లవర్ తనకు దక్కదనే అక్కసుతో నవీన్ ను హరిహరకృష్ణ హత్య చేసినట్టుగా పోలీసులు పేర్కొన్నారు. హరిహరకృష్ణ రిమాండ్ రిపోర్టులో పలు కీలక అంశాలను పోలీసులు ప్రస్తావించారు.
హైదరాబాద్: నవీన్ ను హత్య చేసేందుకు మూడు నెలల క్రితమే హరిహరకృష్ణ ప్లాన్ చేశాడు. ప్రియురాలు తనకు దక్కదనే కసితో నవీన్ నుహత్య చేసినట్టుగా పోలీసులు గుర్తించారు. నవీన్ హత్య కేసులో నిందితుడు హరిహరకృష్ణ రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలను ప్రస్తావించారు పోలీసులు.
లవర్ విషయంలో నవీన్ అడ్డుగా ఉన్నాడని భావించి హరిహరకృష్ణ అతడిని హత్య చేయాలని భావించాడు. ఈ విషయమై నవీన్ ను ట్రాప్ చేసినట్టుగా పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. రెండు నెలల క్రితం మలక్ పేట సూపర్ మార్కెట్ లో హరిహరకృష్ణ కత్తిని కొనుగోలు చేసిన విషయాన్ని పోలీసులు గుర్తించారు. ఈ నెల 17వ తేదీన నవీన్ ను హరిహరకృష్ణ అత్యంత దారుణంగా హత్య చేసినట్టుగా పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు.
హత్యకు ముందు హరిహరకృష్ణ, నవీన్ లు ఇద్దరూ మద్యం సేవించారు. పెద్ద అంబర్ పేట వద్ద ఉన్న మద్యం దుకాణంలో వీరిద్దరూ మద్యం కొనుగోలు చేసిన సీసీటీవీ పుటేజీని కూడా పోలీసులు సేకరించారు. మద్యం బాటిల్ తో ఔటర్ రింగ్ రోడ్డుకు సమీపంలోని నిర్మానుష్యప్రాంతానికి వెళ్లారు. రాత్రి 9 గంటల నుండి 11:30 గంటల వరకు మద్యం తాగినట్టుగా రిమాండ్ రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారని ప్రముఖ తెలుగు న్యూస్ చానెల్ ఎన్టీవీ కథనం ప్రసారం చేసింది.
మద్యం తాగిన తర్వాత లవర్ విషయమై నవీన్, హరిహరకృష్ణ మధ్య ఘర్షణ జరిగిందని రిమాండ్ రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు. దీంతో నవీన్ ను హరిహరకృష్ణ హత్య చేశాడు. ఆ తర్వాత నవీన్ శరీరబాగాలను వేరు చేశాడు.తెల్లవారుజామున మూడు గంటల వరకు హరిహరకృష్ణ అక్కడే ఉన్నట్టుగా పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు.
నవీన్ శరీర బాగాలను బ్యాగులో వేసుకొని బ్రహ్మణపల్లి శివారుకు వచ్చి నిర్మానుష్యప్రదేశంలో వేశాడు.అనంతరం సమీపంలోనే ఉన్న స్నేహితుడు హసన్ ఇంటికి వెళ్లాడు. స్నేహితుడి ఇంట్లోనే స్నానం చేసి తిరిగి వెళ్లిపోయాడని రిమాండ్ రిపోర్టు పేర్కొంది. హత్య విషయాన్ని కూడా స్నేహితుడికి చెప్పాడు. హత్య చేసిన మరునాడు లవర్ కి కూడా సమాచారం ఇచ్చినట్టుగా రిమాండ్ రిపోర్టు పేర్కొందని ఆ కథనం వివరించింది.
స్నేహితుడి ఇంటి నుండి తిరిగి నవీన్ ను హత్య చేసిన ప్రాంతానికి చేరుకున్నారు. నవీన్ మృతదేహం వద్ద శరీరబాగాలు కన్పించకుండా జాగ్రత్తలు తీసుకున్నాడని ఈ రిమాండ్ రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారని ఈ కథనం తెలిపింది.
also read:నవీన్ పేరేంట్స్ కు క్షమాపణలు చెప్పిన హరిహరకృష్ణ తండ్రి
ఈ హత్య చేసిన తర్వాత హరిహరకృష్ణ కోదాడ, ఖమ్మం, వరంగల్, విశాఖపట్టణం ప్రాంతాలకు వెళ్లాడు. ఈ నెల 24వ తేదీన హైద్రాబాద్ కు వచ్చాడు. హైద్రాబాద్ కు వచ్చిన రోజే అబ్దుల్లాపూర్ మెట్ పోలీసులకు హరిహరకృష్ణ లొంగిపోయాడని రిమాండ్ రిపోర్టు పేర్కొంది.నవీన్ హత్య చేసేందుకు పక్కా ప్రణాళిక రచించి హత్య చేశాడని పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారని ఈ కథనం ప్రకారంగా తెలుస్తుంది.