బస్సులోనే సీఎం కేసీఆర్ భోజనం.. వడ్డించిన మంత్రి ఎర్రబెల్లి.. సీఎం ఏం తిన్నారంటే..?

By Sumanth KanukulaFirst Published Mar 23, 2023, 8:41 PM IST
Highlights

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటలను ఈరోజు పరిశీలించారు. ఈ క్రమంలోనే ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది.  బిజీ షెడ్యూల్ కారణంగా సీఎం కేసీఆర్ బస్సులోనే మధ్యాహ్న భోజనం చేశారు.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటలను ఈరోజు పరిశీలించారు. ఈ క్రమంలోనే ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. హైదరాబాద్‌ నుంచి ఖమ్మం చేరుకున్న కేసీఆర్.. అక్కడ పంట నష్టాన్ని పరిశీలించారు.  మహబూబాబాద్ చేరుకున్న సీఎం కేసీఆర్.. బిజీ షెడ్యూల్ కారణంగా బస్సులోనే మధ్యాహ్న భోజనం చేశారు. మహబూబాబాద్‌ జిల్లా, పెద్దవంగర మండలం, రెడ్డికుంట తండా పర్యటన ముగియగానే సీఎం కేసీఆర్‌ బస్సులో హెలిప్యాడ్‌ వద్దకు చేరుకున్నారు. అక్కడే బస్సును కాసేపు భోజనం చేశారు. కేసీఆర్‌తో పాటు.. మంత్రులు, ఉన్నతాధికారులు కూడా బస్సులోనే భోజనం చేశారు. అయితే సమయం వృథా కాకూడదనే ఉద్దేశంతోనే కేసీఆర్ ఈ విధంగా బస్సులో భోజనం చేసినట్టుగా తెలుస్తోంది. 

సీఎం కేసీఆర్‌తో పాటు బస్సులోని మంత్రులకు మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు కొసరి కొసరి వడ్డించారు. మంత్రి ఎర్రబెల్లి.. మంత్రులతో పాటు సీఎస్ శాంతి కుమారి, సీఎంవో అధికారి సబర్వాల్‌కు పులిహోరను వడ్డించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. సీఎం కేసీఆర్.. ముందు సీట్‌లో కూర్చొని పులిహోర, పెరగన్నం, అరటి పండు తిన్నారు. 

ఇదిలా ఉంటే.. అకాల వర్షాలతో రాష్ట్రంలో 2.28 లక్షల  ఎకరాల్లో పంట నష్టపోయిందని సీఎం కేసీఆర్ అన్నారు. పంటనష్టపోయిన  రైతులకు  వెంటనే ఆర్ధిక సహాయం అందించనున్నట్టుగా సీఎం తెలిపారు. ఈ మేరకు  జీవో కూడా  జారీ చేశామన్నారు. ఎకరానికి  రూ. 10 వేల చొప్పున పరిహారం అందిస్తున్నామని సీఎం వివరించారు.  పంట నష్టపరిహరం విషయంలో కౌలు రైతులకు  కూడా  న్యాయం చేస్తామన్నారు.  అకాల వర్షాల కారణంగా వందకు వంద శాతం రైతులు పంట నష్టపోయారని సీఎం చెప్పారు. 

రైతులు నిరాశకు  గురికావద్దని  పరిహరం ఇస్తున్నామని కేసీఆర్ చెప్పారు.వ్యవసాయంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న స్థితి ముందుకు వెళ్లాలనే ఉద్దేశ్యంతో  తమ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని కేసీఆర్ వివరించారు. రైతుల్లో భరోసా నింపేందుకు తాను క్షేత్రస్థాయిలో పర్యటించానని చెప్పారు..  గతంలో ఏనాడూ  ఈ రకంగా  పంట నష్టం జరగలేదని అన్నారు. రాష్ట్రంలో  ప్రస్తుతం 84 లక్షల ఎకరాల్లో  వరి సాగు అవుతుందని  సీఎం చెప్పారు. కేంద్రానికి రైతు గోస పట్టదని విమర్శించారు. అందుకే  రైతులను రాష్ట్ర ప్రభుత్వమే ఆదుకుంటుందని తెలిపారు. 

click me!