మీ పిల్లలను అంగన్వాడీకి పంపించడం కాదు.. అంగన్వాడీలే మీ ఇంటికి వచ్చేస్తున్నాయి

Published : Jul 07, 2026, 06:41 PM IST
Mobile Anganwadi

సారాంశం

తెలంగాణ ప్రభుత్వం పిల్లలకు పోషకాహారం అందించడమే కాదు చిన్నతనంలోనే మంచి విద్యాబుద్దులు నేర్పేందుకు సరికొత్త ప్రయోగం చేస్తోంది. మొబైల్ అంగన్వాడీల పేరిట ప్రత్యేక ఏర్పాటు చేసింది. ఇవి ఎలా సేవలు అందిస్తాయో తెలుసా?

Mobile Anganwadi : ఉపాధి వెతుక్కుంటూ వచ్చే వలస కార్మికుల పిల్లలకు అండగా నిలిచేందుకు తెలంగాణ ప్రభుత్వం వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. వలస కార్మికులు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి నిరంతరం మారుతుండటం వల్ల వారి పిల్లలు ప్రభుత్వ సంక్షేమ పథకాలకు, ముఖ్యంగా అంగన్వాడి సేవలకు దూరమవుతున్నారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారంగా 'మొబైల్ అంగన్వాడి' సేవలను అందుబాటులోకి తెచ్చింది.

తెలంగాణ కార్మిక శాఖ సహకారంతో మహిళా, శిశు సంక్షేమ శాఖ రూపొందించిన ఈ ప్రత్యేక మొబైల్ అంగన్వాడి వాహనాన్ని మంత్రులు గడ్డం వివేక్ వెంకటస్వామి, సీతక్క ప్రారంభించారు. అధికారులతో కలిసి మొబైల్ అంగన్వాడీ వాహనాన్ని పరిశీలించిన మంత్రులు జెండా ఊపి ప్రారంభించారు. ఈ పైలట్ ప్రాజెక్ట్ మొదటి విడతగా మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలోని ఇందిరమ్మ కాలనీలో తన సేవలను అందించనుంది.

మొబైల్ అంగన్వాడి ప్రత్యేకతలు..

ఈ ప్రత్యేక వాహనం ద్వారా వలస కార్మికులు నివసించే ప్రాంతాలకే నేరుగా వెళ్లి అంగన్వాడీ సేవలను అందిస్తారు.

పోషకాహార పంపిణీ : చిన్నారుల ఆరోగ్యకరమైన ఎదుగుదలకు అవసరమైన పౌష్టికాహారాన్ని అందించడం.

ఆరోగ్య సంరక్షణ : క్రమం తప్పకుండా చిన్నారుల ఆరోగ్య పర్యవేక్షణ, వైద్య పరీక్షలు.

ప్రీ-స్కూల్ విద్య : ఆటపాటలతో కూడిన ప్రాథమిక విద్యా బోధన.

విజయవంతమైతే మరిన్ని వాహనాలు: మంత్రి వివేక్ వెంకటస్వామి

మొబైల్ అంగన్వాడీ వాహనాలు ప్రారంభోత్సవం సందర్భంగా మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ.. చిన్నారుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో అంగన్వాడి కేంద్రాల పాత్ర అత్యంత కీలకమన్నారు. "వలస కార్మికులు ఒక చోట స్థిరంగా ఉండకపోవడం వల్ల వారి పిల్లలు చదువుకు, ఆరోగ్యానికి దూరమవుతున్నారు. అలాంటి వారి చెంతకే సేవలను తీసుకెళ్లాలనే మంత్రి సీతక్క ఆలోచన ఎంతో అభినందనీయం. ఈ పైలట్ ప్రాజెక్ట్ విజయవంతమైతే రాబోయే రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా మరిన్ని మొబైల్ అంగన్వాడి వాహనాలను అందుబాటులోకి తెస్తాం" అని అన్నారు.

ఒక్క చిన్నారి కూడా చదువుకు దూరం కాకూడదు: మంత్రి సీతక్క

మంత్రి సీతక్క మాట్లాడుతూ… నగరాలకు వలస వచ్చే కార్మికుల పిల్లలు ఎలాంటి సేవలకు దూరం కాకూడదనే ఏకైక లక్ష్యంతో ఈ మొబైల్ అంగన్వాడి కేంద్రాలను డిజైన్ చేసినట్లు పేర్కొన్నారు. అంగన్వాడి కేంద్రాలు లేని మారుమూల ప్రాంతాలు, లేబర్ కాలనీలపై ఈ వాహనాలు ప్రత్యేక దృష్టి సారిస్తాయని సీతక్క వివరించారు.

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

హాస్పిటల్లో చేరిన కేటీఆర్ కొడుకు హిమాన్షు.. మనవడి కోసం హుటాహుటిన హైదరాబాద్ కు కేసీఆర్.. ఇంతకూ ఏమయ్యింది?
రెండుసార్లు ఎమ్మెల్యేగా చేసినా సొంతిల్లు లేదా..! సింప్లిసిటీలో గుమ్మడి నర్సయ్య నే మించిపోయిన మాజీ ఎమ్మెల్యే ఇకలేరు