
రంగారెడ్డి :హోళీ పండగవేళ హైదరాబాద్ లో డ్రగ్స్ కలకలం రేగింది. హిమాయత్ సాగర్ వద్ద ఎండిఎంఏ డ్రగ్స్ విక్రయిస్తున్న పాతబస్తీకి చెందిన మహ్మద్ హమీద్ అలీని ఎస్వోటి పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. హమీద్ ఖరీదైన ఆడి కారులో తిరుగుతూ ఎవరికీ అనుమానం రాకుండా డ్రగ్స్ దందా చేస్తున్నట్లు ఎస్వోటి అధికారులు తెలిపారు. అతడి వద్దగల ఎండిఎంఏతో పాటు ఆడి కారును కూడా స్వాధీనం చేసుకున్నారు.
గత కొంతకాలంగా హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో భారీగా డ్రగ్స్ పట్టుబడుతోంది. సిటీకి దూరంగా పోలీస్ నిఘా తక్కువగా వుండే ప్రాంతాల్లో డ్రగ్స్ స్మగ్లింగ్ ముఠాలు అడ్డాగా మార్చుకుంటున్నాయి. ఎవరికీ అనుమానం రాకుండా శివారు ప్రాంతాల్లోనే ఇంజనీరింగ్ తో పాటు ఇతర కాలేజీల విద్యార్థులకు డ్రగ్స్ విక్రయిస్తున్నారు. అయితే ఇటీవల పోలీసులు, ఎస్వోటి బృందాలు ప్రత్యేక నిఘా పెట్టడంతో ఇంతకాలం యదేచ్చగా సాగిన డ్రగ్స్ ముఠాల చీకటి దందా బయటపడుతోంది.
ఇలా రెండ్రోజుల క్రితం భారీ గంజాయి స్మగ్లింగ్ ముఠా హైదరాబాద్ లో పట్టుబడింది. గంజాయి స్మగ్లింగ్ కోసమే డిసిఎంను రీడిజైన్ చేయించి పోలీస్ తనిఖీల నుండి తప్పించుకుంటూ రాష్ట్రాల బార్డర్లు దాటిస్తోంది ఈ కిలాడీ ముఠా. అయితే పక్కా సమాచారంతో ఏపీ నుండి 400కిలోల గంజాయితో వచ్చిన డిసిఎంను పట్టుకునేందుకు హైదరాబాద్ శివారులో పోలీసులు డెకాయ్ ఆపరేషన్ చేసారు. చౌటుప్పల్ సమీపంలో గంజాయిని తరలిస్తున్న డిసిఎంతో పాటు ముందున్న కారును కూడా పోలీసులు పట్టుకున్నారు. గంజాయిని తరలిస్తున్న నలుగురు ముఠా సభ్యులను అరెస్ట్ చేసారు. రహస్యంగా తరలిస్తున్న 400కిలోల గంజాయితో పాటు రీడిజైన్ చేసిన డిసిఎం, నిందితుల సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
Read More మందుబాబులకు షాక్.. ఆ రెండు రోజులు మద్యం దుకాణాలు బంద్..
ఇలాగే ఇటీవల హైదరాబాద్ శివారులోని ఇండస్ట్రియల్ ఏరియా పటాన్ చెరు మండలం ఇస్నాపూర్ లో డ్రగ్స్ దందా నిర్వహిస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. గతేడాది చివర్లో రంగారెడ్డి జిల్లాలోని షాద్ నగర్,నందిగామల్లో గంజాయి చాక్లెట్లను విక్రయిస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. నలుగురు ముఠా సభ్యులు గంజాయి చాక్లెట్లను విక్రయిస్తున్నట్టుగా పోలీసులు తెలిపారు. డ్రగ్స్ ను విక్రయిస్తున్న ఓ డాక్టర్ ను ఇటీవల పోలీసులు అరెస్ట్ చేశారు.
హైద్రాబాద్ శివారులో డ్రగ్స్ విక్రయిస్తున్న నైజీరియన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. బెంగుళూరు నుండి డ్రగ్స్ తీసుకువచ్చి హైద్రాబద్ లో విక్రయిస్తున్నట్టుగా పోలీసులు గుర్తించారు. నిందితుడిని గాడ్విన్ ఇతియాన్యిగా పోలీసులు చెప్పారు. నిందితుడి నుండి 20 గ్రాముల కొకైన్ ను పోలీసులు సీజ్ చేశారు.
ఇలా హైదరాబాద్ చుట్టూ డ్రగ్స్, గంజాయి దందా జోరుగా సాగుతోంది. యువతను ఈ మత్తుపదార్థాలకు బానిసలు చేస్తూ కోట్లు సంపాదిస్తున్నాయి స్మగ్లింగ్ ముఠాలు. తమ బిడ్డల భవిష్యత్ ను నాశనం చేస్తున్న డ్రగ్స్ ముఠాలను నిర్మూలించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.