
హైదరాబాద్‌లోని సాగర్ రిండ్ రోడ్డు వద్ద నిర్మిస్తున్న ఫ్లైఓవర్ పనుల్లో అపశృతి చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్ స్లాబ్ కూలడంతో కనీసం ఎనిమిది మంది గాయపడ్డారు. బుధవారం తెల్లవారుజామున ఫ్లైఓవర్‌లోని రెండు పిల్లర్ల మధ్య కార్మికులు స్లాబ్‌ను వేస్తున్నప్పుడు ఈ సంఘటన జరిగింది. ఈ ప్రమాదంలో గాయపడిన కార్మికుల్లో ఎక్కువ మంది యూపీ, బీహార్‌కు చెందినవారే ఉన్నారు. ఘటన జరిగిన వెంటనే సహాయక బృందాలు ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను బయటకు తీయడం ప్రారంభించాయి. వారందరినీ సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. గాయపడినవారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా సమాచారం.
ఘటనా స్థలానికి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, జీహెచ్‌ఎంసీ అధికారులు, పోలీసు అధికారులు చేరుకుని పరిశీలించారు. శిథిలాల కింద ఇంకా ఎవరైనా చిక్కుకపోయారా? అనేది పరిశీలించారు. ఇక, ఈ ఘటనకు సంబంధించి దర్యాప్తు చేపట్టినట్టుగా ఏసీపీ శ్రీధర్ రెడ్డి తెలిపారు. ఫ్లై ఓవర్ ప్రమాద సమయంలో అక్కడ 8 మంది ఉన్నారని చెప్పారు. అందులో వర్క్ ఇంజనీర్ కూడా ఉన్నారని తెలిపారు. తెల్లవారుజామున 3.10 గంటలకు ప్రమాదం జరిగిందని అన్నారు. ఫ్లై ఓవర్ నిర్మాణంలో ఓ స్ట్రెచ్ మాత్రమే కూలిందని చెప్పారు.
ఇదిలా ఉంటే.. ఈ ఘటనపై ఆందోళన చేపట్టిన కాంగ్రెస్ శ్రేణులు.. సాగర్ రింగ్ రోడ్డు వద్ద నిరసనకు దిగారు. నాసిరకం పనుల వల్లే ఫ్లైఓవర్ స్లాబ్ కూలిందని విమర్శించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.