స్వాతంత్య్ర వజ్రోత్సవాలకు సిద్ద‌మైన తెలంగాణ‌.. పక్షం రోజుల పాటు ఘ‌నంగా వేడుక‌లు

By Mahesh RajamoniFirst Published Aug 10, 2022, 5:04 PM IST
Highlights

Independence celebrations: పక్షం రోజుల పాటు జరిగే భారత స్వతంత్ర వజ్రోత్సవాలకు తెలంగాణ సిద్ద‌మైంది. స్వాతంత్య్ర‌ వేడుకలను ఘ‌నంగా నిర్వ‌హించ‌డానికి ప్రజాప్రతినిధులతో పాటు పోలీసు, రెవెన్యూ, స్థానిక సంస్థల అధికారులు ప్రజలను చైతన్యవంతులను చేసి వారి భాగస్వామ్యం ఉండేలా చూడాలని అధికారుల‌తో రాష్ట్ర సీఎస్ అన్నారు.
 

Swatantra Bharata Vajrotsavalu: 'భారత స్వతంత్ర వజ్రోత్సవాల'లో భాగంగా పక్షం రోజుల పాటు జరిగే స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ కార్యక్రమం కింద ర్యాలీలు, సామూహిక గీతాలాపన, క్రీడాపోటీలు నిర్వహించాలని జిల్లా అధికారులను ప్ర‌భుత్వం ఆదేశించింది. స్వాతంత్య్ర‌ వేడుకలను ఘ‌నంగా నిర్వ‌హించ‌డానికి ప్రజాప్రతినిధులతో పాటు పోలీసు, రెవెన్యూ, స్థానిక సంస్థల అధికారులు ప్రజలను చైతన్యవంతులను చేసి వారి భాగస్వామ్యం ఉండేలా చూడాలని అధికారుల‌తో రాష్ట్ర సీఎస్ అన్నారు.

వివ‌రాల్లోకెళ్తే..  'భారత స్వతంత్ర వజ్రోత్సవాల'లో భాగంగా పక్షం రోజుల పాటు జరిగే స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు సంబంధించి రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సోమేశ్ కుమార్ సమావేశం నిర్వ‌హించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో సోమేశ్‌కుమార్ జిల్లా కలెక్టర్లు, కమిషనర్లు/పోలీసు సూపరింటెండెంట్లు, డీఈఓలు, మున్సిపల్ అధికారులతో మాట్లాడి రాబోయే వారాల్లో జరిగే అన్ని కార్యక్రమాలకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా 500కి పైగా థియేటర్లలో ప్రదర్శింపబడిన “గాంధీ” చిత్రాన్ని ఈరోజు 2.2 లక్షల మంది పాఠశాల విద్యార్థులు చూశారని ప్రధాన కార్యదర్శి తెలిపారు. 16న పోలీసు శాఖ, జిల్లా యంత్రాంగం సంయుక్తంగా జాతీయ గీతాలాపనను నిర్వహించనున్నారు. అదేవిధంగా 11వ తేదీ నుంచి 18వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా ప్రతి గ్రామపంచాయతీ, మండలం, మున్సిపాలిటీ, జిల్లాకేంద్రాల్లో ఫ్రీడమ్‌కప్‌ క్రీడాపోటీలు నిర్వహించి యువత, అన్ని వర్గాల ప్రజలు అత్యధికంగా పాల్గొనేలా చర్యలు తీసుకుంటామన్నారు.

ఈ నెల 13న ఎన్‌సిసి, ఎన్‌ఎస్‌ఎస్, స్కౌట్స్ అండ్ గైడ్స్, ఉద్యోగులు, విద్యార్థులచే తగిన విధంగా ర్యాలీలు నిర్వహిస్తామన్నారు. ఫ్రీడమ్ రన్ స్పోర్ట్స్ ఈవెంట్‌లు ఆగస్టు 11న నిర్వహించబడతాయి. అన్ని మండలాలు, పట్టణ స్థానిక సంస్థల నుండి పోలీసు స‌హా ఇతర శాఖల నుండి చురుకైన భాగస్వామ్యం ఉంటుందని తెలిపారు. ప్రజాప్రతినిధులతోపాటు పోలీసు, రెవెన్యూ, స్థానిక సంస్థల అధికారులు ప్రజలను చైతన్యవంతం చేసి వారి భాగస్వామ్యం ఉండేలా చూడాలని ఆదేశించారు. ఈ కార్యక్రమాల్లో అన్ని పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలు, కళాశాలల నుంచి పాల్గొంటారు. 

ఇదిలావుండ‌గా, భారత పురావస్తు శాఖ (ఏఎస్‌ఐ) సిటీ సర్కిల్‌లో 'ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌' వేడుకలు ఘనంగా నిర్వ‌హిస్తోంది. స్వాతంత్య్ర దినోత్సవం రోజున తెలంగాణలోని మూడు స్మారక చిహ్నాలపై జాతీయ జెండాను ఎగురవేస్తారు. వాటిలో హైదరాబాద్‌లోని గోల్కొండ కోట, అలంపూర్‌లోని సంగమేశ్వర ఆలయం, వరంగల్ కోటలు ఉన్నాయి. . స్వాతంత్య్ర సమరయోధులు, పద్మ అవార్డు గ్రహీతలు, ఇతర ప్రముఖులు జెండా ఎగురవేత వేడుకలు, ఇతర కార్యక్రమాలకు హాజరుకానున్నారు. అలాగే,  నాలుగు స్మారక చిహ్నాలు- చార్మినార్, ములుగులోని రామప్ప ఆలయం, హన్మకొండలోని వేయి స్తంభాల గుడి, అలంపూర్‌లోని నవ బ్రహ్మ గ్రూపు దేవాలయాలపై ఇప్ప‌టికే ఏర్పాటు చేసిన లైటింగ్ వెలుగుల్లో త్రివర్ణ కాంతులతో దేదీప్యమానంగా వెలిగిపోతున్నాయి. ఆగస్టు 5 నుండి 15 వరకు, దేశవ్యాప్తంగా అన్ని కేంద్ర రక్షిత స్మారక చిహ్నాలను ఉచితంగా సందర్శించవచ్చు. తెలంగాణలో గోల్కొండ కోట, చార్మినార్‌, వరంగల్‌ కోట, కొండాపూర్‌లోని పురావస్తు మ్యూజియం టిక్కెట్‌ చార్జీలను రద్దు చేశారు.

click me!