తెలంగాణలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీపై రేవంత్ రెడ్డి సర్కార్ తీసుకొనే నిర్ణయంపై నిరుద్యోగులు ఆసక్తిగా చూస్తున్నారు.
హైదరాబాద్: రాష్ట్రంలోని ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి ఆదేశించారు. దీంతో మెగా డీఎస్‌సీ ప్రకటన ఉండే అవకాశం ఉందనే నిరుద్యోగులు ఆశాభావంతో ఉన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో డీఎస్‌సీకి నోటిఫికేషన్ ఇచ్చారు. 2023 సెప్టెంబర్ మాసంలో డీఎస్‌సీ నోటిఫికేషన్ విడుదల చేశారు. 5,089 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని ఆనాడు నోటిఫికేషన్ విడుదల చేశారు.
అయితే 2023 అక్టోబర్ లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. దరిమిలా డీఎస్‌సీ పరీక్ష వాయిదా పడింది.
undefined
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి అధికారాన్ని కోల్పోయింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. తెలంగాణ ముఖ్యమంత్రిగా అనుముల రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టారు.
2023 డిసెంబర్ 30న రేవంత్ రెడ్డి విద్యా శాఖపై సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో కీలక ఆదేశాలు ఇచ్చారు. ప్రతి గ్రామ పంచాయితీ పరిధిలో స్కూల్ ఉండాలని అధికారులను ఆదేశించారు. తెలంగాణ రాష్ట్రంలో సుమారు 20,740 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని అధికారులు సీఎం దృష్టికి తీసుకు వచ్చారు. డీఎస్‌సీ నిర్వహణ విషయమై ప్రభుత్వం త్వరలోనే నిర్ణయం తీసుకొనే అవకాశం ఉందని చెబుతున్నారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో గత ఏడాది సెప్టెంబర్ మాసంలో ఇచ్చిన డీఎస్‌సీ నోటిఫికేషన్ పై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోననే సర్వత్రా ఆసక్తి నెలకొంది. విద్యాశాఖలో పదోన్నతులు కల్పించడం ద్వారా ఖాళీలు ఏర్పడే అవకాశం ఉంది.దీంతో ఈ ఖాళీలను భర్తీ చేయాల్సిన అనివార్య పరిస్థితులు నెలకొంటాయి.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత డీఎస్‌సీ నిర్వహించలేదు. కేసీఆర్ సర్కార్ అధికారంలో ఉన్న తొమ్మిదిన్నర ఏళ్లలో గత ఏడాది మాత్రమే డీఎస్‌సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. గత ఏడాది విడుదల చేసిన డీఎస్‌సీ నోటిఫికేషన్ పై కూడ నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం 13 వేల పోస్టులను భర్తీ చేయాలని ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. కానీ, అప్పటి సర్కార్ 5 వే ఉపాధ్యాయ పోస్టులను మాత్రమే భర్తీ చేయనున్నట్టుగా నోటిఫికేషన్ విడుదల చేసింది.
also read:గుడ్‌న్యూస్: తెలంగాణలో కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి హైకోర్టు గ్రీన్ సిగ్నల్
తెలంగాణలో 1.22 లక్షల ఉపాధ్యాయ ఉద్యోగాలకు అనుమతి ఉంది.ప్రస్తుతం 1.3 లక్షల మంది ఉపాధ్యాయులున్నారు. మిగిలిన ఉద్యోగాలను భర్తీ చేయాలనే డిమాండ్ నెలకొంది. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఉపాధ్యాయ పోస్టుల నియామకాలు చేపట్టాలని భావిస్తుంది. ఈ దిశగా రేవంత్ రెడ్డి సర్కార్ కసరత్తు చేస్తుందని సమాచారం.విద్యాశాఖ సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం నిరుద్యోగుల్లో ఆశలు రేకేత్తించాయి.