
హైదరాబాద్ నగరం, సైబరాబాద్ నగరం తెలంగాణ రాష్ట్రానికి రెండు కళ్ల లాంటివి. ఈ ప్రాంతాల్లో ఏ చిన్న సంఘటన జరిగినా తెలంగాణ రాష్ట్ర ప్రతిష్ట మసక బారే ప్రమాదముంటుంది. అందుకే ఇక్కడ ఏ చిన్నసమస్య కూడా రాకుండా అనుక్షణం అప్రమత్తంగా ఉంటారు. గత రెండు రోజుల క్రితం హైదరాబాద్ నగర పరిధిలో ఒక పబ్ పై మెరుపు దాడి నిర్వహించి డ్రగ్స్ తీసుకుంటున్న పలువురి వ్యక్తులను అదుపులోకి తీసుకొని కొన్ని మత్తు పదార్థాలను కూడా స్వాధీనం చేసుకున్న విషయం అందరికి తెలుసు. హైదరాబాద్ నగరంతో పోలిస్తే సైబరాబాద్ పరిధిలోనే ఎక్కువ స్పోర్ట్స్ బార్లు, వెస్టర్న్ కల్చర్ ను ప్రోత్సహించే ఆల్కహాల్ సంబంధిత పబ్ లు ఉంటాయి. ఇక్కడే ఎక్కువగా నైట్ లైఫ్ కు అలవాటు పడ్డ యువత ఐటి సంబంధిత కార్యాలయాల్లో పని చేస్తూ వీకెండ్ పార్టీ లకు వెళ్తూ ఉంటారు. వాటిలో భాగంగానే మత్తు పదార్థాలకు కూడా అలవాటు పడుతూ ఉంటారు. ఇలాంటి వాటిపై మనం మెరుపు దాడులు నిర్వహించి వాళ్లపై విరుచుకపడ్డా నగరంపై ఆధారపడ్డ ఐటి పరిశ్రమ దెబ్బ తినే ఆస్కారం ఉంటుంది. నగరంలోని ఐటి కార్యాలయాల్లో పని చేసే ఇతర దేశాల వారు, ఇతర రాష్ట్రాల వారికి ఒక రకమైన భయం ఏర్పడకుండా, ఐటి కారిడార్లో భాగమైన నైట్ లైఫ్ కు ఏ మాత్రం ఇబ్బంది పెట్టకుండా ఒక క్రమ పద్దతిలో ఇలాంటి చట్ట వ్యతిరేక డ్రగ్స్ కార్యకలాపాలను అంతమొందించాలి. ఇలా చేయటం కత్తి మీద సాము లాంటిది. ఒక విధంగా ప్రభుత్వానికి సైతం సవాలే అని చెప్పాలి. అటు ఐటి కార్యాలయాల్లో కానీ, ఉద్యోగుల వ్యక్తిగత జీవితాలను ఇబ్బంది పెట్టకుండా ముందుకు వెళ్ళాలి.
దీని కోసమే సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర వినూత్న పద్దతిని అవలంభిస్తున్నారు. ఏ మాత్రం పబ్ లలో డ్రగ్స్ కు అవకాశం లేకుండా నిరంతరం నిఘా పెట్టి ఏదైనా అనుమానం వస్తే ఆ పబ్ లేదా బార్ నిర్వాహకులను అదుపులోకి తీసుకుంటున్నారు. అలాగే ప్రతీ పబ్ కు, లేదా ఆల్కహాల్ సంబంధిత బార్లకు అక్కడ ఏ చిన్నగా డ్రగ్స్ సరఫరా అవుతున్నట్లు అనుమానం వచ్చిన తమకు సమాచారం అందేలా ఏర్పాట్లు చేసుకున్నారు. అంతే కాకుండా అక్కడ డ్రగ్స్ నిరోధక కమిటీలు ఏర్పాటు చేసి ఆ పబ్ లో లేదా బార్ లో పని చేసే వ్యక్తులను భాగస్వామ్యం చేస్తున్నారు. దీని ద్వారా పోలీసులకు డ్రగ్స్ ను ఎవరైనా వినియోగించినా, సరఫరా చేసినా దాని సంబంధిత సమాచారం తేలిగ్గా అందుతుంది. అంతేకాకుండా డ్రగ్స్ మహమ్మారి పునాదులని పెకిలించివేసేలా విద్యాసంస్థల్లో డ్రగ్స్ నిరోధక కమిటీలు వేస్తూ విద్యార్థులకు డ్రగ్స్ అనర్థాలను వివరిస్తున్నారు. దీనివల్ల అటు విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు కూడా అప్రమత్తంగా ఉండేలా చేస్తున్నారు. ఈ డ్రగ్స్ నిరోధక కమిటీలలో విద్ర్యార్థుల తల్లిందండ్రులు కూడా భాగస్వామ్యం అవటం విశేషం. ఇలాంటి కమిటీలను ప్రోత్సహించటానికి నిరంతరం దీని మీద పనిచేసేలా సిపి స్టీఫెన్ రవీంద్ర సైబరాబాద్ పోలీసులను సమాయత్తం చేస్తున్నారు. ఇంతకుముందు కూడా పలు చోట్ల అధికారిగా పని చేసిన స్టీఫెన్ రవీంద్ర ఇలానే తన మార్కును చూపించుకున్నాడు.
హైదరాబాద్ నగరంలో పబ్ లలో బార్లలో మెరుపు దాడులు రాష్ట్రంపై ఇంకోలా తీవ్ర ప్రభావితం చూపిస్తాయనటంలో సందేహం లేదు. నగరం అభివృద్ధి పథంగా ఇతర దేశాల వారు, రాష్ట్రాల వారు నగరానికి రావటానికి ఇష్టపడుతున్నారంటే దానిలో నగరంలోని ఇక్కడి ఫ్రీ లైఫ్ కూడా భాగమే. అలా అని చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు నగరం నెలవు కాకూడదు. అందుకే హైదరాబాద్ లో నగరంలో చేసిన మెరుపు దాడులు కాకుండా ఆలోచనాత్మకంగా, ముందుచూపుతో డ్రగ్స్ భూతం మొదళ్ళనే తుంచివేయాలనే ఉద్దేశ్యంతో సైబరాబాద్ పోలీసులు ముందుకు వెళ్తున్నారు. అంతకుముందు సైబరాబాద్ పోలీస్ విభాగం వ్యక్తిగత పబ్లిసిటీ తో ముందుకు వెళ్లినా ఇప్పుడు వ్యవస్థ కోణంలో పనిచేసి దాని ఫలితాలనే ఫలాలు భవిష్యత్ సైబరాబాద్ అనే కోణంలో వెళ్తుండటం మంచి పరిణామం.