రాష్ట్ర గీతంగా జయజయహే తెలంగాణ... పూర్తి పాట, రాసింది ఎవరంటే..

By SumaBala Bukka  |  First Published Feb 5, 2024, 9:01 AM IST

"నాది కవి గానం కాదు, కాలజ్ఞానం" అంటూ ప్రముఖ కవి అందెశ్రీ రాసిన పాటే నేటి తెలంగాణ రాష్ట్ర గీతం ‘జయ జయహే తెలంగాణ జననీ జయ కేతనం’. 


హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం జరిగిన కేబినేట్ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర గీతంగా ‘జయ జయహే తెలంగాణ’ పాటని ప్రకటించారు. ఈ పాటను రాసింది ప్రసిద్ధ కవి అందెశ్రీ. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు కాకముందే ఈ పాటను ఆయన రచించారు. 

జయ జయహే తెలంగాణ... జననీ జయకేతనం
ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం

Latest Videos

తరతరాల చరితగల తల్లీ నీరాజనం
పది జిల్లల నీ పిల్లలు ప్రణమిల్లిన శుభ తరుణం
జై తెలంగాణ! జై జై తెలంగాణ!! జై తెలంగాణ! జైజై తెలంగాణ!!

పంపనకు జన్మనిచ్చి బద్దెనకు పద్యమిచ్చి
భీమకవికి చనుబాల బీజాక్షరమైన తల్లి
హాలుని గాథాసప్తశతికి ఆయువులూదిన నేల
బహత్ కథల తెలంగాణ కోటిలింగాల కోణ
జై తెలంగాణ! జై జై తెలంగాణ!! జై తెలంగాణ! జైజై తెలంగాణ!

ప్రజల భాషలో కావ్య ప్రమాణాలు ప్రకటించిన
తెలుగులో తొలి ప్రజాకవి పాల్కురికి సోమన
రాజ్యాన్నే ధిక్కరించి రాములోరి గుడిని గట్టి
కవిరాజై వెలిగె దిశల కంచర్ల గోపన్న
జై తెలంగాణ! జై జై తెలంగాణ!! జై తెలంగాణ! జైజై తెలంగాణ!

కాళిదాస కావ్యాలకు భాష్యాలను రాసినట్టి
మల్లినాథసూరి మా మెతుకుసీమ కన్నబిడ్డ
ధూళికట్ట నేలినట్టి బౌద్ధానికి బంధువతడు
ధిజ్ఞాగుని కన్న నేల ధిక్కారమె జన్మహక్కు
జై తెలంగాణ! జై జై తెలంగాణ!! జై తెలంగాణ! జైజై తెలంగాణ!

పోతనదీ పురిటిగడ్డ.. రుద్రమదీ వీరగడ్డ
గండర గండడు కొమురం భీముడే నీ బిడ్డ
కాకతీయ కళాప్రభల కాంతిరేఖ రామప్ప
గోలుకొండ నవాబుల గొప్ప వెలుగు చార్మినారు
జై తెలంగాణ! జై జై తెలంగాణ!! జై తెలంగాణ! జైజై తెలంగాణ!

జానపదా జనజీవన జావళీలు జాలువార
జాతిని జాగృత పరచే గీతాల జనజాతర
వేలకొలదిగా వీరులు నేల ఒరిగి పోతేనేమి
తరగనిదీ నీ త్యాగం మరువనిదీ శ్రమయాగం
జై తెలంగాణ! జై జై తెలంగాణ!! జై తెలంగాణ! జైజై తెలంగాణ!

రాచకొండ ఏలుబడిగ రంజిల్లిన రేచర్ల
సర్వజ్ఞ సింగభూపాలుని బంగరు భూమి
వాణీ నా రాణీ అంటు నినదించిన కవికుల రవి
పిల్లలమఱ్ణి పినవీరభద్రుడు మాలో రుద్రుడు
జై తెలంగాణ! జై జై తెలంగాణ!! జై తెలంగాణ! జైజై తెలంగాణ!

సమ్మక్కలు సారక్కలు సర్వాయిపాపన్నలు
సబ్బండ వర్ణాల సాహసాలు కొనియాడుతు
ఊరూర పాటలైన మీరసాబు వీరగాథ
దండు నడిపే పాలమూరు పండుగోల్ల సాయన్న
జై తెలంగాణ! జై జై తెలంగాణ!! జై తెలంగాణ! జైజై తెలంగాణ!

కవిగాయక వైతాళిక కళలా మంజీరాలు
డప్పూ ఢమరుకము, డక్కి, శారద స్వరనాదాలు
పల్లవులా చిరుజల్లుల ప్రతి ఉల్లము రంజిల్లగ
అనునిత్యము నీ గానం అమ్మ నీవే మా ప్రాణం
జై తెలంగాణ! జై జై తెలంగాణ!! జై తెలంగాణ! జైజై తెలంగాణ!

