
స్వచ్చతా దివస్ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం అందించిన అవార్డుల్లో నాలుగింటిని తెలంగాణ రాష్ట్రం అందుకుంది. న్యూఢిల్లీ లోని ప్రవాసీ భారతీయ కేంద్రంలో అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. కేంద్ర మంత్రి ఉమా భారతి చేతులమీదుగా అధికారులు ఈ అవార్డులను అందుకున్నారు.
స్వచ్చ భారత్ మిషన్ లో భాగంగా అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన రాష్ట్రాలు, జిల్లాలకు సాప్ అవార్డ్స్, స్వచ్చతా పక్వాడ, స్వచ్చ్ ఐకానిక్ ప్లేసేస్ విభాగాల్లో అవార్డుల లభించాయి. ఇందులో తెలంగాణకు 4 అవార్డులు లభించాయి.
దక్షిణాదిలో స్వచ్చతా ర్యాంక్స్ లో 81.48 పాయింట్లతో తెలంగాణ రెండవ స్థానంలో నిలిచి స్టేట్ లెవల్ అవార్డకు ఎంపికైంది. ఈ అవార్డును కేంద్ర మంత్రి చేతులమీదుగా పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వికాస్ రాజ్, పంచాయితీ రాజ్ కమిషనర్ నీతూ కుమారీ ప్రసాద్ లు అందుకున్నారు.
ఇక జిల్లాల విషయానికి వస్తే స్వచ్చతలో 97.45 పాయింట్లతో పెద్దపల్లి జిల్లా దేశంలోనే మూడో స్థానం, దక్షిణాది రాష్ట్రాల్లో మొదటి స్థానంలో నిలిచింది. ఈ అవార్డును పెద్దపల్లి కలెక్టర్ శ్రీదేవసేన అందుకున్నారు. ఇదే విభాగంలో 95.59 పాయింట్లతో వరంగల్ జిల్లా మూడో స్థానంలో నిలిచింది. ఈ అవార్డును ప్రస్తుత జిహెచ్ఎంసి అదనపు కమీషనర్ ఆమ్రపాలి అందుకున్నారు.
ఇక స్వచ్చతా ఐకాన్ విభాగంలో చార్మినార్ దేశంలోనే మొదటిస్థానంలో నిలిచింది. ఈ అవార్డును జీహెచ్ఎంసీ అదనపు కమిషనర్ ముషారఫ్ ఫరూకీ, జీహెచ్ఎంసీ డైరెక్టర్ ప్లానింగ్ శ్రీనివాస్ లు కలిసి అందుకున్నారు.
ఈ కార్యక్రమం అనంతరం అవార్డులు అందుకున్న అధికారులు మీడియాతో మాట్లాడారు. దేశంలో పెద్దపల్లి జిల్లా పెద్దపులి లాంటి జిల్లాగా నిరూపించుకుందంటూ కలెక్టర్ దేవసేన ప్రశంసించారు. దేశ వ్యాప్తంగా మూడో స్థానం, దక్షిణాది రాష్ట్రాల్లో తొలిస్థానం జిల్లా నిలవడం తమకు గర్వకారణంగా ఉందన్నారు. అనంతరం పంచాయతీ రాజ్ కమిషనర్ నీతూ కుమారి ప్రసాద్ మాట్లాడుతూ... తెలంగాణ కు స్వచ్చ్ సర్వేక్షణ్ అవార్డు లలో తెలంగాణ రాష్ట్రానికి నాలుగు అవార్డులు దక్కడం గర్వంగా ఉందన్నారు.
జిహెచ్ఎంసి అదనపు కమీషనర్ ఆమ్రపాలి మాట్లాడుతూ... దక్షిణాది రాష్ట్రాల్లో మూడో స్థానంలో వరంగల్ నిలవడం సంతోషంగా ఉందన్నారు. వరంగల్ అర్బన్ ప్రజల సహకారం తోనే ఈ ఘనత సాధించగలిగామని తెలిపారు. వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ గా స్వచ్చ్ సర్వేక్షణ్ లో చేసిన కృషికి ఈ అవార్డు లభించిందని ఆమ్రపాలి వివరించారు.