
తెలంగాణ న్యాయ చరిత్రలో సరికొత్త శకం ఆరంభమైంది. రాష్ట్రంలోని కొత్త జిల్లాల్లో ఒకేసారి 23 డిస్ట్రిక్ట్ కోర్టులు (district courts) ప్రారంభమయ్యాయి. గురువారం హైకోర్టు (telangana high court) ఆవరణలో జరిగిన కార్యక్రమంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ (cji nv ramana) , ముఖ్యమంత్రి కేసీఆర్ (cm kcr) సంయుక్తంగా కొత్త డిస్ట్రిక్ట్ కోర్టులను ప్రారంభించారు.
ప్రత్యేక రాష్ట్రం ఏర్పడే నాటికి తెలంగాణలోని ఉమ్మడి జిల్లాల్లో 10 డిస్ట్రిక్ట్ కోర్టులు ఉండేవి. ఆ తర్వాత పరిపాలనా సంస్కరణల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ మినహా మిగిలిన ఉమ్మడి జిల్లాలను 33 జిల్లాలుగా పునర్విభజించిన విషయం తెలిసిందే. దీనికి అనుగుణంగా సీఎం కేసీఆర్ విజ్ఞప్తి మేరకు కొత్త జిల్లాల్లో 23 డిస్ట్రిక్ట్ కోర్టుల ఏర్పాటుకు హైకోర్టు అనుమతించింది. ఈ జ్యుడిషియల్ జిల్లాలను, వాటి పరిధిని గుర్తిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే జీవోలు జారీ చేసింది.
కొత్త జిల్లా కోర్టుల ఏర్పాటుతో కింది స్థాయిలో కేసుల విచారణ వేగవంతంగా జరుగుతుందని న్యాయ నిపుణులు చెబుతున్నారు. కొత్త జిల్లాల్లో జిల్లా కోర్టులకు భవనాల నిర్మాణం, మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని అధికార వర్గాలు వెల్లడిస్తున్నాయి. మొత్తంగా జిల్లాలకు పోర్టు పోలియో జడ్జీలను హైకోర్టు నియమించింది. న్యాయమూర్తులను సైతం అపాయింట్ చేసింది.