Sonia Gandhi: ఖమ్మం నుంచి లోక్ సభ బరిలో సోనియా గాంధీ.. సౌత్ మిషన్‌లో భాగమేనా?

By Mahesh K  |  First Published Jan 5, 2024, 2:28 PM IST

కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ తెలంగాణ నుంచి లోక్ సభ ఎన్నికల బరిలో నిలబడనున్నట్టు తెలిసింది. ఖమ్మం నుంచి ఆమె పార్లమెంటుకు పోటీ చేయనున్నట్టు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. 
 


Khammam: కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు, అగ్రనేత సోనియా గాంధీ తెలంగాణ నుంచి లోక్ సభ బరిలో నిలవబోతున్నారు. తెలంగాణ కాంగ్రెస్ ఆమెను ఈ రాష్ట్రం నుంచి లోక్ సభ ఎన్నికలకు పోటీ చేయాలని ఇది వరకే తీర్మానం చేసిన సంగతి తెలిసిందే. ఈ తీర్మానానికి సోనియా గాంధీ సూత్రప్రాయంగా అంగీకారం తెలిపినట్టు సమాచారం. టీ కాంగ్రెస్ మరోసారి తీర్మానం చేయగా.. సోనియా గాంధీ సమ్మతం తెలిపినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. ఖమ్మం జిల్లా నుంచి పోటీ చేయడానికి సుముఖత వ్యక్తం చేసినట్టు వివరించాయి. 

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ హవా కొనసాగింది. ఖమ్మం జిల్లాలోని 10 అసెంబ్లీ సెగ్మెంట్‌లలో ఎనిమిది స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులే గెలిచారు. ఈ జిల్లాలో కాంగ్రెస్ బలంగా ఉండటమే కాదు.. బలమైన కాంగ్రెస్ నాయకులూ ఉన్నారు. ఈ జిల్లా నుంచే రేవంత్ రెడ్డి క్యాబినెట్‌లో ముగ్గురు ఉన్నారు. డిప్యూటీ సీఎంగా మల్లు భట్టివిక్రమార్క, మంత్రులుగా తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలు ఉన్నారు.

Latest Videos

undefined

కాంగ్రెస్ బలంగా ఉన్న ఖమ్మం నుంచి సోనియా గాంధీ గెలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఖమ్మం నుంచి క్యాబినెట్‌లోకి చేరిన మంత్రులూ ఈ బాధ్యతను వ్యక్తిగతంగా భుజాలకు ఎత్తుకునే అవకాశం ఉన్నది.

Also Read: Mudragada: కాపు నేత ముద్రగడకు వైసీపీ షాక్? ఊరించి ఉసూరుమనిపించిందా?

తెలంగాణ నుంచి సోనియా గాంధీ పోటీ చేస్తే దక్షిణ భారతంలో కాంగ్రెస్ పార్టీకి సానుకూల వాతావరణం ఏర్పడుతుందని కాంగ్రెస్ భావిస్తున్నది. ఇది వరకే రాహుల్ గాంధీ కేరళలోని వయానాడ్ నుంచి పోటీ చేసి ఎంపీగా ఉన్నారు. ఇప్పుడు సోనియా గాంధీ తెలంగాణ నుంచి బరిలోకి దిగితే పార్టీకి మరింత కలిసి వస్తుందని అనుకుంటున్నారు. ఎందుకంటే కర్ణాటక మినహా దక్షిణాది రాష్ట్రాలు బీజేపీకి కొరకరాని కొయ్యగా ఉన్నాయి. ఈ అవకాశాన్ని అనుకూలంగా మలుచుకోవాలని కాంగ్రెస్ భావిస్తున్నది.

Also Read: వైఎస్ షర్మిలకు టీ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి కౌంటర్

గతంలోనూ ఒకసారి సోనియా గాంధీ దక్షిణాది నుంచి లోక్ సభ బరిలో నిలిచారు. కర్ణాటకలోని బల్లారి నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఎంపీగా గెలిచారు. ఈ సారి ఖమ్మం నుంచి ఆమె బరిలో నిలబడినా.. గెలిచే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. రాహుల్ గాంధీకి దక్షిణాదిలోనూ చెక్ పెట్టాలని వయానాడ్‌ స్థానంలో బలమైన అభ్యర్థిని బరిలోకి దింపాలని బీజేపీ భావిస్తున్నది. మరి సోనియా గాంధీ కూడా ఖమ్మం నుంచి బరిలో నిలవడం ఖాయమైతే బీజేపీ వ్యూహం ఎలా ఉంటుందో చూడాలి. ఎందుకంటే దక్షిణాది నుంచి 40 నుంచి 50 లోక్ సభ సీట్లు గెలవాలని బీజేపీ సంకల్పించింది. ఇందుకోసం కర్ణాటక తర్వాత నెక్స్ట్ ఫోకస్ తెలంగాణ పైనే పెట్టనుంది.

click me!