
తెలంగాణలో 23 కొత్త జిల్లా కోర్టుల (new district courts in telangana) ప్రారంభోత్సవం సందర్భంగా సుప్రీంకోర్ట్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ (supreme court chief justice) ఎన్వీ రమణ (justice nv ramana) సంచలన వ్యాఖ్యలు చేశారు. కోర్టు తీర్పులకు కొందరు వక్రభాష్యం చెప్పి పైశాచిక ఆనందం పొందుతున్నారని ఆయన మండిపడ్డారు. పరిమితులు దాటిని వారిని ఉపేక్షించేది లేదని.. కొందరికి న్యాయవ్యవస్థపై సరైన అవగాహన లేదని సీజేఐ స్పష్టం చేశారు. కొత్త రాష్ట్ర భవిష్యత్తుపై గతంలో అనుమానాలు వుండేవని అన్నారు. కానీ ఎనిమిదేళ్లలో అనుమానాలన్నీ తొలగిపోయాయని సీజేఐ వ్యాఖ్యానించారు.
రాష్ట్రాభివృద్ధికి న్యాయశాఖ అభివృద్ధి కూడా అవసరమని.. సీఎం కేసీఆర్ (kcr) అర్ధం చేసుకున్నారని ఎన్వీ రమణ ప్రశంసించారు. తెలంగాణ రాష్ట్రం పరిపాలన వికేంద్రీకరణతో పాటు న్యాయ వికేంద్రీకరణకు అడుగులు వేసిందని ఆయన కొనియాడారు. ఎన్టీఆర్ (ntr) తర్వాత న్యాయవ్యవస్థలో చేపట్టిన అతిపెద్ సంస్కరణ ఇదేనని జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. తెలంగాణలో జడ్జీల సంఖ్యను 22 నుంచి 42కి పెంచామని సీజేఐ తెలిపారు. ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ కోసం ప్రతిపాదనలు పంపితే కేసీఆర్ వెంటనే ఆమోదించారని సీజేఐ వెల్లడించారు. వారంలోగా తెలంగాణ హైకోర్టుకు ఇద్దరు న్యాయమూర్తులను నియమిస్తామన్నారు.
Also read:తెలంగాణలో కోలువుదీరిన 23 కొత్త జిల్లా కోర్టులు.. ప్రారంభించిన సీజేఐ ఎన్వీ రమణ, సీఎం కేసీఆర్
తెలంగాణ కోర్టుల్లోనూ ఐటీ సేవలు మరింత ఉపయోగపడాలని ఎన్వీ రమణ ఆకాంక్షించారు. న్యాయవ్యవస్థ అనేది ఎవరో కొందరి స్వార్థ ప్రయోజనాల కోసం పనిచేసేది కాదని ఆయన వ్యాఖ్యానించారు. ఇది ప్రజల హక్కుల పరిరక్షణ కోసం రాజ్యాంగబద్దంగా, నిబద్ధతతో పనిచేస్తుందని ఎన్వీ రమణ చెప్పారు. వ్యవస్థ ప్రయోజనం, సమాజ శ్రేయస్సే న్యాయవ్యవస్థకు ముఖ్యమన్నారు. హైదరాబాద్‌కు ఎన్నో అంతర్జాతీయ సంస్థలు వస్తున్నాయని.. కమర్షియల్ కోర్టుల సంఖ్యలను సైతం పెంచాల్సిన అవసరం వుందని సీజేఐ అభిప్రాయపడ్డారు.
అంతకుముందు సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. తాను కోరిన వెంటనే హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్యను పెంచేందుకు సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ చొరవ తీసుకున్నారని తెలిపారు. తెలంగాణ 23 కొత్త జిల్లా కోర్టులను ఇవాళ జస్టిస్ ఎన్వీ రమణతో కలిసి కేసీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లా కోర్టుల ఏర్పాటుపైనా వేగంగా నిర్ణయాలు తీసుకున్నామని సీఎం తెలిపారు. మెదక్ జిల్లాలోని తూర్పు ప్రాంతంలో వుండే సిద్ధిపేట తన స్వస్థలమని.. జిల్లా రాజధాని సంగారెడ్డి అని కేసీఆర్ తెలిపారు. తమ వూరు నుంచి సంగారెడ్డి 150 కిలోమీటర్ల దూరంలో వుందని.. సెషన్స్ కోర్టుకు వెళ్లేటప్పుడు అప్పట్లో ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు.
వాటన్నింటిని దృష్టిలో వుంచుకుని.. పరిపాలనను మరింత సులభతరం చేసేందుకు గాను 33 జిల్లాలను ఏర్పాటు చేసినట్లు కేసీఆర్ వెల్లడించారు. ములుగు, భూపాల్‌పల్లి జిల్లాల ఏర్పాటులో తాను ఛత్తీస్‌గడ్ అధికారులతో మాట్లాడినట్లు సీఎం చెప్పారు. పరిపాలనా వికేంద్రీకరణతో ఎన్ని సత్ఫలితాలు సాధించగలుగుతాం అన్న దానికి తెలంగాణ ఆవిష్కరిస్తున్న అద్భుతాలే నిదర్శనమని సీఎం అన్నారు. రాష్ట్ర అవతరణ రోజునే జిల్లాల కోర్టులు ప్రారంభించడం ఆనందంగా వుందని కేసీఆర్ వ్యాఖ్యానించారు. సిటీ సివిల్ కోర్ట్, రంగారెడ్డి కోర్టును కూడా విభజన చేయాలని కేసీఆర్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కోరారు.