శ్రీశైలం, నాగార్జున సాగర్‌కు కొనసాగుతున్న వరద ... సాగర్ ఎడమ కాల్వకు నీటి విడుదల

By Siva KodatiFirst Published Aug 1, 2021, 4:09 PM IST
Highlights

శ్రీశైలం, నాగార్జున సాగర్ జలాశయాలకు వరద పోటెత్తుండటంతో రెండు ప్రధాన రిజర్వాయర్లు నిండుకుండను తలపిస్తున్నాయి. సాగర్‌కు వరద కొనసాగుతుండటంతో ఎడమ కాల్వకు నీటిని విడుదల చేశారు. వానాకాలం సాగు కోసం ఎడమ కాల్వకు నీటిని విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు.

ఎగువ నుంచి వరద ప్రవాహం కొనసాగుతుండటంతో శ్రీశైలం జలాశయం 10 గేట్లు 20 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం జలాశయం ఇన్‌ఫ్లో 5,04,086 క్యూసెక్కులుగా ఉండగా.. ఔట్‌ఫ్లో 5,30,175 క్యూసెక్కులుగా ఉంది. శ్రీశైలం జలాశయం పూర్తి నీటి మట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుతం 883.50 అడుగులకు వరద చేరింది. శ్రీశైలం జలాశయం పూర్తి నీటి నిల్వ 215.80 టీఎంసీలు కాగా.. జలాశయంలో 207.41 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ఎగువ నుంచి జలాశయానికి వరద వస్తుండటంతో కుడి, ఎడమ జల విద్యుత్‌ కేంద్రాల్లో అధికారులు విద్యుత్‌ ఉత్పత్తి చేస్తున్నారు.  

అటు నాగార్జున సాగర్‌ జలాశయం ఇన్‌ఫ్లో 4,14,526 క్యూసెక్కులు ఉండగా.. 36,572 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. సాగర్‌ జలాశయంలో ప్రస్తుతం 579.20 అడుగులు మేర నీరు చేరింది. జలాశయంలో గరిష్ఠ నీటి నిల్వ 312.04 టీఎంసీలుగా ఉండగా.. ప్రస్తుతం 280.69 టీఎంసీల నిల్వ ఉంది. సాగర్‌కు వరద కొనసాగుతుండటంతో ఎడమ కాల్వకు నీటిని విడుదల చేశారు. వానాకాలం సాగు కోసం ఎడమ కాల్వకు నీటిని విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు. ఎంపీ లింగయ్య, ఎమ్మెల్యే నోముల భగత్‌ ఎడమ కాల్వకు గేట్లు ఎత్తి 500 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. గంట గంటకు జలాశయంలోకి వరద ఉద్ధృతి పెరుగతున్నందున సాగర్‌ గేట్లు తెరిచేందుకు అధికారులు సన్నద్ధం అవుతున్నారు.  

ఎగువన ఉన్న శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాల నుంచి దిగువకు నీటిని విడుదల చేయడంతో విజయవాడ ప్రకాశం బ్యారేజ్‌కి 35,526 క్యూసెక్కుల వరద నీరు చేరుతోంది. బ్యారేజ్‌ 36 గేట్లు అడుగు మేర ఎత్తి 26,892 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. వాటిలో 8,634 క్యూసెక్కుల నీటిని బ్యారేజ్‌ నుంచి కాలువలకు వదులుతున్నారు.  

click me!