంతో అభ్యర్థలు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. అయితే టీఎస్ పీయస్సీకీ కొత్త చిక్కులు వచ్చి పడ్డాయి.
అయితే సీఎం ఆదేశాలతో నోటిఫికేషన్ కథ మళ్లీ మొదటికొచ్చినట్టైంది. ప్రభుత్వ ప్రకటను అనుసరించి అర్హత మార్కులను తగ్గిస్తూ సవరణ నోటిఫికేషన్ వేయాలా లేదా కొత్త నోటిఫికేషన్ విడుదల చేయాలా అనే సంశయం ఏర్పడింది.
అయితే పాత నోటిఫికేషన్ కు సవరణ చేసి మళ్లీ ప్రకటనజారీ చేస్తే న్యాయపరమైన చిక్కులు వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే పాత నోటిఫికేషన్ ను రద్దు చేసి కొత్త నిబంధనలను అనుసరించి మరో నోటిఫికేషన్ వేయాలని టీఎస్ పీయస్సీ నిర్ణయించినట్లు తెలుస్తోంది.