
Tamil Nadu CM MK Stalin praises KCR: తమిళనాడు ముఖ్యమంత్రి, ద్రవిడ మున్నేట్ర కజగం నాయకుడు ఎంకే స్టాలిన్.. తెలంగాణ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై ప్రశంసలు కురిపించారు. స్టాలిన్, కేసీఆర్ ఇద్దరూ ప్రస్తుతం బీజేపీ నేతృత్వంలోని కేంద్రంతో అనేక విషయాలపై విభేదిస్తున్నారు. పలు అంశాలకు సంబంధించి ఇరువురు నేతలు ఇదివరకు చర్చలు కూడా జరిపారు.
వివరాల్లోకెళ్తే.. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి (ఏప్రిల్ 14) సందర్భంగా ఆయన 125 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన తెలంగాణ సీఎం కేసీఆర్ ను తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అభినందించారు. "బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా 125 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన గౌరవ @TelanganaCMO అభినందనలు. బుద్ధ విగ్రహానికి, తెలంగాణ సెక్రటేరియట్ కు మధ్య సమానత్వానికి చిహ్నంగా అంబేద్కర్ విగ్రహాన్ని ఉంచాలన్న ఆలోచన గొప్పది" అని పేర్కొన్నారు.
ప్రస్తుతం స్టాలిన్, కేసీఆర్ లు బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంతో పలు విషయాల్లో విభేదిస్తున్నారు. హిందీని బలవంతంగా రుద్దడం, రాష్ట్ర హక్కులు వంటి కొన్ని అంశాలపై బీఆర్ఎస్, డీఎంకేలు ఏకతాటిపై గళమెత్తాయి. మోడీ సర్కారుపై ప్రత్యక్షంగానే విమర్శల దాడులు చేస్తున్నాయి. ఇదిలావుండగా, సుమారు 465 టన్నుల బరువున్న ఈ విగ్రహాన్ని 50 అడుగుల ఎత్తైన పీఠంపై ఏర్పాటు చేసి, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జీవితంలోని ముఖ్యమైన సంఘటనలను ప్రదర్శించే మ్యూజియం, గ్యాలరీని ఏర్పాటు చేశారు. తెలంగాణ ప్రభుత్వం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ పేరు పెట్టిన కొత్త సెక్రటేరియట్ భవనం పక్కనే ఈ విగ్రహం ఉంది.