యూట్యూబ్ లో నాగపూజల వీడియో చూసి కూతురిని బలిచ్చిన తల్లి

By telugu teamFirst Published Apr 16, 2021, 7:36 AM IST
Highlights

మూఢ విశ్వాసంతో ఓ మహిళ తన కన్నకూతురి ప్రాణాలు తీసింది. సర్పదోషం ఉందనే మూఢ నమ్మకంతో తన ఆరు నెలల కూతురు గొంతు కోసి హత్య చేసింది. ఈ సంఘటన సూర్యాపేట జిల్లాలో జరిగింది.

సూర్యాపేట: తెలంగాణలోని సూర్యాపేట జిల్లాలో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. మూఢ విశ్వాసంతో ఓ తల్లి తన కన్నకూతురి ప్రాణం తీసింది. నాగదేవతల చిత్రపటాల వద్ద కూతురు గొంతు కోసింది. యూట్యూబ్ లో నాగపూజలకు సంబంధించిన వీడియోలు చూసే అలవాటు ఉన్న ఆ మహిళ తన కూతురిని ఆ రీతిలోనే హత్య చేసింది. తన బిడ్డను చంపేసిన తర్వాత తనకు ఏ దోషమూ లేదంటూ కేకలు వేసింది. 

సూర్యాపేట జిల్లా మోతె మండలం బుర్కచర్ల గ్రామం శివారు తండా మేకలపాటిలో గురువారం సాయంత్రం ఆ సంఘటన చోటు చేసుకుంది. ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. 

మేకలపాటి తండాకు చెందిన బానోతు కృష్ణ అదే తండాకు చెందిన భారతి అలియాస్ లాస్య అలియాస్ బుజ్జిని మూడేళ్ల క్రితం పెళ్లి చేసుకున్నాడు. డిగ్రీ వరకు చదువుకున్న కృష్ణ వికలాంగుడు వారు తండాలో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. భారతికి ఆరు నెలల క్రితం ఆడబిడ్డ పుట్టింది. 

కృష్ణ, భారతిలకు వివాహం జరిగిన తర్వాత ఓ మంత్రగాడు తండాకు వచ్చేవాడు. క్షుద్రపూజలు చేస్తూ అతను జోస్యం చెప్పేవాడు. భారతి అతన్ని సంప్రదించింది. సర్పదోషం ఉందని, ఆ దోషం పోవడానికి నాగపూజలు చేయాలని, నీకు పుట్టే బిడ్డను బలి ఇవ్వాలని అతను భారతికి చెప్పాడు. అప్పటి నుంచి ఆమె నాగపూజలు చేస్తూ వస్తోంది. ఆ క్రమంలో ఆరు నెలల క్రితం ఆమె రీతు అనే బిడ్డ పుట్టింది. ఆ తర్వాత రెండు మూడుసార్లు బిడ్డను బలి ఇవ్వడానికి ఆమె ప్రయత్నించినట్లు సమాచారం 

గురువారం మధ్యాహ్నం సూర్యాపేటకు పనిపై వెళ్తూ అత్తామామల వద్దకు వెళ్లాడు. భారతికి మతిస్తిమితం సరిగా లేదని రీతును ఇంటికి తీసుకుని వెళ్లాలని చెప్పాడు. అయితే వారు పట్టించుకోలేదు. దాంతో భారతికి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న సమయం వచ్చింది. రీతును నాగదేవతల చిత్ర పటాల వద్ద గొంతు కోసి చంపింది. 

తనకు నాగసర్ప దోషం పోయిందని భారతి కూతురు గొంతు కోసిన కత్తి చేతపటటుకుని తల్లిగారింటికి కేకలు వేసుకుంటూ వెళ్లింది. దాంతో భారతి తల్లిదండ్రులు ఇంటికి వెళ్లి చశారు రీతు తెల్లని గుడ్డలో రక్తం మడుగులో కనిపించింది. సూర్యాపేటలో పని ముగించుకుని వచ్చిన కృష్ణ బోరున విలపించాడు. 

భారతి మొబైల్ లో యూట్యూబ్ చేస్తుండేదని, నాగపూజలకు సంబంధించిన వీడియోలు ఎక్కువగా చూసేదని చెబుతున్నారు వీడియోలు చూస్తూ నాగపూజలు చేసేదని అంటున్నారు భారతి డిగ్రీతో పాటు బీఈడీ కూడా చేసింది. 

click me!