జిహెచ్ఎంసీకి సుప్రీం కోర్టులో చుక్కెదురు... పిటిషన్ కొట్టివేత

By Arun Kumar PFirst Published Jan 28, 2021, 11:43 AM IST
Highlights

హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ జిహెచ్ఎంసీ దాఖలుచేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. 

హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ కు దేశ అత్యున్నత న్యాయస్థానంలో చుక్కెదురయ్యింది. ఓ ఇంటి నిర్మాణం విషయంలో జీహెచ్ఎంసి అభ్యంతరం తెలపడాన్ని తప్పుబట్టింది న్యాయస్థానం.  ఈ క్రమంలోనే ఇంటి నిర్మాణానికి సంబంధించి జీహెచ్‌ఎంసీ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. 

వివరాల్లోకి వెళితే... కూకట్‌పల్లికి చెందిన శాలివాహనరెడ్డికి హఫీజ్‌పేట సర్వే నంబరు 78లోని 461 చదరపు అడుగుల స్థలం వుంది. ఈ స్థలంలో ఇంటిని నిర్మించాలనుకున్న అతడి ప్రయత్నాన్ని జీహెచ్ఎంసీ అధికారులు అడ్డుకున్నారు. ఆ స్థలం ప్రభుత్వ భూమి అంటూ జీహెచ్‌ఎంసీ అధికారులు ఇంటి నిర్మాణానికి అనుమతి ఇవ్వలేదు. దీంతో బాధితుడు ఇదివరకే తెలంగాణ హైకోర్టును ఆశ్రయించాడు. ఈ క్రమంలో ఇల్లు నిర్మాణానికి అనుమతి ఇవ్వాలని... అంతేకాకుండా బాధితుడికి రూ.10వేలు చెల్లించాలంటూ జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ను హైకోర్టు ఆదేశించింది. 

అయితే హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ జిహెచ్ఎంసీ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.  ఈ పిటిషన్ పై విచారణ జరిపిన న్యాయమూర్తులు జస్టిస్‌ సంజయ్‌ కిషన్‌ కౌల్, జస్టిస్‌ దినేష్‌ మహేశ్వరి, జస్టిస్‌ హృషీకేష్‌రాయ్‌లతో కూడిన ధర్మాసనం విచారించింది. ఈ క్రమంలో తెలంగాణ హైకోర్టు తీర్పునే సమర్ధించిన న్యాయస్థానం జీహెచ్‌ఎంసీ పిటిషన్‌ను కొట్టివేసింది.
 

click me!