
Telangana SSC Public Exams: పదో తరగతి పబ్లిక్ ఎగ్జామ్స్ పై తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పదో తరగతి పబ్లిక్ పరీక్షలు-2023లో ఈ విద్యా సంవత్సరానికి కూడా ఆరు పేపర్లు మాత్రమే ఉండనున్నాయి. దీనికి సంబంధించి సంబంధిత శాఖలు పంపిన ప్రతిపాదనలకు ప్రభుత్వం ఒకే చెప్పింది.
వివరాల్లోకెళ్తే.. 2022-23 విద్యా సంవత్సరంలో పదో తరగతి (ఎస్ఎస్ సీ) పబ్లిక్ పరీక్షలలో పేపర్ల సంఖ్యను 11 నుండి 6 కి తగ్గించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. విద్యాశాఖ ప్రతిపాదనలకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని గురువారం నాడు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. 2020 లో కరోనా వైరస్ వ్యాప్తి విద్యారంగంపై తీవ్ర ప్రభావం చూపింది. ఈ క్రమంలోనే ప్రభుత్వం పలు మార్పులు తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. గత రెండు విద్యా సంవత్సరాల్లో కోవిడ్-19 మహమ్మారి కారణంగా ప్రభుత్వం SSC పబ్లిక్ పరీక్షలలో పేపర్ల సంఖ్యను ఆరుకు తగ్గించింది. 2020-21 విద్యా సంవత్సరంలో, పేపర్లు తగ్గించబడినప్పటికీ, మహమ్మారి కారణంగా అన్ని పరీక్షలు నిర్వహించబడలేదు.
ఇక పది పరీక్షలు రాసేందుకు నమోదు చేసుకున్న విద్యార్థులందరూ ఉత్తీర్ణులయ్యారని ప్రభుత్వం వెల్లడించింది. అలాగే, వారి అంతర్గత మూల్యాంకన మార్కులను పరిగణనలోకి తీసుకుని వారికి గ్రేడ్‌లు కేటాయిస్తామని చెప్పింది. దానికి అనుగుణంగానే విద్యార్థులకు పాస్ సర్టిఫికేట్లను జారీ చేసింది. ఇక 2021-22 విద్యా సంవత్సరంలో, పదవ తరగతి పరీక్షలు ఆరు పేపర్లకు నిర్వహించబడ్డాయి. ఫలితాలు కూడా ప్రకటించబడ్డాయి. ఇప్పుడు దానిని ప్రస్తుత విద్యా సంవత్సరానికి పొడిగించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. "ప్రభుత్వం SSC పబ్లిక్ ఎగ్జామ్స్ 2023లో పేపర్ల సంఖ్యను ఆరుకు తగ్గించింది. అయితే, పది పరీక్షలకు 100 శాతం సిలబస్ కవర్ చేయబడుతుంది" అని ఒక సీనియర్ అధికారి ధృవీకరించారు.
విద్యారంగ బలోపేతానికి చర్యలు..
తెలంగాణ ప్రభుత్వం విద్యారంగాన్ని బలోపేతం చేయడానికి, నాణ్యమైన విద్యాను అందించడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నని విద్యాశాఖ పేర్కొంది. ప్రభుత్వ విద్యా సంస్థలను బలోపేతం చేయడానికి ప్రభుత్వం మెరుగైన ప్రణాళికలతో ముందుకుసాగుతున్నదని తెలిపింది. ఇప్పటికే రాష్ట్రంలో ఏర్పాటు చేసిన, కొత్తగా ఏర్పాటు చేయబోయే ప్రభుత్వ విద్యాసంస్థల గురించి ప్రస్తావిస్తూ.. ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణ విడిపోయి, కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత, రాష్ట్ర ప్రభుత్వం విద్యా రంగాన్ని బలోపేతం చేయడానికి ఒక లక్ష్యం పెట్టిందని మంత్రిత్వ శాఖ తెలిపింది.
కాగా, మోడల్ స్కూళ్లు, జూనియర్, డిగ్రీ కాలేజీలను కొత్తగా ఏర్పాటు చేసి.. నాణ్యమైన విద్యాను అందిస్తోంది. ప్రభుత్వం విద్యార్థులకు ఉచితంగా పుస్తకాలు, స్టడీ మెటీరియల్స్ అందజేసి ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో మెరుగైన సౌకర్యాలు కల్పిస్తోంది. తెలంగాణ ప్రభుత్వం ప్రస్తుతం 1 నుంచి 10వ తరగతి వరకు, ఇంటర్మీడియట్, డిగ్రీ కళాశాలల కోసం ఇంగ్లీష్, ఉర్దూ, తెలుగు మాధ్యమంలో 188 కి పైగా రెసిడెన్షియల్ విద్యాసంస్థలను నిర్వహిస్తోంది. ప్రభుత్వం విద్యార్థులకు ఉచిత విద్యతో పాటు యూనిఫారాలు, పుస్తకాలు, మధ్యాహ్న భోజనాన్ని కూడా ఉచితంగా అందజేస్తోంది. అంతేకాదు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల కోసం ప్రభుత్వం అత్యుత్తమ కంప్యూటర్, సైన్స్ లేబొరేటరీ సౌకర్యాలను కల్పిస్తోందని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.