కేసీఆర్ ప్రభుత్వానికి సెగ: తమిళిసై మీది వ్యాఖ్యను డిలిట్ చేసిన సైదిరెడ్డి

By telugu teamFirst Published Aug 19, 2020, 2:15 PM IST
Highlights

తెలంగాణ గవర్నర్ తమిళిసై మీద చేసిన వ్యాఖ్యను టీఆర్ఎస్ హుజూర్ నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి తొలగించారు. పార్టీ  అధిష్టానం ఆదేశాలతో ఆయన దాన్ని డిలీట్ చేసినట్లు తెలుస్తోంది.

హైదరాబాద్: తాను గవర్నర్ తమిళిసై మీద చేసిన వ్యాఖ్యలు తీవ్రమైన దుమారం రేపడంతో తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) హుజూర్ నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి వెనక్కి తగ్గారు. గవర్నర్ మీద చేసిన వ్యాఖ్యలను ఆయన ట్విట్టర్ నుంచి తొలగించారు. గవర్నర్ మీద వ్యాఖ్యలతో తీవ్రమైన సెగ తగిలే అవకాశం ఉండడంతో పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు ఆయన దాన్ని తొలగించినట్లు తెలుస్తోంది. 

బిజెపి నేతల విమర్శలకు స్పందించవద్దని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇప్పటికే పార్టీ నేతలకు ఆదేశాలు జారీ చేశారు. గవర్నర్ విషయంలో కూడా అదే వైఖరితో ఉండాలని ఆయన చెప్పినట్లు తెలుస్తోంది. 

ఇదిలావుంటే, గవర్నర్ తమిళిసై మీద తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. కరోనా వైరస్ ను ఎదుర్కోవడంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరించడం లేదని గవర్నర్ తమిళిసై ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు. దానిపై శానంపూడి సైదిరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 

గవర్నర్ తమిళిసై బిజెపి అధ్యక్షురాలిగా వ్యవహరిస్తున్నారని ఆయన అన్నారు. దానిపై బిజెపి నేత జితెందర్ రెడ్డి స్పందించారు. గవర్నర్ వ్యాఖ్యల వెనక బిజెపి లేదని ఆయన స్పష్టం చేశారు. కరోనా వైరస్ నియంత్రణలో ప్రభుత్వం విఫలమైందనేది నిజమని ఆయన అన్నారు. 

బిజెపి అధ్యక్షుడు గవర్నర్ గా ఉంటే ప్రస్తుత పరిస్థితులకు రాష్ట్రంలో ఇప్పటికే రాష్ట్రపతి పాలనకు సిఫార్సు చేసి ఉండేవారని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ఏం జరుగుతుందో తమిళిసైకి తెలియదా అని ఆయన ప్రశ్నించారు. సైదిరెడ్డి మీద విమర్శలు గుప్పిస్తూ నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. వాట్సప్ లో అవి వైరల్ అవుతున్నాయి. 

కరోనా వైరస్ కట్టడిలో ప్రభుత్వం క్రియాశీలకంగా వ్యవహరించలేదని తమిళిసై అన్నారు. కరోనా ఉధృతిని, వ్యాప్తిని అంచనా వేయడంలో ప్రభుత్వం విఫలమైందని ఆమె అన్నారు. 

కరోనా వైరస్ నియంత్రణకు పెద్ద యెత్తున పరీక్షలు చేయడమొక్కటే పరిష్కారమని, మొబైల్ టెస్టింగులు చేయాలని తాను ప్రభుత్వానికి పలుమార్లు సూచించానని ఆమె చెప్పారు. కరోనా తీవ్రతపై, వ్యాప్తి, ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ, తగిన సూచనలు చేస్తూ ఇప్పటి వరకు ఐదారు లేఖలు రాశానని, అయితే ప్రభుత్వం స్పందించలేదని ఆమె అన్నారు. 

click me!