టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్.. రంగంలోకి సిట్, ఎవరిని వదిలేది లేదన్న ఏఆర్ శ్రీనివాస్

By Siva Kodati  |  First Published Mar 14, 2023, 9:08 PM IST

టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ ఘటనకు సంబంధించి సిట్ రంగంలోకి దిగింది. సీపీ సీవీ ఆనంద్ ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన సిట్ చీఫ్ ఏఆర్ శ్రీనివాస్ బేగంబజార్ పీఎస్‌ను సందర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. 
 


తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ ఘటనకు సంబంధించి విచారణను ప్రభుత్వం సిట్‌కు బదిలి చేసిన సంగతి తెలిసిందే. సిట్ చీఫ్ ఏఆర్ శ్రీనివాస్ నేతృత్వంలో విచారణ జరుగుతుందని హైదరాబాద్ నగర పోలీస్ కమీషనర్ సీవీ ఆనంద్ ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలో శ్రీనివాస్ రంగంలోకి దిగారు. టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌తో భేటీ అయిన ఆయన అనంతరం బేగంబజార్‌ పీఎస్‌కు చేరుకుని ఇన్స్‌పెక్టర్, ఏసీపీల నుంచి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ.. నిందితుల ఫోన్లు, ల్యాప్‌టాప్, కంప్యూటర్లను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపినట్లు తెలిపారు. ఎఫ్‌ఎస్ఎల్ నివేదిక ఆధారంగా కేసును సమగ్రంగా దర్యాప్తు  చేస్తామని సిట్ చీఫ్ వెల్లడించారు. పేపర్ లీకేజ్ వెనుక ఎంతటి వారున్నా వదిలేది లేదని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటి వరకు ఇద్దరికి మాత్రమే పేపర్లు లీకైనట్లుగా శ్రీనివాస్ పేర్కొన్నారు. 

మరోవైపు.. పేపర్ లీకేజ్ కేసుకు సంబంధించి టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్ జనార్థన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఏఈ పరీక్షపై రేపు నిర్ణయం తీసుకుంటామని.. ఈ పరీక్షపై ఇంకా నివేదిక రావాల్సి వుందని ఛైర్మన్ వెల్లడించారు. దురదృష్టకరమైన వాతావరణంలో ప్రెస్‌మీట్ పెడుతున్నానని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణ వచ్చాక దాదాపు 35 వేల ఉద్యోగాలను భర్తీ చేసినట్లు జనార్థన్ రెడ్డి వెల్లడించారు. ప్రస్తుతం 25 వేల ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కొనసాగుతోందన్నారు. టీఎస్‌పీఎస్సీ అనేక కొత్త విధానాలు తెచ్చిందని.. గ్రూప్ 1 ప్రిలిమ్స్‌లో దేశంలోనే ఎక్కడా లేని విధంగా మల్టిపుల్ జంబ్లింగ్ చేశామని ఛైర్మన్ తెలిపారు. ఎట్టి పరిస్ధితుల్లోనూ అక్రమాలు జరగొద్దనే ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నామని జనార్థన్ రెడ్డి చెప్పారు. 

Latest Videos

Also REad: పేపర్ లీక్ ఘటన.. తమిళిసై ఆరా, 48 గంటల్లో నివేదిక ఇవ్వాలంటూ టీఎస్‌పీఎస్సీకి ఆదేశం

అక్టోబర్ 16న గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించామని ఆయన తెలిపారు. అభ్యంతరాల స్వీకరణకు 5 రోజులు సమయం ఇచ్చామని జనార్థన్ రెడ్డి వెల్లడించారు. టౌన్ ప్లానింగ్ పరీక్షకు ముందుకు రోజు మాకు కొంత సమాచారం వచ్చిందని ఛైర్మన్ చెప్పారు. తమకు సమాచారం రాగానే పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఆయన తెలిపారు. పోలీసుల దర్యాప్తులో 9 మంది నిందితులుగా తేలారని జనార్థన్ రెడ్డి చెప్పారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగి రాజశేఖర్‌కు ఐపీ అడ్రస్‌లు తెలిసే అవకాశం వుందని ఆయన అన్నారు. రాజశేఖర్ కీలక సమాచారం యాక్సెస్ చేసినట్లు భావిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ఏఎస్‌వో ప్రవీణ్.. రాజశేఖర్ సాయంతో పేపర్లు సంపాదించాడని జనార్థన్ రెడ్డి చెప్పారు. 

లీకేజ్ పరిణామాల నేపథ్యంలోనే అత్యవసర సమావేశం నిర్వహించామని ఆయన వెల్లడించారు. ప్రవీణ్.. రూ.10 లక్షల కోసం పేపర్లు అమ్మాడని తెలిసిందన్నారు. తన కుమార్తె గ్రూప్ 1 రాసిందని వదంతులు వచ్చాయని.. తన పిల్లలు ఎవరూ గ్రూప్ 1 ప్రిలిమ్స్ రాయలేదని జనార్థన్ రెడ్డి స్పష్టం చేశారు. వదంతులకూ ఓ హద్దు అంటూ వుంటుందని.. సోషల్ మీడియాలో వదంతులను నమ్మొద్దని ఆయన హితవు పలికారు.  ప్రవీణ్‌కు గ్రూప్ 1 ప్రిలిమ్స్‌లో 103 మార్కులు వచ్చిన మాట వాస్తవమేనని జనార్థన్ రెడ్డి అంగీకరించారు. అయితే ప్రవీణ్‌కు వచ్చిన 103 మార్కులే అత్యధికం కాదని ఆయన స్పష్టం చేశారు. అలాగే ప్రవీణ్‌కు 103 మార్కులు వచ్చినా క్వాలిఫై కాని మాట కూడా వాస్తవమేనని ఛైర్మన్ వెల్లడించారు . ఈ కేసులో వున్న ఐదుగురు ప్రభుత్వ ఉద్యోగులు వారి ఉద్యోగాలు కోల్పోతారని ఆయన తెలిపారు. టీఎస్‌పీఎస్సీలో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగిని విధుల నుంచి తొలగించామని జనార్థన్ రెడ్డి చెప్పారు. 
 

click me!