ఈ ఏడాది హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం వుందా, లేదా : ప్రభుత్వంపై తెలంగాణ హైకోర్టు ప్రశ్నల వర్షం

By Siva KodatiFirst Published Aug 5, 2021, 4:57 PM IST
Highlights

కొవిడ్‌ మహమ్మారి ఎప్పుడైనా ఉప్పెనలా విజృంభించవచ్చని, వైరస్‌ ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకొని హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనంపై నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. 

హుస్సేన్‌సాగర్‌లో వినాయక నిమజ్జనంపై శాశ్వత నిర్ణయం తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. హుస్సేన్ సాగర్‌లో గణేష్ నిమజ్జనాన్ని నిషేధించాలంటూ న్యాయవాది వేణుమాధవ్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై చీఫ్ జస్టిస్ హిమా కోహ్లి నేతృత్వంలోని ఉన్నత న్యాయస్థానం గురువారం విచారణ చేపట్టింది. కోవిడ్ కారణంగా గతేడాది నిమజ్జనానికి అనుమతివ్వలేదని ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు తెలిపారు.

దీనిపై స్పందించిన కోర్ట్.. ఈ ఏడాది అనుమతిస్తున్నారా? అని ప్రశ్నించింది. ప్రభుత్వ నిర్ణయం తెలుసుకొని చెబుతానని న్యాయవాది కోర్టకు వివరించారు. కొవిడ్‌ మహమ్మారి ఎప్పుడైనా ఉప్పెనలా విజృంభించవచ్చని, వైరస్‌ ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకొని నిర్ణయం తీసుకోవాలని ధర్మాసనం సూచించింది. ప్రతీ ఏడాది అప్పటికప్పుడు నిర్ణయం తీసుకోవడం సరికాదని హితవు పలికింది. హుస్సేన్‌సాగర్‌ను కాలుష్యరహితంగా అందంగా ఉంచాలని ప్రభుత్వాన్ని కోరింది. పర్యాటకులను ఆకర్షించేలా తీర్చిదిద్దాలని అభిప్రాయపడింది. అనంతరం గణేష్ నిమజ్జనంపై ప్రభుత్వ నిర్ణయమేంటో తెలపాలని కోరుతూ విచారణను ఈనెల 11కి వాయిదా వేసింది. 

click me!