Siddipet: రైతుల‌కు మంత్రి గుడ్ న్యూస్‌.. ఈ పంట పండిస్తే రూ. 10 ల‌క్ష‌ల ప్రోత్సాహ‌కం ఇస్తామ‌ని ప్ర‌క‌ట‌న

Published : Jul 10, 2026, 03:18 PM IST
Siddipet

సారాంశం

Siddipet: సిద్ధిపేట జిల్లాలో ఆయిల్‌పామ్ సాగును పెద్ద ఎత్తున విస్తరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. ప్రస్తుతం జిల్లాలో సాగవుతున్న విస్తీర్ణాన్ని మరింత పెంచి 50 వేల ఎకరాలకు చేర్చాలనే లక్ష్యంతో రైతులను ప్రోత్సహిస్తోంది. 

50 వేల ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు లక్ష్యం

హుస్నాబాద్ నియోజకవర్గంలోని అక్కన్నపేట మండలం జనగామ గ్రామంలో నిర్వహించిన మెగా ఆయిల్‌పామ్ ప్లాంటేషన్ కార్యక్రమంలో మంత్రి వివేక్ వెంకటస్వామితో పాటు మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొని మొక్కలు నాటి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ప్రస్తుతం సిద్ధిపేట జిల్లాలో సుమారు 14 వేల ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు జరుగుతోందని మంత్రి తెలిపారు. జిల్లాలో సాగు విస్తీర్ణాన్ని 50 వేల ఎకరాలకు పెంచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. సంప్రదాయ పంటలతో పాటు అధిక ఆదాయం ఇచ్చే ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులు అడుగులు వేయాలని సూచించారు.

దేశంలో వంటనూనెల వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో దిగుమతులపై ఆధారపడకుండా దేశీయ ఉత్పత్తిని పెంచడం కోసం ఆయిల్‌పామ్ సాగు కీలకమని ఆయన పేర్కొన్నారు.

నాలుగేళ్లు ఓపిక పడితే మంచి ఆదాయం

ఆయిల్‌పామ్ పంటలో తొలి నాలుగేళ్ల వరకు రైతులు ఓపికగా సాగు కొనసాగిస్తే, అనంతరం దీర్ఘకాలికంగా మంచి ఆదాయం పొందే అవకాశం ఉంటుందని మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు. ప్రారంభ దశలో ప్రభుత్వం అందించే సబ్సిడీలు, రైతు భరోసా వంటి పథకాల ద్వారా రైతులకు ఆర్థిక సహాయం అందుతుందని చెప్పారు. వరి సాగుతో పోలిస్తే ఆయిల్‌పామ్‌కు తక్కువ నీరు అవసరమవుతుందని, హుస్నాబాద్ సమీపంలోనే ప్రాసెసింగ్ ఫ్యాక్టరీ ఉండటం వల్ల రైతులకు రవాణా సమస్యలు కూడా తక్కువగా ఉంటాయని వివరించారు.

వరి సాగుకు ప్రత్యామ్నాయంగా ఆయిల్‌పామ్‌పై దృష్టి

గత ఏడాది కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తిస్థాయిలో అందుబాటులో లేకపోయినా రాష్ట్ర ప్రభుత్వం అధిక మొత్తంలో వరి కొనుగోలు చేసిందని మంత్రి గుర్తుచేశారు. ప్రస్తుతం గోదాములు ధాన్యంతో నిండిపోవడంతో పాటు బియ్యం ఎగుమతులు, ఎఫ్‌సీఐ కొనుగోళ్లలో ఉన్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని రైతులు లాభదాయకమైన ప్రత్యామ్నాయ పంటలను ఎంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

చెన్నూరు ప్రాంతంతో పాటు ఇతర ప్రాంతాల్లో కూడా ఆయిల్‌పామ్ సాగుపై రైతులు ఆసక్తి చూపుతున్నారని తెలిపారు. గ్రామాల్లో ప్రజాప్రతినిధులు, వ్యవసాయ శాఖ అధికారులు విస్తృత ప్రచారం నిర్వహించి ఆయిల్‌పామ్ ప్రయోజనాలను రైతులకు వివరించాలని సూచించారు.

100 ఎకరాలకు పైగా సాగు చేసిన గ్రామానికి రూ.10 లక్షల ప్రోత్సాహకం

ఆయిల్‌పామ్ సాగును ప్రోత్సహించేందుకు మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక ప్రకటన చేశారు. ఒక గ్రామంలో 100 ఎకరాలకు పైగా ఆయిల్‌పామ్ సాగు జరిగితే ఆ గ్రామానికి రూ.5 లక్షల ప్రోత్సాహకం అందజేస్తామని ప్రకటించారు. దీనికి స్పందించిన జిల్లా ఇన్‌చార్జి మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి తన వ్యక్తిగత నిధుల నుంచి మరో రూ.5 లక్షలు అందిస్తానని ప్రకటించారు. దీంతో 100 ఎకరాలకు పైగా ఆయిల్‌పామ్ సాగు చేసిన గ్రామానికి మొత్తం రూ.10 లక్షల ప్రోత్సాహకం లభించనుంది.

ఆయిల్‌పామ్ రైతుకు సత్కారం..

ఈ కార్యక్రమంలో ఆయిల్‌పామ్ సాగులో ముందున్న రైతు సంపత్ను మంత్రులు ప్రత్యేకంగా అభినందించి సత్కరించారు. కార్యక్రమంలో మున్నూరు కాపు కార్పొరేషన్ చైర్మన్ బొమ్మ శ్రీరాం చక్రవర్తి, జాయింట్ కలెక్టర్ లక్ష్మీకిరణ్, మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుపతి రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ శివయ్య, ప్రజాప్రతినిధులు, వ్యవసాయ శాఖ అధికారులు, పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Hyderabad Real Estate : మరో కూకట్ పల్లి, నిజాంపేట్ లోడింగ్... ఈ శివారు ప్రాంతాల్లో పెట్టుబడి మీ జీవితాన్నే మార్చేస్తుంది
Gandhari Khilla: 1000 ఏళ్ల నాటి అద్భుతం.. ఎండాకాలంలోనూ ఉప్పొంగే బావులు.. తెలంగాణ అడవుల్లో దాగున్నగాంధారి కోట రహస్యాలు !