టీఎస్‌పీఎస్‌సీ ప్రక్షాళనకు రేవంత్ సర్కార్ కసరత్తు: ఐఎఎస్‌ల అధ్యయనం

By narsimha lode  |  First Published Jan 5, 2024, 12:32 PM IST

తెలంగాణలో  టీఎస్‌పీఎస్‌సీని ప్రక్షాళన చేసేందుకు  రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది.


హైదరాబాద్:  తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్  ప్రక్షాళన దిశగా రేవంత్ సర్కార్ అడుగులు వేస్తుంది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన ప్రశ్నాపత్రాలు లీక్ కావడంతో  పలు పరీక్షలను రద్దు చేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మెన్ గా ఉన్న  జనార్ధన్ రెడ్డితో పాటు పలువురు  సభ్యులు రాజీనామాలు చేశారు. ఈ రాజీనామాలను  గవర్నర్ ఆమోదించలేదు. టీఎస్‌పీఎస్‌సీ చైర్మెన్, సభ్యులు  రాజీనామాలపై గవర్నర్ ఆమోదించిన తర్వాత కొత్త సభ్యులను నియమించాలని రేవంత్ రెడ్డి సర్కార్ భావిస్తుంది.
 
తెలంగాణలో  గతంలో నిర్వహించిన పరీక్షల విషయంలో అవకతవకలు జరిగినట్టుగా ఆరోపణలు వచ్చాయి.ఈ విషయమై పరీక్షలను రద్దు చేశారు. వంద మందికి పైగా సిట్ బృందం అరెస్ట్ చేసింది. దరిమిలా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్  ను ప్రక్షాళన చేయాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.  న్యూఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  యూపీఎస్‌సీ ఛైర్మెన్ ను  ఇవాళ కలుస్తున్నారు.  యూపీఎస్‌సీ పరీక్షల విధానంపై  చర్చించనున్నారు. 

యూపీఎస్‌సీ పరీక్షల విధానంపై తెలంగాణ రాష్ట్రానికి చెందిన కొందరు ఐఎఎస్ ల బృందం  ఇప్పటికే  అధ్యయనం చేస్తుంది.  కేరళ రాష్ట్రంలో పర్యటించిన బృందం ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక అందించనుంది. 

Latest Videos

undefined

also read:మెగా డీఎస్‌సీపై రేవంత్ రెడ్డి సర్కార్ కసరత్తు:నిరుద్యోగుల్లో ఆశలు

టీఎస్‌పీఎస్‌సీ నిర్వహించిన పరీక్ష ప్రశ్నా పత్రాల లీకేజీ కేసును సిట్  విచారించింది.దీంతో  ఈ కేసును విచారించిన సిట్ బృందం సభ్యులతో కూడ ఐఎఎస్ అధికారులు చర్చించనున్నారు.  సిట్ విచారణలో  గుర్తించిన అంశాల ఆధారంగా  భవిష్యత్తులో  ఇలాంటి తప్పులు పునరావృతం కాకుండా చర్యలపై  ఐఎఎస్ అధికారులు  నివేదికను తయారు చేయనున్నారు.

తెలంగాణలో  కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది.  బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో  టీఎస్‌పీఎస్‌సీ నిర్వహించిన పరీక్షలపై  కాంగ్రెస్ ఆరోపణలు చేసింది. అయితే  రానున్న రోజుల్లో నిర్వహించే పరీక్షల్లో  గతంలో జరిగిన పొరపాట్లు చేయకుండా పరీక్షలు నిర్వహించాలని రేవంత్ రెడ్డి సర్కార్  చర్యలు చేపట్టింది.

గతంలో నిర్వహించిన పరీక్షలు కొన్ని రద్దయ్యాయి. మరికొన్నివాయిదా పడ్డాయి. ఈ పరీక్షలు కొన్ని నిర్వహించాల్సి ఉంది. ఈ పరీక్షల నిర్వహణ విషయంలో  కూడ కొత్త చైర్మెన్ నియామకం తర్వాత  ప్రభుత్వం నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది.  టీఎస్‌పీఎస్‌సీ సభ్యుల రాజీనామాలపై  గవర్నర్ నిర్ణయం తర్వాత  ఈ  విషయమై ప్రభుత్వం  చర్యలు చేపట్టే అవకాశం ఉంది.


 

click me!