బిఆర్ఎస్ ఎంపీ హత్యాయత్నంపై రాజకీయ దుమారం వేళ... సిద్దిపేట సిపి సంచలన వ్యాఖ్యలు

By Arun Kumar P  |  First Published Nov 2, 2023, 9:34 AM IST

మెదక్ ఎంపీ, బిఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ హత్యాయత్నానికి ఉపయోగించిన కత్తిని నిందితుడు ఎక్కడ  కొనుగోలు చేసాడు... ఎంపీ ప్రచార వివరాలను ఎలా తెలుసుకున్నాడో సిద్దిపేట సిపి శ్వేత వెల్లడించారు. 


సిద్దిపేట : తెలంగాణ  అసెంబ్లీ ఎన్నికల వేళ బిఆర్ఎస్ పార్టీ ఎంపీ, దుబ్బాక ఎమ్మెల్యే అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిపై హత్యాయత్నం సంచలనంగా మారింది. ఈ ఘటన రాజకీయ కలకలం సృష్టించింది. ఇది ప్రతిపక్ష కాంగ్రెస్, బిజెపిలు చేయించిన పనేనని... రాజకీయంగా ఎదుర్కోలేకే ఇలా హత్యారాజకీయాలకు పాల్పడుతున్నారని బిఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తున్నారు. ఎన్నికల్లో సానుభూతి కోసమే సొంత పార్టీ నాయకుడిపై బిఆర్ఎస్ హత్యయత్నం చేయించిందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నారు. ఇలా అధికార, ప్రతిపక్షాలు ప్రభాకర్ రెడ్డి హత్యాయత్నంపై ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకున్న సమయంలో పోలీసులు కీలక  ప్రకటన చేసారు. 

కేవలం సంచలనం సృష్టించడం కోసమే ఎంపీ ప్రభాకర్ రెడ్డిపై హత్యాయత్నానికి పాల్పడినట్లు నిందితుడు రాజు తమ విచారణలో వెల్లడించినట్లు సిద్దిపేట పోలీస్ కమీషనర్ శ్వేత తెలిపారు. ఎంపీపై దాడికి ముందుగానే ప్లాన్ వేసుకున్నట్లు... అందులో భాగంగానే ఏ రోజు ఎక్కడ ప్రచారం చేస్తున్నాడో సోషల్ మీడియా ద్వారా తెలుసునేవాడని తెలిపారు. ఇలా గత సోమవారం సూరంపల్లి గ్రామానికి ప్రభాకర్ రెడ్డి వస్తున్నట్లు తెలిసి రాజు అక్కడికి చేరుకున్నాడని... ఎంపీతో మాట్లాడాలంటూ దగ్గరకు వెళ్లి కత్తితో దాడి చేసినట్లు సిపి వెల్లడించారు. 

Latest Videos

ఎంపీ ప్రభాకర్ రెడ్డిపై దాడికి ఉపయోగించిన కత్తిని నిందితుడు దుబ్బాకలోనే కొనుగోలు చేసాడని సిపి తెలిపారు. వారంరోజుల ముందే దుబ్బాక మార్కెట్ లోని ఓ షాప్ లో కత్తిని కొనుగోలు చేసాడని... హత్యాయత్నం అనంతరం కత్తిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నిందితుడి ప్రాథమిక విచారణ పూర్తయిందని... పూర్తిస్థాయి విచారణ చేపట్టి త్వరలోనే వివరాలు వెల్లడిస్తామని సిపి తెలిపారు. 

Read More  హైదరాబాదులో ఐటీ సోదాలు.. కాంగ్రెస్ నాయకురాలు పారిజాత, బీఆర్ఎస్ నేత వంగేటి లక్ష్మారెడ్డి ఇళ్లలో తనిఖీలు..

ఎంపీపై హత్యాయత్నం అనంతరం రాజుపై కొందరు దాడికి పాల్పడ్డారని... గాయపడ్డ అతడిని హాస్పిటల్ కు తరలించినట్లు సిపి శ్వేత వెల్లడించారు. ప్రస్తుతం అతడు కోలుకోవడంతో అరెస్ట్ చేసి గజ్వేల్ కోర్టులో హాజరుపర్చామని... 14 రోజుల రిమాండ్ విధించినట్లు సిపి తెలిపారు. అతడికి కస్టడీలోకి తీసుకుని పూర్తిస్థాయి విచారణ చేపడతామని... ఈ హత్యాయత్నం వెనక ఇంకెవరైనా వున్నారా? ఎవరైనా సహకరించారా? అన్నది తెలుసుకుంటామని సిపి శ్వేత వెల్లడించారు. 
 

click me!