ఇంటర్‌బోర్డు చెలగాటం: విద్యార్ధుల ఆత్మహత్యలతో ‘‘తెలంగాణ తల్లి’’ గుండెకోత

By Siva KodatiFirst Published Apr 20, 2019, 4:37 PM IST
Highlights

తెలంగాణ ఇంటర్ బోర్డు నిర్లక్ష్యం కారణంగా విద్యార్థులు తమ నిండు ప్రాణాలను బలి తీసుకుంటున్నారు. గురువారం ప్రకటించిన ఇంటర్ ఫలితాల్లో పరీక్షలు తప్పామనే మనస్తాపంతో పలువురు విద్యార్ధులు బలవన్మరణానికి పాల్పడగా.. ఎంతోమంది విద్యార్ధులు ఆత్మహత్యాయత్నం చేశారు.

తెలంగాణ ఇంటర్ బోర్డు నిర్లక్ష్యం కారణంగా విద్యార్థులు తమ నిండు ప్రాణాలను బలి తీసుకుంటున్నారు. గురువారం ప్రకటించిన ఇంటర్ ఫలితాల్లో పరీక్షలు తప్పామనే మనస్తాపంతో పలువురు విద్యార్ధులు బలవన్మరణానికి పాల్పడగా.. ఎంతోమంది విద్యార్ధులు ఆత్మహత్యాయత్నం చేశారు.

నాగర్ కర్నూలు జిల్లా బిజినేపల్లి మండలం శాయిన్‌పల్లికి చెందిన పూర్ణిమ మొదటి సంవత్సరంలో రెండు సబ్జెక్టుల్లో ఫెయిల్ అయింది. ఫలితాలను చూసుకున్న వెంటనే మనస్తాపంతో ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది.

దీనిని గమనించిన చుట్టుపక్కలవారు మంటలను ఆర్పి వేసి ఆమెను 108లో ఆస్పత్రికి తరలించేలోపు మరణించింది. పరీక్షల్లో ఫెయిల్ అయినందున మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నట్లు ఆమె రాసిన సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

సికింద్రాబాద్ వెస్ట్ మారేడ్ పల్లికి చెందిన కావెటి లాస్య నల్లకుంటలోని శ్రీచైతన్య కళాశాలలో ఇంటర్ సెకండియర్ చదువుతోంది. పరీక్షల ఫలితాల్లో ఆమె గణితంలో ఫెయిల్ అయ్యింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆమెకు తల్లిదండ్రులు, స్నేహితులు ధైర్యం చెప్పినప్పటికీ బెడ్‌రూంలోకి వెళ్లి ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

వరంగల్ జిల్లా ఖాజీపేటకు చెందిన భానుకిరణ్ ఒక సబ్జెక్టులో ఫెయిల్ కావడంతో శుక్రవారం స్థానిక దర్గా రైలు గేట్ వద్దకు వెళ్లి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం ఏఆర్‌పీ క్యాంప్ గ్రామానికి చెందిన తోట వెన్నెల బోధన్‌లోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది.

గురువారం ఫలితాలు విడుదల కావడంతో మార్కులు చూసుకోవడానికి వెళ్లింది. అయితే రెండు సబ్జెక్టుల్లో తప్పడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆమె ఎలుకల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించింది.

దీనిని ఆలస్యంగా గమనించిన కుటుంబసభ్యులు అదే రోజు రాత్రి బోధన్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో నిజామాబాద్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలోనే ప్రాణాలు విడిచింది.

ఇదే జిల్లాలోని రామారెడ్డికి చెందిన రుచిత అనే విద్యార్ధిని స్థానిక ప్రభుత్వం జూనియర్ కళాశాలలో ఇంటర్ సీఈసీ రెండో సంవత్సరం చదువుతోంది. తాజా ఫలితాల్లో రెండు సబ్జెక్టుల్లో ఫెయిలవ్వడంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో తన చున్నీతో ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది.

మృతురాలు మొదటి సంవత్సరంలో మంచి మార్కులు సాధించిందని బాలిక తండ్రి తెలిపారు. మరోవైపు వనపర్తి జిల్లా కాశీంనగర్‌కు చెందిన మహేశ్వరి అనే విద్యార్ధిని పరీక్షల్లో ఫెయిల్ అయ్యాననే మనస్తాపంతో ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది.

అయితే వెంటనే స్పందించిన ఆమె కుటుంబసభ్యులు హైదరాబాద్‌కు తరలించారు. కానీ ఆమె పరిస్ధితి ప్రస్తుతం విషమంగా ఉంది. దత్తాయిపల్లి గ్రామానికి చెందిన ఓ విద్యార్ధిని ఇంటర్‌లో పాస్ కాలేదనే మనస్తాపంతో పురుగుల మందు తాగింది.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వినాయకపురానికి చెందిన ప్రత్యూష తనకు 500 మార్కులకు గాను 245 మార్కులే వచ్చాయనే దిగులుతో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. 
 

మాస్ హిస్టీరియాతోనే విద్యార్థుల ఆత్మహత్యలు: అశోక్ వితండవాదం

దిద్దకుండానే మార్కులు వేస్తారా: ఇంటర్ బోర్డుపై పేరేంట్స్ ఫైర్

జిల్లా ఫస్ట్, ఫస్టియర్‌లో 98 మార్కులు: సెకండియర్‌లో జీరో

click me!