ప్రమాదకర మస్కిటో కిల్లర్ లిక్విడ్ తాగి ఏడాదిన్నర బాలుడు ప్రాాణాలు కోల్పోయిన విషాద ఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది.
హైదరాబాద్ : దోమల నియంత్రణకు ఉపయోగించే మస్కిటో లిక్విడ్ తాగి ముక్కుపచ్చలారని చిన్నారి ప్రాణాలు కోల్పోయాడు. ఇంట్లో వస్తువులతో ఆడుకుంటూ బాలుడు ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో కంగారుపడిపోయిన తల్లిదండ్రులు హాస్పిటల్ కు తరలించారు. అయితే అప్పటికే బాలుడు మృతిచెందాడు. ఈ విషాద ఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది.
హైదరాబాద్ లోని చందానగర్ ప్రాంతంలో జుబేర్ కుటుంబంతో కలిసి నివాసముంటున్నాడు. అయితే శనివారం కుటుంబసభ్యులంతా ఎవరి పనుల్లో వారు బిజీగా వుండగా ఏడాదిన్నర వయసున్న కొడుకు అబ్బు జాకీర్ ఒక్కడే ఆడుకుంటున్నాడు. ఈ క్రమంలోనే దోమల కోసం ఉపయోగించే ఆలౌట్ లిక్విడ్ బాలుడి చేతికి చిక్కింది. అదేంటో కూడా తెలియని బాలుడు పొరపాటున అందులోని లిక్విడ్ తాగేసాడు. కొద్దిసేపటి తర్వాత బాలుడు స్ఫృహతప్పి పడిపోవడంతో కుటుంబసభ్యులు దగ్గర్లోని హాస్పిటల్ కు తరలించారు. కానీ అప్పటికే బాలుడు ప్రాణాలు కోల్పోయినట్లు డాక్టర్లు తెలిపారు. అప్పటివరకు కళ్లముందే ఆడుకున్న కొడుకు ఇలా హఠాన్మరణం చెందడంతో ఆ తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
Read More తల్లిని గొడ్డలితో నరికి అతి దారుణంగా హత్య చేసిన కొడుకు.. అడ్డువచ్చిందనే...
ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బాలుడి మృతికి కుటుంబసభ్యుల నిర్లక్ష్యమే కారణమని స్పష్టంగా తెలుస్తోంది. ప్రమాదకరమైన వస్తువులను చిన్నారులకు దూరంగా వుంచాలని... లేదంటే ఇలాంటి ప్రమాదాలు జరిగే అవకాశం వుంటుందని హెచ్చరిస్తున్నారు.