
జగిత్యాల జిల్లాలో (jagtial district) మద్యం దుకాణాల (liquor shops) కేటాయింపులో రభస జరిగింది. శనివారం లిక్కర్ షాపులకు తక్కువగా దరఖాస్తులు రావడంతో లక్కీ డ్రాను నిలిపేశారు అధికారులు. దీంతో దరఖాస్తు దారులకు, అధికారులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. సారంగాపూర్ (sarangapur) మండల కేంద్రంలో గెజిట్ నెం. 43లో 6 దరఖాస్తులే వచ్చాయంటూ అధికారులు డ్రా నిలిపేశారు. అయినప్పటికీ లాటరీ పద్ధతి (lucky draw) ద్వారా ఎంపిక చేయాల్సిందేనని ఆరుగురు దరఖాస్తుదారులు అధికారులను డిమాండ్ చేశారు.
ఈ నేపథ్యంలో డ్రా తీయాలంటూ కాసారపు రమేశ్ అనే దరఖాస్తు దారుడు ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకుంటానంటూ (suicide attempt ) వరి పొలాల్లోకి పరుగులు తీశాడు. వెంటనే అప్రమత్తమై పోలీసులు, అధికారులు యువకుని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. అతనికి నచ్చజెప్పి.. ఆత్మహత్యాయత్నం విరమింప జేశారు. ఇప్పటికే రూ.18 లక్షలు పెట్టినా డ్రాలో ఒక్క షాపు కూడా తమకు రాలేదని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. తక్కువ టెండర్లు వచ్చాయనే కారణంగా అధికారులు డ్రా ఆపేసారని.. ఎక్కువ టెండర్లు వస్తే అందులో నుంచి మాకు డబ్బులేమైనా ఇస్తారా అంటూ నిలదీశాడు.
కాగా.. డిసెంబర్ 1, 2021 నుంచి రెండేళ్ల కాలపరిమితికి మద్యం దుకాణాల టెండర్లకు సంబంధించి తెలంగాణ సర్కార్ నవంబర్ 9న నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి అందరికి తెలిసిందే. గతంలో కంటే ఈ సారి 400 మద్యం షాపులు పెరిగాయి. ఈ నెల 18వరకు మద్యం దుకాణలకు సంబంధించిన దరఖాస్తుల స్వీకరిస్తారు. 20న లాటరీ ద్వారా మద్యం దుకాణాల కేటాయింపు ఉంటుంది. డిసెంబర్ 1 నుంచి లాటరీలో మద్యం దుకాణలు దక్కించుకున్నవారు వాటిని నిర్వహిస్తారు.