
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు (telangana assembly election) సమయం దగ్గరపడుతుండటం, ప్రస్తుతం రాష్ట్రంలో పార్టీ బలోపేతం అవుతుండటంతో బీజేపీ (bjp) అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో పార్టీని మరింత పటిష్టం చేసేందుకు గాను పావులు కదుపుతోంది. ఈ నేపథ్యంలో బీజేపీ తెలంగాణ ఇంచార్జీగా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్‌ను (sunil bansal) నియమించింది. ఈ మేరకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా బుధవారం సాయంత్రం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం బీజేపీ ఉత్తరప్రదేశ్ శాఖ ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్న బన్సల్‌కు తాజాగా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పదోన్నతి కల్పించారు. అంతేకాకుండా ఆయనకు తెలంగాణ పార్టీ శాఖ ఇంచార్జీ బాధ్యతలతో పాటుగా పశ్చిమ బెంగాల్, ఒడిశా శాఖల ఇంచార్జీగానూ నియమించారు. ఇప్పటి వరకు తెలంగాణ బీజేపీ వ్యవహారాల ఇన్‌ఛార్జీగా తరుణు చుగ్ వ్యవహరించిన సంగతి తెలిసిందే.