రూ.156 కోట్ల స్వాదాద్రి స్కామ్: మహిళతో సహా ముగ్గురి అరెస్టు

By Siva Kodati  |  First Published Jul 4, 2020, 4:29 PM IST

స్వాదాద్రి రియల్ ఎస్టేట్ కుంభకోణం కేసును సైబరాబాద్ పోలీసులు ఛేదించారు. స్వాదాద్రి రియల్ ఎస్టేట్ కంపెనీ ఎండీ యార్లగడ్డ రఘుతో పాటు మీనాక్షి, శ్రీనివాస్ అనే ఇద్దరిని కూడా అరెస్టు చేశారు.


హైదరాబాద్:స్వాదాద్రి రియల్ ఎస్టేట్ కుంభకోణం కేసును సైబరాబాద్ పోలీసులు ఛేదించారు. స్వాదాద్రి రియల్ ఎస్టేట్ కంపెనీ ఎండీ యార్లగడ్డ రఘుతో పాటు మీనాక్షి, శ్రీనివాస్ అనే ఇద్దరిని కూడా అరెస్టు చేశారు. ఈ కుంభకోణం వివరాలను సైబరాబాద్ పోలీసు కమిషనర్ సజ్జనార్ మీడియా ప్రతినిధులకు వివరించారు. 

దాదాపు 3 వేల మందిని స్వాదాద్రి రియల్ ఎస్టేట్ కంపెనీ మోసం చేసినట్లు గుర్తించారు. ఇది రూ.156 కోట్ల కుంభకోణమని సజ్జనార్ చెప్పారు. కరోనా వైరస్ రాకుండా ఉంటే మరో వంద కోట్ల దాకా మోసం జరిగి ఉండేదని ఆయన అన్నారు. ప్రజల నుంచి డబ్బులు వసూలు చేసి భూములు కొనుగోలు చేసి వారు విక్రయించారు. అయితే, డబ్బులు పెట్టినవారికి తిరిగి చెల్లించలేదు.

Latest Videos

undefined

రఘు మల్టీ లెవెల్ మార్కెటింగ్ చేశాడని, ఒక్క ఏజెంట్ ముగ్గురిని చేరిస్తే అధిక మొత్తం ఇస్తానని ఆశపెట్టాడని సజ్జనార్ చెప్పారు. ఏజెంట్లపై కూడా కేసులు నమోదు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వడ్డీ పేరుతో రఘు ప్రజలను మోసం చేశాడని సజ్జనార్ చెప్పారు. ఏడాది లోపల ప్లాట్ వస్తుందంటే ఎలా నమ్ముతారని ఆయన ప్రశ్నించారు. 

ఎవరో వచ్చి ప్లాట్ అమ్ముతున్నారంటే ఏజెంట్లు ఎలా నమ్ముతారని ఆయన అడిగారు. వచ్చే ఆదాయం తగ్గి ఇచ్చేది ఎక్కువైతే దుకాణం మూసేస్తారని ఆయన అన్నారు. ఎంత మంది ప్లాట్స్ బుక్ చేసుకున్నారు, ఎంత మంది డబ్బులు వాపసు ఇచ్చారు అనేది చూడాల్సి ఉందని అన్నారు.

2017లో హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలో ఆఫీసు ప్రారంభించారని, ఆ తర్వాత మాదాపూర్‌లో అక్టోబర్ 2019 తెరిచారని సజ్జనార్ తెలిపారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు అయ్యప్ప సొసైటీ నుంచి కార్యకలాపాలు సాగిస్తున్నారని.. అలాగే భూములను ప్రజలకు చూపించేందుకు గాను బెంజ్, ఫార్చ్యూనర్ వంటి 20 కార్లలో తిప్పేవారని సీపీ వెల్లడించారు.

అదే విధంగా పలువురితో సమావేశాలు ఏర్పాటు చేసి ప్రజలను వలలో పడేశారని ఆయన తెలిపారు. నిందితుల్లో రఘుది విజయవాడ కాగా, శ్రీనివాస్‌ది గుంటూరు, మీనాను కర్ణాటకకు చెందిన వారుగా గుర్తించామన్నారు.

రియల్ ఎస్టేట్ కంపెనీల నుంచి భూములను కొనుగోలు చేయాలని భావించే వారు ఒకటికి పదిసార్లు అన్ని సరిచూసుకున్నాకే రంగంలోకి దిగాలని సజ్జనార్ ప్రజలకు సూచించారు. 

click me!