కరోనా వైరస్ వ్యాప్తి విషయంలో తన వ్యాఖ్యల ద్వారా గవర్నర్ తమిళిసై తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రభుత్వంపై దాడికి ప్రతిపక్షాలకు అస్త్రాన్ని అందించారు. కాంగ్రెసు, బిజెపి విమర్శనాస్త్రాలు సంధిస్తున్నాయి.
హైదరాబాద్: కరోనా వైరస్ విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుకు గవర్నర్ తమిళిసై చిక్కులు కల్పించినట్లే. కరోనా వైరస్ వ్యాప్తి విషయంలో కేసీఆర్ ప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరించడం లేదని ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రతిపక్షాలకు ఆయుధంగా పనికి వస్తున్నాయి.
తమిళిసై వ్యాఖ్యలను ఆధారం చేసుకుని కాంగ్రెసు, బిజెపి నాయకులు ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలుసంధిస్తున్నారు. మరోవైపు హుజూర్ నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి తమిళసై మీద చేసిన వ్యాఖ్యలు కూడా తలనొప్పిగా మారాయి. రాజ్యాంగబద్దమైన పదవిలో ఉన్న తమిళిసై మీద ఆ విధమైన వ్యాఖ్యలు చేయడం వల్ల కొరివితో తల గోక్కోవడమేనని టీఆర్ఎస్ అధిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తోంది.
undefined
తమిళిసై ఆ విధమైన వ్యాఖ్యలు చేశారంటే పరిస్థితి తెలంగాణలో ఏ విధంగా అర్థం చేసుకోవచ్చుననని తెలంగాణ పిసిసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. గవర్నర్ వ్యాఖ్యలను స్వాగతిస్తున్నట్లు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. స్వతహాగా డాక్టర్ అయిన గవర్నర్ కరోనాపై అవగాహనతోనే మాట్లాడారని ఆయన అన్నారు.
హైకోర్టు చీవాట్లు పెట్టినా, గవర్నర్ విమర్శించినా ప్రభుత్వానికి చీమ కుట్టినట్లుగా కూడా లేదని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీ కోసం సిఫార్సు చేయాలని ఆయన కోరారు. ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా ప్రైవైట్ ఆస్పత్రుల్లో పడకలను స్వాధీనం చేసుకోలేదని అన్నారు.
కరోనా కట్టడి విషయంలో గవర్నర్ తమిళిసై కేసీఆర్ ప్రభుత్వాన్ని చీవాట్లు పెట్టడం స్వాగతిస్తున్నట్లు బిజెపి ముఖ్య అధికార ప్రతినిధి కృష్ణసాగర్ అన్నారు. ఇది చూసైనా ప్రభుత్వం బుద్ధి తెచ్చుకోవాలని ఆయన అన్నారు. కోవిడ్ విషయంలో ప్రభుత్వం ఇప్పటికైనా తన పద్ధతిని సరిదిద్దుకోవాలని ఆయన అన్నారు.
స్వయంగా వైద్యురాలైన గవర్నర్ మార్చి నుంచి కరోనా విషయంలో టీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును నేరపూరిత నిర్లక్ష్యాన్ని అర్థం చేసుకున్నారని ఆయన అన్నారు. చివరికి ఇప్పుడు చివరి అస్త్రంగా టీఆర్ఎస్ ప్రభుత్వంపై బహిరంగంగా తప్పు పట్టారని ఆయన అన్నారు.
పరిస్థితులపై అవగాహనతోనే గవర్నర్ తమిళిసై మాట్లాడారని సీఎల్పీ నేత మల్లుభట్టి విక్రమార్క అన్నారు. స్వయంగా వైద్యురాలైన గవర్నర్ చేసిన సూచనలు సరైనవేనని ఆయన అన్నారు.