తెలంగాణ మాజీ మంత్రి, టీఆర్ఎస్ నేత అజ్మీరా చందూలాల్ కన్నుమూశారు. కరోనా వైరస్ వ్యాధితో ఆయన మూడు రోజుల క్రితం కిమ్స్ ఆస్పత్రిలో చేరారు. ఆరోగ్యం విషమించి ఆయన కన్నుమూశారు.
హైదరాబాద్: మాజీ మంత్రి, టీఆర్ఎస్ నేత చందూలాల్ కరోనా వైరస్ తో మరణించారు. ఆయన వయస్సు 67 ఏళ్లు. హైదరాబాదులోని కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందతూ ఆయన గురువారం రాత్రి కన్నుమూశారు. మూడు రోజుల కింద ఆయన కరోనా వైరస్ వ్యాధితో ఆస్పత్రిలో చేరారు.
పరిస్థితి విషమించి ఆయన గురువారం రాత్రి తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య, ముగ్గురు కుమారులు, కూతురు ఉన్నారు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ములుగు మండలం జగ్గన్నపేటలో ఆయన 1954 ఆగస్టు 17వ తేదీన జన్మించారు
సర్పంచుగా ఆయన తన రాజకీయాన్ని ప్రారంభించారు. మూడుసార్లు ఎమ్మెల్యేగా, రెండు సార్లు ఎంపీగా, రాష్ట్ర మంత్రిగా పనిచేశారు. ఉమ్మడి రాష్ట్రంలో ఎన్టీఆర్ హయాంలో, తెలంగాణలో కేసీఆర్ హయాంలో రెండుసార్లు మంత్రిగా పనిచేశారు. 1996, 1998ల్లో ఆయన లోకసభకు పోటీ చేసి గెలిచారు. చందూలాల్ 2005లో ఆయన టీఆర్ఎస్ లో చేరారు. ఆయన టీఆర్ఎస్ పోలిట్ బ్యూరో సభ్యుడిగా ఉన్నారు.
చందూలాల్ మృతిపై ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చందూలాల్ కుటుంబ సభ్యులకు ఆయన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, సత్యవతి రాథోడ్, ఎర్రబెల్లి దయాకర్ రావు, శ్రీనివాస్ గౌడ్ సంతాపం వ్యక్తం చేశారు. శుక్రవారం చందూలాల్ భౌతిక కాయానికి అంత్యక్రియలు జరుగుతాయి.