బడుల గుడులతో పల్లెల ఒడలు పులకరించాలి
విరిసే జనవిజ్ఞానం నీ కీర్తిని పెంచాలి
తడబడకుండా జగాన తల ఎత్తుకొని బ్రతుక
ఒక జాతిగ నీ సంతతి ఓయమ్మా వెలగాలి
జై తెలంగాణ! జై జై తెలంగాణ!! జై తెలంగాణ! జైజై తెలంగాణ!

సిరి వెలుగులు విరజిమ్మే సింగరేణి బంగారం
అణువణువున ఖనిజాలే నీ తనువున సింగారం
సహజమైన వనసంపద సక్కనైన పువ్వులపొద
సిరులు పండె సారమున్న మాగాణమె కదా! నీ యెద
జై తెలంగాణ! జై జై తెలంగాణ!! జై తెలంగాణ! జైజై తెలంగాణ!

గోదావరి క్రిష్ణమ్మలు మా బీళ్లకు తరలాలి.. 
పచ్చని మా నేలల్లో పసిడిసిరులు పండంగా
సుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగా వుండాలి
సకల జనుల తెలంగాణ స్వర్ణయుగం కావాలి
జై తెలంగాణ! జై జై తెలంగాణ!! జై తెలంగాణ! జైజై తెలంగాణ!

https://telugu.asianetnews.com/telangana/cm-revanth-reddy-govt-key-decision-for-changing-ts-to-tg-on-vehicle-number-plates-ksp-s8cacy

‘నాది కవిగానం కాదు, కాలజ్ఞానం’ అంటారు అందెశ్రీ.. ఆయన చదువుకోలేదు. జనగామ జిల్లా, రేవర్తికి చెందిన అందెశ్రీ నిరుపేద కుటుంబంలో పుట్టారు. అనాథ. పశువుల కాపరి. తాపీమేస్త్రీగా పనిచేశారు. 21 సంవత్సరాలపాటు అదే పని. అయితేనేం.. కవిత్వం ఆయనకు సహజంగా అబ్బింది. రాయడం నేర్చుకున్నాడు.. విద్యావంతుడయ్యాడు. ఏ డిగ్రీ లేదు కానీ అనేక యూనివర్సిటీల నుంచి డాక్టరేట్లను అందుకున్నాడు. నదులమీద కవిత్వం రాస్తూ ప్రపంచవ్యాప్త పర్యటన చేశారు. మిసిసిపి, మిజోరి, అమేజాన్, నైలు వంటి మహానదుల వెంట ప్రయాణిస్తూ.. నదుల మీద పెద్ద కావ్యాన్ని రాసే పనిలో ఉన్నారు. ఇటీవల ‘నిప్పుల వాగు’ అనే పేరుతో వెయ్యేళ్ల తెలంగాణ పాటను గ్రంథస్తం చేశారు. 

జయజయహే తెలంగాణ.. పాట ఎలా రాశారో చెబుతూ.. తెలంగాణ సాధన సమయంలో 2003, 2 మార్చిలో కామారెడ్డిలో జరిగిన తెలంగాణ ధూం ధాం కార్యక్రమంలో.. మనకంటూ ఒక గీతం ఉండకూడదా అనిపించిందట. ఆ సమయంలోనే  తనకు ఈ పాట తట్టిందట.  ఆ ఆలోచన వచ్చిన కొద్దికాలంలోనే నాలుగు చరణాలు రాశారు. ముందు నాలుగు చరణాలే. వీటిని ఆ తరువాత 2003, నవంబర్ 11న ఆదిలాబాద్‌లో జరిగిన తెలంగాణ రచయితల వేదిక జెండా వందనానికి పాడారు.

అది విన్న అందరిలోనూ ఓ తెలియని మైమరుపు.. అలా ఆ పాట అప్పటినుంచి ఇప్పటి వరకూ ఆ గీతాన్ని పాడుతూనే ఉన్నడు. రాస్తూనే ఉన్నడు. మొత్తం 12 చరణాలు. 
నిజానికి ఈ పాట తెలంగాణ ప్రకటన వచ్చిన 9 డిసెంబర్ 2009 తర్వాత కోటానుకోట్ల ప్రజల దగ్గరకు చేరింది. కానీ, అంతకు ముందే అది ముఖ్యసభల్లో కవులు, కళాకారులు, మేధావులు, కార్యకర్తల వద్దకు చేరిపోయింది. 

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత ఈ పాటను రాష్ట్ర గీతంగా ప్రకటిస్తాం అన్నారు. కానీ ఎందుకో అది జరగలేదు. ఇప్పుడు ఇది సాకారం కాబోతోంది. 

ఈ పాటను ఇక్కడ వినొచ్చు.. 

 

click me!